స‌మ‌తా సూర్యుడు

Samatha SuryaBe Educated, Be Organized and Be Agitated
ఇప్పటికీ యువతలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతున్న మూడు వాక్యాలివి. సమసమాజ నిర్మాణానికి చదువు, వ్యవస్థీకరణ, ఉద్యమతత్వం అనే త్రిసూత్రాలను ప్రతిపాదించి భారతీయుల జీవన చిత్రాన్ని సరికొత్తగా నిర్మించిన మహా జ్ఞాని డా .భీం రావ్‌ రాంజీ అంబేద్కర్‌. అట్టడుగు సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ ఆకాశమే హద్దుగా అనంతమైన జ్ఞాన సాధన చేయడం ద్వారా ఎలాంటి వారైనా అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చు అని నిరూపించిన నూతన సామాజిక స్వాప్నికుడు డాక్టర్‌ అంబేద్కర్‌.
మహారాష్ట్రలోని ‘మౌ’ అనే గ్రామంలో సామాజిక అసమానతలు అణచివేతకు గురయ్యే దళిత కుటుంబంలోని 14 మంది సంతానంలో ఒకడిగా జన్మించాడు. అక్షరాన్ని ఆయుధంగా నమ్ముకుని, జ్ఞానాన్ని సాధనంగా మలచుకొని, పుస్తకాన్ని మార్గంగా చేసుకొని, తను ఎదుగుతూ, తన ప్రజలను కూడా జ్ఞానమార్గంలో పయనింప చేయాలని నిరంతరం తపించిన జ్ఞాన స్ఫూర్తి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌. ఆయన రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, సంఘసంస్కర్త, ఆర్థిక నిపుణుడు, భారతదేశ తొట్ట తొలి న్యాయశాఖ మంత్రి కూడా.
అప్పట్లో భారతదేశంలో ఎన్నో రకాల అసమానతలు, కులపరమైన వైవిధ్యతలు, సామాజిక అంతస్తులు అనాది కాలం నుంచి కొనసాగుతూ వచ్చాయి. దాని వల్ల వివిధ రకాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ పరమైన అసమానతలు సమాజంలో నెలకొన్న స్థితి ఒకవైపు, దేశమంతా బ్రిటిష్‌ దాస్య శఖలాలలో మగ్గి పోతుండడం మరొకవైపు, సామాన్య ప్రజలంతా కుల పరమైన అణచివేతలో, సామాజిక దురాక్రమణలో మగ్గిపోవడం ఇంకొక వైపు ముప్పేటగా దాడి చేస్తున్నతీరు ఆనాటి పరిస్థితి. అంటరానితనాన్ని, సామాజిక వెలివేతను, దానిలోని దుఃఖాన్ని, బాధని, కష్టాలను సాటి మానవుల నుంచి వివక్షని నిరంతరం ఎదుర్కొన్న ఆ మహనీయుడు ఒక్కటే కలగన్నాడు. మనుషులంతా సమానంగా గౌరవించబడాలి అనేదే ఆయన స్వప్నం.!
సమతే నిజమైన మతం:
మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన భావోద్వేగం మతం అని గుర్తించిన అంబేద్కర్‌ ”»I like the religion that teaches liberty, equality and fraternityµµ” అని భావించారు. అందుకే కుల, మత, ప్రాంత, భాష, వర్గ, లింగ భేదాలకు అతీతంగా మానవులంతా సగౌరవంగా బ్రతకాలి. అలాంటి రోజు రావాలి అని నిరంతరం స్వప్నించిన క్రాంతదర్శి ఆయన. ఆ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా, మార్పుని ఆహ్వానించే దిశగా ప్రయత్నాన్ని తననుంచే మొదలెట్టాలి అనుకున్నాడు. తన జీవితాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని సామాజిక నియంత్రణకు అతీతమైన జ్ఞానాన్ని సంపాదించారు. మనిషి నిరంతరం సామాజిక శంఖలాల్లో, వివక్షల సంకెళ్ళలో మగ్గుతున్నప్పటికీ అలాంటి మనిషికి విముక్తి చదువు ద్వారా, అక్షరం ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం అని నమ్మి ఆ మార్గాన్ని ఎంచుకుని, ఆ దిశగా ప్రయాణించి, వివిధ దేశాలలో తన ప్రతిభని నిరూపించుకుని, అత్యున్నత న్యాయ నిపుణుడుగా ప్రపంచ మేధావులందరి చేత ప్రశంసలు పొందిన అత్యున్నత మానవుడు అంబేద్కర్‌.
ఒక మనిషి తన జీవితకాలంలో ఎంత చదవవచ్చు, ఎంత విజ్ఞానాన్ని సంపాదించవచ్చు అని చెప్పడానికి సజీవ ఉదాహరణ అంబేద్కర్‌ అధ్యయనం. కొలంబియా, లండన్‌ యూనివర్సిటీలలో అత్యున్నత చదువులు చదివి, ప్రపంచ దేశాల న్యాయశాస్త్రాలన్నింటిని ఔపోశనపట్టిన మేధావిగా, బహు భాషలలో నిపుణుడైన కోవిదుడుగా, తనదైన ప్రత్యేక ముద్రని వేసుకుని ప్రపంచ మానవుడిగా కీర్తించబడిన మహనీయుడు అంబేద్కర్‌.
వ్యక్తిత్వ వికాస పాఠం:
అంబేద్కర్‌ ఆలోచనా విధానం, అధ్యయన శీలత, ఆచరణాత్మక దక్పథం సమస్త మానవాళికి ఆదర్శనీయం అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన జీవన ప్రస్థానం అంతా ఒక వ్యక్తిత్వ వికాస పాఠంలా అనిపిస్తుంది. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఆటంకాలు, ప్రతిబంధకాలు ఎన్ని ఎదురైనా, వాటన్నిటినీ అధిగమించగలిగే సంకల్పం, దీక్ష, పట్టుదల, జ్ఞానాన్వేషణ మనిషిలో కొత్త సూర్యున్ని మేల్కొల్పుతుందని నిరూపించి చూపించి, తర్వాతి తరానికి, ఈ తరం విద్యార్థులకు, యువకులకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా ఉన్న మహనీయుడు ఆయన.
భారతదేశాన్ని ప్రభావితం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. వేద భూమిగా, జ్ఞానభూమిగా, ఎన్నెన్నో గ్రంథాలు, విజ్ఞానాల సంకలనంగా భారతదేశం ఉంది. ఈ నేల మీద ప్రభవించిన వ్యక్తులలో, సామాజిక సంస్కరణ, సామాజిక స్వాతంత్రం, సమన్యాయం, వివక్ష నుంచి విముక్తి అనే అంశాల పరంగా బి.ఆర్‌. అంబేద్కర్‌ యావత్‌ జాతిని ఎంతగానో ప్రభావితం చేశారు.
సమానత్వ సాధనే గమ్యం:
»»Equality may be a fiction. But nonetheless one must accept it as a governing principl” అని ప్రగాఢంగా విశ్వసించిన అంబేద్కర్‌ భావజాలం, సర్వమానవ సమానత్వాన్ని, సకల జనుల సౌభ్రాతత్వాన్ని, మానవాళి గౌరవనీయమైన జీవన విధానాన్ని ఆకాంక్షించింది. ప్రపంచ వ్యాప్తంగా కార్ల్‌ మార్క్స్‌, మహాత్మా గాంధీ, మార్టిన్‌ లూథర్‌ వంటి వారు ఎంతగా తమ దార్శనికతతో ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేశారో, భారత జాతిలోని అట్టడుగు, బలహీన, పీడిత, తాడిత, శ్రామిక, కర్షక, కార్మిక, మహిళా వర్గాలకు చెందిన ప్రజలందరి ఆలోచనా ధోరణిని అంబేద్కర్‌ అంతగానే ప్రభావితం చేశారు.
‘»»So long as you do not achieve social liberty, whatever freedom is provided by the law is of no avail to you” అని మానవ వికాసానికి సామాజిక స్వేచ్ఛ ప్రాధాన్యతను ఎంతగానో చెప్పిన ఆయన వేలాది సంవత్సరాలుగా అణచివేతకు, వివక్షకు గురి అయి, ఆదరణకు నోచుకోని కోట్లాది ప్రజల స్వరంగా మారారు. వారందరి తరఫున సామూహిక బందగానాన్ని తన మేధాశక్తితో ప్రపంచానికి వినిపించారు. అందుకే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా స్వతంత్ర భారత భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించగలిగారు. ప్రపంచ రాజ్యాంగాలన్నిటికీ స్వర్గధామంగా, మేధావులందరిచేత ప్రశంసించబడ్డ భారత రాజ్యాంగ నిర్మాతగా తనదైన ముద్రను వేశారు. మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమన్యాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వ్యక్తి వికాసానికి ప్రభుత్వ తోడ్పాటు ఎలా ఉండాలో నిర్దేశించారు. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం ఆమోదించబడిన భారత రాజ్యాంగ రచనలో కీలకమైన పాత్ర పోషించి అన్నివర్గాల ప్రజల హక్కుల పరిరక్షకులుగా మేరునగ ధీరుడిగా చరిత్రలో నిలిచారు.
అంబేద్కర్‌ భావజాలం భారతదేశం అంతటా ఒక నవ్య సామాజిక సంస్కరణకు దారి తీసింది. ఆయన ఆలోచనా విధానం నూతన సామాజిక విప్లవానికి బాటలు వేసింది. రిజర్వేషన్‌ వంటి రక్షణ చర్యల్ని రాజ్యాంగబద్ధంగా రూపొందించడమే కాక, అట్టడుగు వర్గాల ప్రజల వికాసానికి, విద్యనే ఆయుధంగా చేసుకోవాలని వారు ఇచ్చిన పిలుపు ఇప్పటికీ ఎప్పటికీ శిరోధార్యంగా నిలిచింది.
భారతదేశంలో అత్యధిక ప్రజలు నిమ్న స్థాయి ప్రజలే. అలాంటి ప్రజల ఆర్థిక, సామాజిక, మానసిక, విద్యాపరమైన వికాసం కోసం అంబేద్కర్‌ ప్రయత్నాలు, ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రచారం చేసిన భావజాలం ప్రజలలో ఎంతో మార్పుని తీసుకొచ్చింది. 135 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ అంబేద్కర్‌ ఆలోచనా విధానం భారతదేశానికి కొత్త వికాస సూచికగా ‘అభివద్ధి నమూనా’గా నిలుస్తోంది. కుల వ్యవస్థ నిర్మూలన దిశగా, సమాజంలో సర్వమానవ సమానత్వ భావన దిశగా వారు చేసిన ప్రయత్నాలు, వారు నాటిన జ్ఞాన విత్తనాలు ఇప్పుడు ఎన్నో ఫలాలని ఇస్తున్నాయి.
అంబేద్కర్‌ – తెలంగాణ:
తెలంగాణ ప్రజలు అంబేద్కర్‌ ఆలోచనా ధోరణి, భావజాలానికి అత్యధికంగా ప్రభావితం అయిన వారిలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. అరవై ఏళ్ల పాటు వివిధ దశలలో ప్రజల నిరంతర పోరాటం, నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష, పద్నాలుగేళ్ళ మలిదశ తెలంగాణ ఉద్యమం.. వీటన్నిటి వెనుక ప్రజలను నడిపించిన ఒకే ఒక్క ఆశ అంబేద్కరిజం, అంబేద్కర్‌ ఆలోచనా విధానమే. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం వెనక చిన్న రాష్ట్రాల ఏర్పాటు ద్వారా సామాజిక ఆర్థిక, రాజకీయ, ప్రగతి సాధ్యమౌతుందని నొక్కి చెప్పిన అంబేద్కర్‌ ఆలోచనా ధోరణే కారకంగా పనిచేసింది.
అందుకే ప్రతీ ప్రభుత్వం అట్టడుగు, దళిత, బలహీన, బడుగు, పీడిత, తాడిత ప్రజలు, మహిళల సర్వతోముఖ వికాసం కోసం నిరంతరం అంకితభావంతో పని చేయాల్సి ఉంది. దేశంలో వినూత్నమైన, ఆచరణ యోగ్యమైన, స్థానిక మూలాల ప్రతిపదికపై నిర్థారించి అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలందరిలో ఆత్మగౌరవ భావనని, వికాస స్ఫూర్తిని నెలకొల్పవలసిన ఆగత్యం ఉంది.
ఒకానొక సందర్భంలో అంబేద్కర్‌ ”I measure the progress of a community by the degree of progress which women have achieved” అని చెప్పిన మాటలు ప్రతీ ప్రభుత్వానికి, పాలకులకి దారి దీపాలు.
ఆయన విగ్రహం ఓ దిక్సూచి:
అంబేద్కర్‌ ఒక వ్యక్తిగా కనిపించినా, ఆయన ఓ భావజాలం! అందుకే 1991లో ఆయన శత జయంతి సందర్భంలో దేశమంతటా ఆయన ఆలోచనాధార ప్రజలందరిలో వెల్లువలా పెల్లుబికింది. ఒక వైపు ఆర్థిక సంస్కరణలతో సరళీకరణకు ద్వారాలు తెరుస్తూ విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్న నేపధ్యంలో, మనదైన భారతీయ మూలాల అస్తిత్వ పతాకగా అంబేద్కర్‌ భావజాలం పల్లె పల్లెకూ విస్తరించింది. దేశమంతటా ‘గ్లోబలైజేషన్‌’ కమ్ముకుంటున్న తరుణంలో ‘అంబేద్కరిజం’ ‘లోకలైజేషన్‌’ సాధించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలు వెలిసాయి. అందుకే ‘అంబేద్కర్‌ విగ్రహం’ వ్యక్తి పూజ పరిమితులను దాటి సామాన్య అట్టడుగు భారతీయుల ”సామూహిక పత్రిక” ((Collective symbol)గా పరిణమించింది.
ఆ క్రమంలోనే భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ స్మతిలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఆయన భారీ విగ్రహాలను నెలకొల్పారు. 2023 లో తెలంగాణలో 175 అడుగుల ఎత్తులో, 2024లో అమరావతిలో 206 అడుగుల ఎత్తుతో మరికొన్ని చోట్ల భారీగా అంబేద్కర్‌ విగ్రహాలను నిర్మించారు.
ఇది ఆ మహనీయుడికి సామాన్య ప్రజలందరు సవినయంగా సమర్పించిన నీరాజనం. ఏ తాత్వికుడి దార్శనికత వల్ల రాజ్యాంగం ఏర్పడిందో, ఆ మహనీయుడికి అణగారిన వర్గాల ప్రజలు అర్పిస్తున్న సభక్తికమైన నివాళి!
ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదు. ఆయా ప్రాంతాలకు విచ్చేసే ప్రతి పౌరుడికి, ప్రతి పర్యాటకుడికి, మానవాళి మొత్తానికీ నిత్య చైతన్య దీప్తి!
ఆయా నగరాలలో, రాష్ట్రాలలో నివసించే, సంచరించే ప్రజలకి, ప్రభుత్వానికి, ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు, పారిశ్రామికవేత్తలకి అందరికీ నిరంతర స్ఫూర్తి!
అంబేద్కర్‌ మార్గం ప్రజల పట్ల, భారతదేశం పట్ల, సామాజిక బాధ్యత పట్ల మనకు ఉండాల్సిన అనురక్తిని కలకాలం గుర్తు చేసే దిక్సూచి!
అంబేద్కర్‌ జీవితం ఎప్పటికప్పుడు సమాజ అభ్యున్నతికి పునరంకితం కావాలనే దీక్షకు ఒక సందేశం!
(ఏప్రిల్‌ 14 డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 135వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి)

డా||మామిడి హరికష్ణ,
8008005231 

Spread the love