రాజకీయ నేతలలో అగ్రగణ్యుడు

The most prominent political leader1891 ఏప్రిల్‌ 14వ తేదీన భీం రావ్‌ రాంజీ అంబేద్కర్‌ జననం. అంబేద్కర్‌ తల్లిదండ్రులు బీమా బారు, రాంజీ మాలోజీ సత్‌పాల్‌. మధ్యప్రదేశ్‌లోని బ్రిటీష్‌ సైనిక స్థావరం అయిన ‘మౌ’ జన్మస్థలం. తల్లిదండ్రులకు 14వ సంతానం. ఆఖరివాడుగా జన్మించాడు. ఆయన ఆ రోజుల్లో అంటరాని కులంలో (మహర్‌) జన్మించాడు. మొదట్లో ఈయనింటి పేరు ‘అంబావాడేకర్‌’ కాగా, కృష్ణాజీ అంబేద్కర్‌ అనే ఉపాధ్యాయునికి ప్రీతి పాత్రుడుగా వున్నందువల్ల అంబావాడేకర్‌ను అంబేద్కర్‌గా మార్చాడు. ఆనాటి నుండి భీంరావ్‌ రాంజీ అంబేద్కర్‌గా పేరు స్థిరపడింది.
అంబేద్కర్‌ తండ్రి బ్రిటీష్‌ సైన్యంలో సైనిక ఉద్యోగి కారణంతో మౌ నుండి బొంబాయికి కాపురం మారింది. దీనితో అంబేద్కర్‌ తల్లిదండ్రుల సంరక్షణలో మంచి క్రమశిక్షణతో పెరిగిన బాలుడు. అంతేకాదు బాల్యం నుండే మంచి మేధావి. చురుకైన విద్యార్థిగా పేరు పొందినవాడు. 1907 నాటికి యల్‌.పి.స్టోన్‌ పాఠశాలలో మెట్రిక్యులేషన్‌ ప్రథమశ్రేణిలో ఉత్తేర్ణుడయ్యాడు. భయంకరంగా అంటరానితనం కొనసాగుతూ దళితులు చదువుకునే వీలు లేని ఆ రోజుల్లో ఓ దళితుడు ప్రథమ శ్రేణిలో ఉత్తేర్ణుడు కావడం అనే అంశం సంచలనం అయింది. ఎవరూ హర్షించలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. కానీ సంచలనంతో కూడిన ఆ విజయం భీంరావ్‌ రాంజీ అంబేద్కర్‌ను సన్మానించింది కూడా. ఇదంతా ఒకకోణం. మరో కోణంలో చూస్తే మనకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు గోచరిస్తాయి. అడుగడుగునా అంటరానితనం వెంటాడుతూ కుదురుగా కూర్చోనివ్వరు, నిలబడనివ్వరు. దప్పిక అయితే గుక్కెడు నీళ్లు తనంతట తనను తాగనివ్వరు. నలుగురిలో కలవనివ్వరు, ఆడుకోనివ్వరు. ఇన్ని అవమానాలు పొందుతూ మెట్రిక్యులేషన్‌ చదివి, సన్మానాలు పొందిన విద్యార్థి మన అంబేద్కర్‌.
మెట్రిక్యులేషన్‌ తదనంతరం పై చదువులు కొనసాగిస్తున్నాడు. ఆ క్రమంలో బొంబాయి యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తిచేశాడు. బరోడా మహరాజు (తాయాజీరావ్‌ గైక్వాడ్‌) వారి 25 రూపాయల ఉపకార వేతనంతో విదేశీ చదువులకు శ్రీకారం చుట్టాడు. అంబేద్కర్‌ డిగ్రీలో ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టాపొందాడు. నేడు విదేశాలలో యూనివర్సిటీ స్థాయిలో 100 మంది పేరు ప్రఖ్యాతులలో అగ్రగణ్యుడు. ఇలా విదేశాలలో చదువు పూర్తి చేసుకున్న అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చాక విధిగా 10 సంవత్సరాల పాటు సంస్థానంలో పని చేయాలనే బరోడా మహారాజు నిబంధనల ప్రకారం రక్షణశాఖ ఉద్యోగంలో చేశాడు. కులం అడ్డుగోడలు భయంకర స్థాయికి చేరగా ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి చేరాడు. బొంబాయిలో ట్యూషన్‌లు చెప్పడం, కన్‌సెల్టెన్సీ కంపెనీలు నడపడం చేశాడు. ఇక్కడా కుల సమస్యలే. అవమానాలు, చిన్నచూపులే. దానితో బొంబాయి గవర్నర్‌ సహాయంతో కాలేజీ ప్రొఫెసర్‌గా చేరాడు కొంతకాలం. ఆ తరువాత జడ్జిగా కూడా పనిచేశారు. ఇలా హిందీ, పాళి, సంస్కృతం, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, పర్షియన్‌, ఫ్రెంచ్‌ భాషలు అయిన 9 భాషల్లో ప్రావీణ్యుడు. బి.ఎ, యం.ఎ, యం.యస్‌.సి, యల్‌.యల్‌.బి, బారిస్టర్‌, డిలిట్‌, పి.హెచ్‌డి మొదలగు ఎన్నో డిగ్రీలు సాధించాడు. డిగ్రీలు సాధించడం కాదు ముఖ్యం, భరతజాతి అగ్రగణ్యుడు ఎలా అయ్యాడు? భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల నిమ్నజాతుల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితోద్ధారకుడు, స్త్రీ జనోద్ధారకుడు, మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, డా||బి.ఆర్‌.అంబేద్కర్‌కు ఎలా సాధ్యం?
అంటరానితనంతో అవమానాల ఫలితంగా, పేదరికం అనుభవించినా పట్టుదల, కృషి, ఆత్మాభిమానం, మానవతా దృక్పథం, చివరికి అన్వేషణ, అధ్యయనం అనే ఆయుధాలతో పోరాడాడు. కులం, మతం, జాతి, లింగ వివక్షలకు తావీయక సార్వభౌమాధికారంతో భరతఖండంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లినంత కాలం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలవారు కొనియాడగా డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు కాగా తత్ఫలాలను తరతరాల భరత జాతి అనుభవిస్తున్నారు. అంటే ఆ శక్తి ప్రదాత బి.ఆర్‌.అంబేద్కర్‌ అనేది ఎవ్వరూ కాదనలేదు కదా!
అలాగే బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓ ఫిలాసఫర్‌, ఓ ఆంత్రోపాలజిస్ట్‌, ఓ హిస్టారియన్‌, మంచి వక్త, మంచి రచయిత, ఆర్థిక వేత్త, పరిశోధకుడు, పత్రికా సంపాదకుడు, ఎన్నో ప్రతిభాపాఠవాలు గల శిఖరాగ్రం. భారత్‌లో అత్యధిక సంఖ్యలో విగ్రహాలు ఏర్పాటు చేయబడినవాడు డా||బి.ఆర్‌. ముఖ్యంగా చదువుకునే హరిజన, గిరిజన విద్యార్థులకు వసతిగృహాలు వుండాలని మొట్టమొదటిగా 1927 బొంబాయిలో ప్రస్థావించినవాడు డా||బి.ఆర్‌.అంబేద్కర్‌. కుల నిర్మూలనకు, కులాంతర వివాహాలు ఓ పరిష్కార మార్గం అని సూచించాడు. మతాచార్యులుగా, పూజారులుగా అన్ని కులాలవారిని నియమించాలని 1936లో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. 1916లో కులాల పుట్టుకపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఆర్థికాంశాలపైనా తగిన రిపోర్టును సమర్పించారు. కుల నిర్మూలనాంశాలలో బ్రాహ్మణిజంను, ఆర్థికాంశాలలో పెట్టుబడి దారీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
ఎంత ప్రతిభావంతుడైతేనేమి, ఎన్ని ఉద్యమాలు నడిపితేనేమి రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికలలో ఆనాటి మేటి కాంగ్రెస్‌ నాయకులు, స్వాతంత్య్రోద్యమ నాయకులు బి.ఆర్‌.అంబేద్కర్‌ను ఓడించారు. కాన్‌స్టిట్యువేషనల్‌ అసెంబ్లీకి పోకుండా ఓడించారు. పశ్చిమ బెంగాల్‌కు జోగీందర్‌నాథ్‌ మండల్‌ను వేయగా అంబేద్కర్‌ను పశ్చిమబెంగాల్‌ నుండి పోటీచేయించి గెలిపించినా ఆ ప్రాంతాన్ని కావాలనే కుట్రలు చేసి పాకిస్థాన్‌లో కలిపి వేయించి బి.ఆర్‌.ను పక్కనపెట్టారు. కానీ ఇన్‌స్టెంట్‌ చర్చిలో మౌంట్‌బాటన్‌తో చర్చలు జరిపి తిరిగి ఇండియాకు వచ్చి కాన్‌స్టిట్యువేషనల్‌ అసెంబ్లీకి పూనాలోని మరొక ప్రాంతం నుండి బి.ఆర్‌.ను పోటీచేయించి గెలిపించి రాజ్యాంగ పరిషత్‌లో సభ్యునిగా చేర్చారు. కాగా పరిషత్‌లోని మిగిలిన సభ్యులందరూ కొంతమంది విదేశాలకు పోయి, మరికొంతమంది అనారోగ్యం పాలై, ఇంకొంతమంది రాజీనామాలు చేయడంతో రాజ్యాంగ రచన చేయలేదు. చివరికి గత్యంతరం లేక అంబేద్కర్‌ రాత్రింబవళ్లు మూడు సంవత్సరాలు శ్రమించి ఇతిహాసాలు, పురాణాలు, రాజకీయశాస్త్రం అధ్యయనం చేసి 1930, 1931, 1932లలో బ్రిటన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలలో వాదించి రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షునిగా ఎన్నికై తన వాదనా పఠిమతో ఆమోదింపచేసుకుని రాజ్యాంగ రచనను పూర్తి చేశాడు.
చివరికి ‘ఓటు’ హక్కును కల్పించడంలోనూ ఎన్నో అడ్డంకులు. సర్దార్‌ వల్లభారు పటేల్‌ సహితం ఓటు హక్కును కల్పించడాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. అంటరాని వారికి అణగారిన వారికి భూమిలేదు, ఆస్థులులేవు, పౌరసత్వం లేదు, ఏమీ లేని ఈ నిమ్నజాతులు బతికేదెలా అని వాదించి, ఆమోదింపజేసుకున్న మానవతావాది అంబేద్కర్‌. దళితులకు, బహుజనులకు, స్త్రీల కొరకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారు. స్త్రీలకు ఆస్థిహక్కు కల్పించారు. చివరికి 1948లో రాజ్యాంగ రచనను పూర్తి చేశారు. అలా 1913లో పదకొండున్నర పౌండ్ల స్కాలర్‌షిప్‌తో కొలంబియా యూనివర్సిటీలో చదివిన అంబేద్కర్‌ పూర్తి రాజ్యాంగాన్ని రాసి భారత భావితరాలకు మార్గదర్శి అయ్యాడు.
1925 నుండి అంటరానితనంపై ఉద్యమాలు ప్రారంభించాడు. ‘మహతి’లో దళితుల మహాసభను ఏర్పాటు చేశాడు. చెరువు నీరును తాగనివ్వని కారణంతో ఉద్యమం నడిపి చెరువు నీరు తాగడానికి అనుమతులు సాధించాడు. కొల్హాపూర్‌ రాజైన సాహు మహరాజ్‌ ఉద్యమం చేయడం తెలుసుకుని ఆయనతో కలిసి ఆ ఉద్యమాలు చేశారు. మూక్‌ నాయక్‌, బహిష్కృత భారత్‌, ధ్యాస, ప్రభుత్వ భారత్‌ అనే పత్రికలు నడిపాడు. దళితులను బడిలోకి, గుడిలోకి అనే ఉద్యమాలు నడిపాడు. ముంబాయిలో బారిష్టర్‌ ప్రాక్టీస్‌, రాజకీయాలలో చేరడం, లేబర్‌ పార్టీ ఏర్పాటు, షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌ పార్టీ ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయం కోసం 1932లో పూనా ఒడంబడిక చేసుకుని గాంధీతో విభేదాలను పరిష్కరించుకుని దళితులకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటును ప్రతిపాదించిన వ్యక్తి డా||బి.ఆర్‌.
రాజ్యాంగ రచనా సమయంలో తీవ్ర అనారోగ్యం పాలైన డా||బి.ఆర్‌.కు 1948లో 56వ ఏట అప్పటికే మొదటి భార్య మరణించి వుండగా డా||శారదా కబీర్‌ అనే బ్రాహ్మణ యువతిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇలా ఎన్నో కష్టాలు, కడగండ్లు అనుభవించారు. బాల్యంలో ‘సతారా’లో ఎవరూ క్షవరం చేయకపోవడం, గోరేగావ్‌లో బండి కట్టకపోవడం, స్కూల్‌లో ప్యూన్‌ పుస్తకాలు ముట్టుకోకపోవడం, మంచినీళ్లు దోసిలితో తాగమనడం మొదలగు ఎన్నో అవమానాలు పొందినవాడు చివరికి పెద్ద పెద్ద హోదాలలో అవమానించబడి మతం మార్చుకోవాలనే ఆలోచనకు వచ్చాడు అంబేద్కర్‌.
మే 17, 1936లో కళ్యాణ్‌లో ప్రసంగించి బానిస బతుకు నుండి విముక్తి పొందాలంటే అభివృద్ధి చెందాలంటే మతం మార్చుకోక తప్పదు అన్నాడు. ‘చంద్రమణి మహాతేర’ అనే బౌద్ధ గురువు డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ను బౌద్ధమతంలోకి స్వీకరించారు. కుమారిఇందూతారువరేల్‌ ‘ఆహ్వానగీతం’ పాడింది. చివరికి బి.ఆర్‌.అంబేద్కర్‌, మాయి సాహెబ్‌ పాళీ భాషలో ‘త్రిశరణి, పంచశీలను’ పఠించి బౌద్ధ మతం స్వీకరించారు. కాని తాను హిందూ వ్యతిరేకిని కాదని, హిందూయిజం వ్యతిరేకిని మాత్రమేనని విస్పష్టంగా ప్రకటించారు బి.ఆర్‌.
1990లో మరణానంతరం డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌కు భారతరత్న’ అవార్డు ప్రకటించింది భారత ప్రభుత్వం. 1956 డిసెంబర్‌ 6న మరణించిన అంబేద్కర్‌ చిరస్మరణీయుడు. భారత రాజకీయ నాయకులలో అగ్రగణ్యుడు. ఆయన అడుగుజాడలలో నడిస్తేనే యువతకు భవిత. సామాజిక న్యాయ సాధన సాధ్యం. ప్రజాస్వామ్యానికి డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ రాజ్యాంగమే ఆదర్శం, ఆచరణీయం.

– బోడపాటి అప్పారావు, 9381509814

Spread the love