హోలీ తెచ్చిన తీపి రుచులు

The sweet flavors brought by Holiహోలీ అంటేనే ఆనందాల కేళీ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో సరదాగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఈ రోజున కుల, మతాలకు అతీతంగా అందరూ ఒక్కటై ఆనందంగా గడుపుతారు. ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే… ఈ సందర్భంగా ఇష్టమైన వారికి హోలీ శుభాకాంక్షలు తెలిపే ముందు నోరు తీపి చేస్తుంటాం. ప్రతిసారీ స్వీట్లను బయట నుంచి కొని తీసుకురాకుండా ఈసారి కొన్ని రకాల స్వీట్లను ఇంట్లోనే తయారు చేయండి.
గుజియా స్వీట్‌
కావల్సిన పదార్థాలు: మైదా – మూడు కప్పులు, నెయ్యి – ఒకటిన్నర కప్పు, నీళ్లు – పావు కప్పు, పంచదార – కప్పు, కోవా – 200 గ్రాములు, బాదంపప్పు – 10 (సన్నగా తరగాలి), బొంబాయిరవ్వ – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూను.
తయారీ విధానం: ముందుగా మైదా పిండిని ఒక గిన్నెలో వేసుకుని సరిపడినన్ని నీళ్లు, కాస్త నెయ్యి వేసి మెత్తని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత దీనిపై ఒక తడి గుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి రవ్వను బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌపై పాన్‌ పెట్టి కోవాను వేయించండి. ఇందులోకి సన్నగా తరిగిన బాదంపప్పు, యాలకుల పొడి, వేయించిన రవ్వ, చక్కెర అన్నీ వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు మైదా పిండిని ముద్దులుగా చేసి చిన్న చపాతీల లాగా చేసుకోవాలి. ఇప్పుడు గుజియా (కజ్జికాయ) అచ్చుపై వత్తుకున్న చపాతీని వుంచి అందులోకి మనం తయారు చేసుకున్న కోవా, రవ్వ మిశ్రమాన్ని వేయాలి. తర్వాత గుజియా అచ్చు పక్కన ఉన్న మిగతా పిండిని తొలగించాలి. ఇలా పిండిని తొలగిస్తే కజ్జికాయలు మంచి ఆకారంలో వస్తాయి. ఇలా చపాతీలాగా పిండిని వత్తుకుని, మిశ్రమాన్ని కలిపి అన్ని కజ్జికాయలనూ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు అందులో రెడీ చేసి పెట్టుకున్న గుజియాలను వేసి.. బంగారు రంగు వచ్చేంత వరకు దొరగా వేయించుకోవాలి. అంతే.. గుజియా స్వీట్లు రెడీ అయిపోతాయి. వీటిని వేడివేడిగా తిన్నా లేదా చల్లారిన తర్వాత తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి.
రసగుల్ల
కావల్సిన పదార్థాలు: పాలు – లీటరు (వెన్న తీయనివి), నిమ్మరసం – మూడు టేబుల్‌ స్పూన్లు, చక్కెర – రెండు కప్పులు, నీరు – లీటరు, పాలు – టేబుల్‌ స్పూను, ఉప్మారవ్వ – టీ స్పూను, పిస్తాపలుకులు – ఇరవై.
తయారీ విధానం: పాలను మందపాటి గిన్నెలో పోసి స్టవ్‌ మీద పెట్టాలి. అవి బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి నిమ్మరసం వేసి కలపాలి. ముందు సగం నిమ్మరసం వేసి కలిపి చూసి, పాలు బాగా విరిగితే మిగిలిన రసాన్ని ఆపేయాలి. పాలు సరిగ్గా విరగకపోతే మొత్తం రసాన్ని వేసి కలపాలి (పాశ్చరైజేషన్‌ జరగని పాలకు ఒక స్పూన్‌ నిమ్మరసం సరిపోతుంది). విరిగిన పాలను పలుచని వస్త్రంలో పోసి మూట కట్టి ఏదైనా కొక్కేనికి లేలాడదీయాలి. ఓ అరగంట తర్వాత నీరు పోయేలా చేత్తో గట్టిగా నొక్కాలి. ఆ తర్వాత పైన బరువు పెట్టాలి. ఇలా చేయడం వల్ల నీరంతా కారిపోతుంది. పాలు విరుగు మాత్రం మూటలో మిగులుతుంది. పాల విరుగులో రవ్వ వేసి వేళ్లతో నలుపుతూ కలపాలి. ఇలా చేస్తూ ఉంటే పాల విరుగు ముందు పొడిగా మారుతుంది. మరికొంత సేపటికి ముద్దగా అవుతుంది. ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న గోళీలుగా చేయాలి. వేడల్పుగా, లోతుగా ఉన్న కడాయిలో చక్కెర, నీరు పోసి వేడి చేయాలి. చక్కెర కరిగిన తర్వాత అందులో టేబుల్‌ స్పూను పాలు పోయాలి. రెండు నిమిషాలకు చక్కెర ద్రవం శుభ్ర పడి అందులోని మలినాలు నల్లగా పైకి తేలుతాయి. స్పూనుతో కానీ చిల్లుల గరిటెతో తీసేయాలి. లేదంటే పలుచని వస్త్రంలో వడపోయడం మంచిది. వడపోసిన ద్రవాన్ని మళ్లీ కడాయిలో పోసి మరిగించాలి. ఇప్పుడు చక్కెర ద్రవంలో పాల విరుగుతో చేసిన గోళీలను వేసి నాలుగైదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి.(పెద్ద మట మీద ఉడికిస్తే రసగుల్లాలు విరిగిపోతాయి). చిన్న గోళీలుగా వేసిన రసగుల్లాలు చక్కెర పాకాన్ని పీల్చుకుని పెద్దవవుతాయి. అప్పుడు స్టవ్‌ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత కప్పులో రసగుల్లాతో పాటు ఒక టేబుల్‌ స్పూన్‌ సిరప్‌, పిస్తా వేసి సర్క్‌ చేయాలి.
(గమనిక: రసగుల్లాలకు చేసే చక్కెర ద్రవం పలుచగా ఉండాలి. పాకం రాకూడదు)
ఫిర్ని
కావల్సిన పదార్థాలు: బియ్యం – పావు కప్పు, వెన్న తీయని పాలు – లీటరు, చక్కెర – అర కప్పు, బాదం పప్పు – పది, పిస్తా – పది, యాలకుల పొడి – అర టీ స్పూను, కుంకుమ పువ్వు – పదిహేను రేకలు, పన్నీరు – రెండు టీ స్పూన్లు(ఇష్టమైతేనే), కిస్‌మిస్‌ – ఇరవై, జీడిపప్పు – పది.
తయారీ విధానం: బియ్యం కడిగి మందపాటి బట్ట మీద వేసి నీడలో ఆరబెట్టి, తేమ పోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్‌ చేయాలి.(మరీ మెత్తగా అక్కరలేదు). ఈ లోపు ఒక చిన్న పాత్రలో నీటిని వేడి చేసి అందులో బాదం, పిస్తా వేసి మూత పెట్టాలి. అరగంట తర్వాత నీటిని వడపోసి పొట్టు వలిచి, సన్నగా తరగాలి. వెడల్పుగా, మందంగా ఉన్న పాత్రలో పాలు మరిగించాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గరిటెడు పాలను చిన్న పాత్రలోకి తీసుకుని కుంకుమ పువ్వు రేకలు వేసి నానబెట్టాలి. పాత్రలో పాలను మరో రెండు నిమిషాల సేపు మరిగించిన తర్వాత మంట తగ్గించి బియ్యప్పిండి, చక్కెర వేసి అడుగు పట్టకుండా, ఉండకట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి. చిక్కబడుతున్నప్పుడు యాలకుల పొడి వేయాలి. మిశ్రమం చిక్కబడిన తర్వాత కుంకుమ పువ్వు కలిపిన పాలు, బాదం, పిస్తా సగం వేసి కలపాలి. ఇవన్నీ వేసిన తర్వాత మరో రెండు లేదా మూడు నిమిషాలు మరగనిచ్చి పన్నీరు వేసి కలిపి స్టవ్‌ ఆపేయాలి. అంతే ఫిర్నీ రెడీ.
రస్‌మలై
కావల్సిన పదార్థాలు: రసగుల్లాలు – పదిహేను(ఇంట్లో చేసినవైతే బాగుంటాయి), పాలు – లీటరు, చక్కెర – ఐదు టేబుల్‌ స్పూన్లు, బాదం – పది, పిస్తా – పది, యాలకుల పొడి – టీ స్పూను, కుంకుమ పువ్వు – ఇరవై రేకలు.
తయారీ విధానం: అరకప్పు వేడి నీటిలో బాదం, పిస్లాలను అరగంట సేపు నానబెట్టి పొట్టు తీసి తరగాలి. పావు కప్పు వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. మందపాటి బాణలిలో పాలు మరిగించాలి. పైకి తేలిన మీగడను స్పూన్‌తో తీసి ఒక గిన్నెలో వేసుకుంటూ పాలు అడుగంటకుండా కలుపుతూ, పాలు సగమయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు చక్కెర వేసి కరిగే వరకు కలుపుతూ మరిగించాలి. యాలకుల పొడి, బాదం, పిస్తా(సగం), కుంకుమ పువ్వు పాలు కలిపి వీటి రుంచి పాలకు పట్టే వరకు సన్నమంట మీద మరిగించాలి. ఇప్పుడు రసగుల్లాలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని గరిటె లేద అట్లకాడ సాయంతో లేదా వేళ్లతో చక్కెర పాకం జారిపోయేటట్లు మెల్లగా నొక్కాలి. ఇలా రసగుల్లాలన్నింటినీ నొక్కి జాగ్రత్తగా పాలలో వేయాలి. రెండు నిమిషాలపాటు పాలలో ఉడకనిచ్చి స్టవ్‌ ఆపేయాలి. రసమలై చల్లారిన తర్వాత కప్పులో వేసి మీగడ(ఇష్టమైతే), బాదం, పిస్తాలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.

Spread the love