ఎండ ‘చంపుతోంది’ !

భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే విపరీతమైన వేడి గాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. ఎండ నుంచి రక్షణకు సరైన వసతులు లేక వడదెబ్బ బారిన పడుతున్నారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలో ఒకే రోజు అస్వస్థతకు గురై ముగ్గురు మృతి చెందారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం..
నవతెలంగాణ-మల్హర్‌రావు
మల్హర్‌రావు మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పల్నాటి రమేష్‌(50) మే 28న మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత తల తిరగడం, వాంతులు చేసుకుని.. సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స కోసం కరీంనగర్‌ పట్టణంలోని చల్మడ ఆనందరావు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు పంపించారు. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. అలాగే, మండల కేంద్రమైన తాడిచెర్లకు చెందిన తూండ్ల సమ్మయ్య(50) రోజులాగే పొలాల్లో ట్రాక్టర్‌ ద్వారా పశువుల ఎరువు పోయడానికి వెళ్లాడు. ఎండకు తట్టుకోలేక మధ్యాహ్నం వాంతులు చేసుకున్నాడు. చెట్టుకింద కూర్చుని అక్కడికక్కడే మృతిచెందాడు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కావటి దుర్గమ్మ(65)ఉపాధిహామీ పనికి వెళ్లి వచ్చి మధ్యాహ్నం సమయంలో సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సమయంలోనే ప్రాణం కోల్పోయింది. ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన చామకూరి రాము(38) గ్రామ సమీపంలోని ఇసుక క్వారీకి పనికి వెళుతున్నాడు. రోజులాగే శనివారం కూడా వెళ్లాడు. అక్కడ వడదెబ్బకు గురై ఇబ్బంది పడగా.. ఏటూరునాగరం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

Spread the love