
నవతెలంగాణ పెద్దవంగర: నాణ్యమైన విద్యను బోధిస్తూ విద్యార్థుల్లో దాగివున్న మేదోసంపత్తిని వెలికితీయడానికి ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక చొరవ చూపాలని ఎస్సీఈఆర్టీ సభ్యులు సయ్యద్ మతిన్ మహమ్మద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, చిన్నవంగర లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఆజాద్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. వారు ప్రార్ధన సమయానికి పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, పలు రికార్డులను రిజిస్టర్లు, పాఠశాలల నిర్వహణ తీరును పరిశీలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన సిలబస్ గురించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పలు అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు ఎంఈవో బుధారపు శ్రీనివాస్ తో కలిసి మాట్లాడుతూ.. త్వరలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని విద్యార్థులు భయాన్ని వీడి పూర్తిస్థాయిలో పరీక్షలకు సంసిద్ధులు కావాలన్నారు. పరీక్ష ప్రశ్నా పత్రాల మీద మైండ్ మ్యాపింగ్ చేశారు. పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, చదివిన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలో పలు అంశాలపై విద్యార్థుల సందేహాలకు నివృత్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో భాగంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఆధారిత (కృత్రిమ) విద్యను అందించడానికి చర్యలు తీసుకుంటుంది అన్నారు. ప్రతి విద్యార్థి కనీస సామర్థ్యాలను కలిగి ఉండాలని, అందుకోసం తగు రీతిలో వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పది పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధన కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేస్తున్న భోజన సదుపాయాలను, మధ్యాహ్నం భోజనాన్ని కూరలను పరిశీలించారు. రుచి, శుచి, శుభ్రత పాటించి నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి గంగారపు స్రవంతి కి సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ఉపాధ్యాయులు సదయ్య, శ్రీధర్, సువర్ణ, హైమ, ప్రభాకర్, కవిరాజు, ప్రదీప్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.