ఇటీవల కాలంలో బాడీషేమింగ్ బాగా పెరిగిపోయింది. రంగూ, రూపాన్ని చూపి మహిళలను అవహేళన చేస్తున్నారు. సాధారణ మహిళలు, సెలబ్రెటీలు చివరకు అధికారులు సైతం దీనికి అతీతులు కారు. దానికి ఉదాహరణ ఈ సంఘటన. తన శరీర రంగు గురించి వస్తున్న కామెంట్లపై.. సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ భావోద్వేగ పోస్టు పెట్టారు. ఒక సీఎస్‌గా పనిచేస్తున్నప్పటికీ.. నల్లగా ఉన్నావంటూ వర్ణ వివక్షకు గురి అవుతున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త రంగుతో తనను పోల్చి కొందరు నెటిజన్లు చేసిన పోస్టులు చూసి.. ఆమె స్పందించారు. ఇంతకీ ఆమె ఎవరు. ఈ రంగు వివాదం ఏంటో తెలుసుకుందాం.
కేరళకు చెందిన శారదా మురళీధరన్ పుట్టుకతో కొంత నల్లగా ఉండేది. ఆమెను చూసి చాలామంది హేళన చేసేవారు. తన శరీర రంగును చూసి నలుగురూ నవ్వడంతో నాలుగేండ్ల వయసులో తల్లికి చెప్పుకొని తీవ్ర వేదనకు గురయ్యింది. కూతురిని బుజ్జగించి ఏదో సర్దిచెప్పింది. అయితే పెరిగిన తర్వాత కూడా ఆ చిన్నారికి అవే ఛీత్కారాలు, అవమానాలు, హేళనలు. కష్టపడి చదివి.. ఐఏఎస్ పాస్ అయి ఉద్యోగం సాధించారు. మరో ఐఏఎస్‌ను పెండ్లి చేసుకున్నారు.
ఎన్నో ఉన్నత పదవులు
1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి శారదా మురళీధరన్.. ఆరేండ్ల పాటు కేరళ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. అలాగే త్రివేండ్రం జిల్లా కలెక్టర్‌గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషన్‌గా.. ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత ఏడాది కేరళ చీఫ్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈమె కంటే ముందు అదే స్థానంలో ఆమె భర్త డాక్టర్ వేణు పని చేసి రిటైర్ అయ్యారు. మొదట భర్త.. ఆ వెంటనే ఆ స్థానంలో శారదా మురళీధరన్ నియమితులు కావడం విశేషం.
నలుపు పేరుతో…
గతంలో ఎన్నో ఉన్నత పదువులు చేపట్టి ఇప్పుడు సీఎస్‌గా ఉన్నప్పటికీ నలుపు పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమెకు వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. తర్వాత కొందరు ఆకతాయిలు ఆమె శరీర రంగు గురించి కామెంట్లు చేశారు. భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ ‘ఆ పదవికి మీరేం సరిపోతారు?’ అంటూ పోస్టులు పెట్టారు. అయితే ఆమె వీటికి స్పందిస్తూ తాను నల్లగా ఉన్నాను అనే విషయాన్ని తాను అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. మొదట తాను చేసిన పోస్ట్‌కు వచ్చిన కామెంట్లతో కంగారు పడి.. ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయితే ఇలాంటి అంశాలు తప్పనిసరిగా చర్చించాలని.. తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు చెప్పడంతో మళ్లీ తిరిగి తన మనసులో ఉన్నది మొత్తం ఆమె షేర్ చేశాను.
నాలుగేండ్ల వయసులోనే…
ఇదే సమయంలో చిన్నతనంలో తాను ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ శరీర రంగు వల్ల చిన్నతనంలోనే ఆమె పెద్ద మాటలు పడాల్సి వచ్చింది. తాను నల్లగా ఉన్నానని.. తన తల్లి వద్దకు వెళ్లి.. తనను గర్భంలోకి తీసుకెళ్లి తెల్లగా, అందంగా తీసుకురాగలవా అని నాలుగేండ్ల వయసులోనే అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే ఆ శరీర రంగు ప్రభావం తనపై 50 ఏండ్ల పాటు కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో అందరి లాగే ఆమె కూడా నల్ల రంగుకు విలువ లేదనే భావనలో తెల్లటి రంగు పట్ల ఆకర్షితురాలయ్యారు. దానివల్ల తనను తాను తక్కువ చేసుకున్నారు. కానీ నలుపు అంటే అద్భుతమని, అందంగా ఉందని ఆమె పిల్లలే ఆమెకు తెలియజేశారు. దాంతో ‘నలుపు విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తారు’ అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారిసింది. జరగాల్సిన చర్చ జరుగుతోందని చాలా మంది శారదకు సపోర్ట్‌గా కామెంట్లు పెడుతున్నారు.