టాప్ సీడ్ ఆటగాడు శుభారంభం
స్వైటెక్, స్విటోలినా ముందంజ
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ (ఫ్రాన్స్) : కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న ఇటలీ స్టార్ ఆటగాడు, వరల్డ్ నం.1 జానిక్ సినర్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ వేటను ఘనంగా మొదలెట్టాడు. వరుసగా ఐదు ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్స్ సాధించిన ఉత్సాహంలో ఉన్న జానిక్ సినర్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించాడు. ఫ్రాన్స్ ఆటగాడు క్లెమంట్ టబుర్‌పై 6-1, 6-3, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించాడు. 8 ఏస్‌లు, ఓ డబుల్ ఫాల్ట్స్ చేసిన జానిక్ సినర్.. ఐదు బ్రేక్ పాయింట్లతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. పాయింట్ల పరంగా 100-65తో సినర్ ఆధిపత్యం చెలాయించాడు. సినర్ 18 గేమ్‌లు గెల్చుకోగా.. క్లెమంట్ ఎనిమిది గేమ్‌లతోనే సరిపెట్టుకున్నాడు. మూడు సెట్లలో సింగిల్ సర్వ్ కూడా కోల్పోకుండా సినర్ చెలరేగాడు. స్పెయిన్ ఆటగాడు అలెగ్జాండ్రో ఫోకినా 4-6, 6-7(3-7), 1-6, 3-6తో అర్జెంటీనా ఆటగాడు థియాగో ఆగస్టిన్ చేతిలో నాలుగు సెట్ల మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇటలీ ఆటగాడు ఫెడరికో 3-6, 1-6, 3-6తో జెస్పర్ డె జోంగ్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలై ఇంటిముఖం పట్టాడు. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ బ్లాక్స్ వాకోవర్ ఇవ్వటంతో ఆ్రస్టేలియా ఆటగాడు అలెక్స్ రాకెట్ పట్టకుండానే రెండో రౌండ్ నుంచి ముందంజ వేశాడు.
స్వైటెక్, స్విటోలినా ముందంజ
ఫ్రెంచ్ ఓపెన్ నాలుగు సార్లు చాంపియన్ ఇగా స్వైటెక్ (పొలాండ్) మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మూడో సీడ్ స్వైటెక్ 6-2, 6-3తో వరుస సెట్లలో విజయం సాధించింది. చెక్ రిపబ్లిక్ అమ్మాయి సారా బెజ్లిక్ పోటీ ఇవ్వలేకపోయింది. ఇగా స్వైటెక్ ఏడు బ్రేక్ పాయింట్లతో పైచేయి సాధించింది. చెక్ అమ్మాయి కండ్లుచెదిరే రీతిలో మాజీ చాంపియన్ సర్వ్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. కానీ, సొంత సర్వ్‌ను నిలుపుకోవటంలో తేలిపోయింది. పాయింట్ల పరంగా 65-49తో స్వైటెక్ పైచేయి సాధించింది. ఉక్రెయిన్ అమ్మాయి, ఏడో సీడ్ ఎలినా స్విటోలినా 6-0, 6-4తో కైట్లిన్ క్వివెడో (స్పెయిన్)పై గెలుపొందింది. 4 ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లతో స్విటోలినా మెప్పించింది. పాయింట్ల పరంగా 65-50తో స్విటోలినా తనదైన జోరు చూపించింది. చెక్ రిపబ్లిక్ అమ్మాయి మారీ బౌచ్కోవ 0-6, 6-7(3-7)తో వరుస సెట్లలో బ్రిటన్ ప్లేయర్ ఫ్రాన్సెస్క జోనెస్‌పై గెలుపొంది మూడో రౌండ్‌కు చేరుకుంది. ఐదో సీడ్, అమెరికా అమ్మాయి జెస్సికా పెగులా 6-1, 3-6, 3-6తో అన్‌సీడెడ్ ప్లేయర్ కింబర్లీ బిర్రెల్ (ఆస్ట్రేలియా) చేతిలో పరాజయం పాలైంది. ఏడు ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లతో పెగులా రాణంచినా.. ఆసీస్ అమ్మాయి ఆరు బ్రేక్ పాయింట్లతో వరుస సెట్లలో పైచేయి సాధించింది. పెగులాను ఇంటిబాట పట్టించి మూడో రౌండ్‌కు చేరుకుంది. పాయింట్ల పరంగా 80-76తో పెగులా పైచేయి సాధించినా టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించక తప్పలేదు. 11వ సీడ్, స్విట్జర్లాండ్ అమ్మాయి బెలింద బెన్సిక్ 6-4, 6-0తో అమెరికా అమ్మాయి కాటీ మెక్‌నాలీపై వరుస సెట్లలో గెలుపొందింది. 3 ఏస్‌లు, ఆరు బ్రేక్ పాయింట్లతో బెలింద మెరిసింది. 60-32తో పాయింట్ల పరంగా బెలింద పైచేయి సాధించింది.



