అమెరికా అప్రజాస్వామిక, గొంతెమ్మ కోరికల కారణంగా పశ్చిమాసియాలో అది సృష్టించిన సంక్షోభానికి తెరపడే సూచనలు కనిపించటం లేదు. ఒక రోజు ఆలసయమైనా మనవంటి దేశాలకు ప్రాణం మీదకు వస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే మన జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నారు.ఇలా అనేక దేశాలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి రావటంతో అనేక దేశాలు సంక్షోభానికి తెరపడినట్లే భావించాయి. కానీ తాజా పరిణామాలను చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. సంప్రదింపులు చివరి దశలో ఉన్నాయన్న ట్రంప్, అదే నోటితో రెండు మూడు రోజుల్లో గనుక ఒప్పందం మీద సంతకాలు చేయకపోతే దాడులు తప్పవని, దౌత్య మార్గం వెంటనే మూసుకుపోతుందని హూంకరించాడు. వెంటనే గల్ఫ్ దేశాలు కోరాయి గనుక చివరి నిమిషంలో వెనక్కు తగ్గినట్లు కోతలు కోశాడు. శుద్ధి చేసిన యురేనియంపై అదుపు కలిగి ఉండటం తమ సర్వసత్తాక హక్కని ఇరాన్ సుప్రీమ్ నేత మజ్తాబా ఖమేనీ స్పష్టం చేశాడు. ఇరాన్ డిమాండ్‌కు రష్యా సంపూర్ణ మద్దతును బహిరంగంగా ప్రకటిం చటం తాజా పరిణామాల్లో సరికొత్త అంశం. దౌత్య పద్ధతుల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని కూడా గట్టిగా చెప్పింది.
దౌత్య కిటికీ మూసుకుపో తుందని ట్రంప్ చెబితే అదేం కుదరదని పుతిన్ చెప్పటంగా ఈ వ్యాఖ్యలను చూడవచ్చు. శుద్ధి చేసిన యురేని యంను అణుబాంబుల తయారీకే వినియో గిస్తుందని అమెరికా ప్రచారం చేయటం హిమాలయమంత అబద్దం. ప్రపంచంలో అణువిద్యుత్ కేంద్రాలున్న దేశాలన్నీ యురేనియంను శుద్దిచేసే వినియోగిస్తాయి. కత్తిని కుత్తుకలను ఉత్తరించటానికి వినియో గించవచ్చు, కూరగాయలను కోసేందుకు ఉపయోగించవచ్చు. తాము ఇప్పటికీ గతంలో సంతకం చేసిన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు ఇరాన్ పదే పదే చెబుతున్నది.ఈ అంశంలో తమతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగిందీ, అమలు చేయనిదీ అమెరికా అని గొంతెత్తి చెబుతున్నా అమెరికా అదుపు ఆజ్ఞల్లో ఉండే అంతర్జాతీయ మీడియా సంస్థలు విననట్లు, కననట్లు నటిస్తున్నాయి.తమ వద్ద ఉన్న యురేనియంను మరోదేశం, సంస్థకు అప్పగిస్తే తమకు భద్రత ఉండదని ఇరాన్ అంటున్నది. చరిత్రను చూసిన పుడు తొలిసారిగా అణుబాంబు లను తయారు చేసిన అమెరికా రెండవ ప్రపంచ యుద్ధ ముగింపు సమయంలో జపాన్ లొంగిపోయిన తరువాత అవసరం లేకపోయినా హీరోషిమా, నాగసాకీ నగరాల మీద వేసింది.
అది జపాన్‌ను లొంగదీసుకోవ టం కాదు, తమ వద్ద ఎంతటి ప్రమాదకర ఆయుధం ఉందో చూడండి, మాకు లొంగని దేశాల మీద వేసేందుకు వెనుకాడబోమని బెదరించటమే అది. అందుకే ఆ తరువాత సోవియట్ యూనియన్, ఫ్రాన్సు, బ్రిటన్, చైనా కూడా వాటిని తయారు చేశాయి. తరువాత మనదేశం, పాకిస్తాన్ కూడా అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకం చేసేందుకు నిరాకరించి అణుపరీక్షలు జరిపి వాటి సరసన చేరిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం మీద సంతకాలు చేసిన దేశాలు కూడా తమ వద్ద ఉన్న బాంబులను మరింతగా నవీకరిస్తున్నవి, గతం కంటే శక్తివంతమైన వాటిని ఏదో ఒక పేరుతో తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ కూడా తమకూ అలాంటి హక్కుకు అనుమతించాలి లేదా దేశ భద్రతకు గట్టి హామీ అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. ‘సావిత్రీ నీపతి ప్రాణంబు దక్క అన్న యుముడి మాదిరి’ ఆ అంశం గురించి ట్రంప్ మాట్లాడటం లేదు. అమెరికా నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనలను తాము అందుకున్నా మని, వాటిని పరిశీలిస్తున్నట్లు చెబుతూనే తమ రేవుల దిగ్బంధనాన్ని విరమించాలని, విదేశాల్లో స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.
ఒప్పందమంటూనే దాడుల బెదిరింపులను చూస్తుంటే మరోసారి దాడులు జరిపేందుకు వాషింగ్టన్ సిద్ధమౌతున్నట్లు, మిలిటరీ లక్ష్యాలను వదులు కోలేదని ఇరాన్ అనుమానిస్తున్నది. అదే జరిగితే వివాదం మధ్య ప్రాచ్యం ఆవలకు విస్తరిస్తుందని కూడా హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయిల్ మీడియా సరికొత్త కథలను వండి వారుస్తున్నది. ఇరాన్ తన మిలిటరీ కేంద్రాలను తిరిగి పునరుద్ధరిస్తున్నదని, డ్రోన్ల తయారీ మొదలు పెట్టిందన్నది వాటి సారాంశం. దీనికి అమెరికా గూఢచార నివేదికలు ఆధార మంటూ చెప్పుకుంటున్నాయి. తమ ఆరువారాల దాడులలో వాటన్నింటినీ పనికి రాకుండా ధ్వంసం చేసినట్లు ట్రంప్ పదే పదే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏదో ఒకటే నిజం కావాలి, ఇరాన్‌ను చావుదెబ్బ తీసినట్లు ఆ పెద్దమనిషి బడాయి కబుర్లు అయినా చెప్పి ఉండాలి, లేకపోతే ఉత్తుత్తి కేంద్రాల మీద దాడులు చేసి అవి నిజమని వెర్రి వెంగళప్పలుగా అయినా మారి ఉండాలి. యుద్ధం, ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో అబద్దాలు ఆడటం ధర్మబద్దమే అని పెద్దలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇరాక్, లిబియా, ఇరాన్, వియత్నాం, వెనెజులా తదితర దేశాల మీద అమెరికన్లు దాడులు, దురాక్రమణలకు దిగినపుడు చెప్పిన కట్టుకథల గురించి వేరే చెప్పనవసరం లేదు. ఒకవైపు చర్చలు మరోవైపు బెదిరింపులు ఇంకో వైపు ఇలాంటి కథలను చెబితే నమ్మేవారెవరూ లేరు.
అదే పీఠముడి, అవే బెదిరింపులు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



