అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి
న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాల్సిందే : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
నోయిడాలో కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, అరెస్టులు ఆపాలని, అరెస్టయిన కార్మికులను విడుదల చేయాలని, వీరి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మంగళవారం ఆల్ ట్రేడ్ యూనియన్ల డిమాండ్స్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామ పరిధిలోని సీబీఎల్ పరిశ్రమ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోయిడా పారిశ్రామిక కార్మికులు లక్షలాది మంది రోడ్లను దిగ్బంధం చేయడం జరిగిందన్నారు. అక్కడి కార్మికులు జనవరి నుంచి యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కులకోసం మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. అత్యంత ఆధునికమైన పారిశ్రామిక ప్రాంతంలో నెలకు రూ.11 వేలు అతి తక్కువ జీతాలు చెల్లిస్తూ ఎక్కువ శ్రమ చేయించుకుంటున్నారని ఆరోపించారు.
కార్మికులకు ఆదివారం సెలవులు ఉండవని, పనిచేస్తే ఓటీ ఉండదని, రోజుకు 12 గంటల పని చేయాలని, ఈఎస్‌ఐ, ప్రావిడెంట్ ఫండ్, బోనస్ ఉండదన్నారు. ఏ హక్కులూ లేకుండా కార్మికులను అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, దాన్ని నోయిడాలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. నోయిడా, గ్రేటర్ నోయిడాతో సహా ఆ ప్రాంతం నేషనల్ కారిడార్ రీజియన్ మొత్తం కూడా కార్మికులు సమ్మె చేశారన్నారు. ఇదే రకమైన పోరాటం గతంలో కూడా హర్యానాలో చేసిన తర్వాతే జీతాలు పెరిగాయని గుర్తు చేశారు. ఎల్‌అండ్‌టీలో 10 వేల మంది కార్మికులు సమ్మె చేశారని, దాని తర్వాతే హర్యానాలో జీతాలు పెరిగాయన్నారు. అంతేకాదు, ప్రస్తుతం బీహార్, రాజస్థాన్, తదితర ప్రాంతాలతోపాటు పారిశ్రామిక ప్రాంతాల్లోనూ కార్మికులు పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికీ నోయిడాలో 400 మందిని అరెస్ట్ చేశారని, సమ్మె చేస్తున్న గ్రామాల మీద పడి ఇంకా అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. కేంద్రం, మంత్రులు కార్మికులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారన్నారు. పాకిస్తాన్ ఏజెంట్లు అంటున్నారని, ఇక్కడ జీతాలు పెంచమంటే పాకిస్తాన్ ఏజెంట్లు అనడం దారుణమన్నారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం కార్మికులపై కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా యూపీలోని బీజేపీ ప్రభుత్వం బుద్ది తెచ్చుకొని కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. రాష్ట్ర పర్యటనలో మోడీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, ఉపాధ్యక్షులు పి.భాగారెడ్డి,యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రసన్న రావు, కాంట్రాక్టు యూనియన్ జిల్లా కార్యదర్శి కే.సురేష్,యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నోయిడా కార్మికులపై నిర్బంధం ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



