రవాణా రంగ కార్మికుల ‘చలో పార్లమెంటు’

Transport workers' 'Chalo Parliament'దేశంలోని ఆర్టీసీలను రక్షించు కోవడం కోసం, రవాణా రంగాన్ని కాపాడుకోవడం కోసం, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం 2025 మార్చి 24న ‘చలో పార్లమెంట్‌’కు ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) పిలుపునిచ్చింది. ఇది కేంద్రానికి ఒక హెచ్చరిక లాంటిది. దశాబ్దకాలంగా మోడీ అనుసరిస్తున్న విధానాల వలన రవాణా రంగం, ఈ రిక్షా మొదలుకొని ఆటో, టాక్సీ, లారీ, ప్రయివేటు బస్సు, ఆర్టీసీ వగైరాలన్నీ తీవ్ర సంక్షోభంలో నెట్టబడ్డాయి. కార్మికుల పని పరిస్థితులు దుర్భరంగా మారాయి.ఎం.వి.యాక్ట్‌- 2019ను తీసుకొచ్చిన కేంద్రం భారతదేశంలో ఇప్పటి వరకున్న పర్మిట్‌ వ్యవస్థను మార్చివేసింది. గతంలో స్టేజి క్యారేజి, కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా ఉన్న పర్మిట్‌లను నేషనల్‌ పర్మిట్‌గా మార్చి వందశాతం ప్రయివేటును ప్రోత్సహిస్తున్నారు. నేషనల్‌ టూరిస్ట్‌ పర్మిట్‌ పేరుతో కారు నుండి బస్‌ వరకు కేవలం రూ.10వేల నుండి 3లక్షల వరకు చెల్లిస్తే ఒక ఏడాది పాటు దేశంలో ఎక్కడ నుండి ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా స్టేజి క్యారేజీగా నడుపుకొనే అవకాశం ప్రయివేటు యజమానులకు కల్పించి, ఆర్టీసికి పోటీగా ప్రయివేటును ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా వేల ప్రయివేటు బస్సులు తెలంగాణ రాష్ట్ర రోడ్లపై కూడా కనపడుతున్నాయి. ‘అగ్రిగేటర్స్‌’ పేరుతో యాప్‌ ఆధారిత సంస్థలను ప్రజారవాణాలోకి అనుమతించారు. ఓలా, ఉబర్‌, రాపిడో వంటి సంస్థలతో పాటు ఎటువంటి పర్మిట్‌ లేకుండానే అనేక సంస్థలు ఈ రోజున ఆర్టీసికి పోటీగా రాష్ట్ర రోడ్లపై తిరుగుతున్నాయి.
ఆలిండియా టూరిస్ట్‌ పర్మిట్‌లు విరివిగా ఇవ్వాలని, అది కూడా అప్లరు చేసుకొన్న ఏడు రోజుల్లోపు ఇవ్వాలని, ఏ కారణం చేతనైనా అలా ఇవ్వలేకపోతే 8వ రోజు నుండి పర్మిట్‌ పొందిన సంస్థగా భావించి బస్సులు నడుపుకోవచ్చని జిఎస్‌ఆర్‌ 302(ఆ)18 ఏప్రిల్‌ 2023న కేంద్రం విడుదల చేసింది. డీజిల్‌ వాడకాన్ని తగ్గించి, పర్యావరణం కాపాడు తామని, ప్రత్యామ్నాయ ఇంధనం పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ బస్‌లను ప్రోత్సహిస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదేండ్లలో ఫేమ్‌-1, ఫేమ్‌-2, పీఎంఈ బస్‌, ఎన్‌ఈబిపీ, పీఎంఈ డ్రైవ్‌ వంటి అనేక పధకాలను ముందుకు తెచ్చింది. విద్యుత్‌ బస్‌లన్నీ ప్రయివేటు సంస్థల నుండి ‘గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌-జీసీసీ’ పద్ధతిలో తీసుకోవాలనే నిబంధనను పెట్టింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలన్నీ ఆ విద్యుత్‌ బస్సుల కన్సార్టియంలకే చెందుతున్నాయి. ఈ విద్యుత్‌బస్సుల స్కీంలో వచ్చే విద్యుత్‌బస్సుల టెండర్లు నిర్వహించే బాధ్యతను ‘కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌- సీఈఎస్‌ఎల్‌కు అప్పజెప్పింది. విద్యుత్‌ బస్‌ల నిర్వహణ పేరుతో ఈ రోజు విదేశీ, స్వదేశీ గుత్త సంస్థలు అన్ని ఆర్టీసీల్లో తిష్టవేస్తున్నాయి. విద్యుత్‌ బస్సులను ప్రోత్సహించడం పేరుతో పర్మిట్‌ అవసరమే లేని విధంగా నిబంధనలు సవరించారు.
2030 నాటికి భారతదేశంలో ప్రస్తుతం ఆర్టీసీల ద్వారా నడపబడుతున్న లక్షా నలభై వేల బస్సులతోపాటు మొత్తం ఎని మిది లక్షల విద్యుత్‌ బస్సులను తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం చేసింది. ఈ విద్యుత్‌ బస్సుల విధానంలో ఆర్టీసీలు నిర్వహించేది మధ్యవర్తి పాత్రగానే ఉంటుంది. హైదరాబాద్‌లోని అనుభవం పరిశీలిస్తే, విద్యుత్‌ బస్‌ సంస్థకు కి.మీ. రూ.67లో చెల్లించాలి. ఆ బస్సుపై ఇద్దరు కండక్టర్లు పనిచేస్తారు కాబట్టి వారి జీతాల ఖర్చు కి.మీ. రూ.22, దీంతోపాటు ఓవర్‌ హెడ్స్‌ ఖర్చు మరో రూ.7 ఉంటుంది. అంటే హైదరాబాద్‌ నగరంలో విద్యుత్‌ బస్సులకు కి.మీ. రూ.96 ఖర్చు వస్తుంటే, మహాలకిë పథకంతో కలిపి ఆదాయం రూ.50 వస్తుంది. అంటే కి.మీ.కు రూ.46 ఆర్టీసీ అదనంగా చెల్లించాలి. ఆ డబ్బులు ఎక్కడ నుండి తెచ్చిస్తారు? ప్రభుత్వం వయబిలిటీ గ్యాఫ్‌ ఫండ్‌గా ఆ డబ్బులు ఇవ్వాలి, కానీ ఇవ్వడం లేదు. ఆ రకంగా ఆర్టీసి కోలుకోలేని స్థితిలోకి నెట్టబడుతున్నది. వేలాది కోట్ల రూపాయలు కార్మి కుల సొమ్మును ఆర్టీసీ వాడుకున్నది. వేతన ఒప్పందాలు చేయడం లేదు. ప్రకటించిన వేతన ఒప్పందాల అరియర్స్‌ కూడా చెల్లించడం లేదు.
ఎం.వి.యాక్ట్‌ సవరణలు చేసి స్క్రాప్‌ పాలసీని ముందుకు తెచ్చారు. వాహన ఉత్పత్తిదారుల లాభాలను గ్యారెంటీ చేయడమే ఈ పథకం లక్ష్యం. వేలకోట్ల నిధుల లేమితో కొత్త బస్‌లు కొనుగోలు చేసే స్థితిలో ఆర్టీసీలు లేవు. ఆర్టీసీ బస్సులు స్క్రాప్‌ చేసిన స్థాయిలో బస్సులు కొనలేవు, కాబట్టి ప్రజల అవసరాల పేరుతో వివిధ మార్పుల ద్వారా ప్రయివేటు బస్సులు ఆర్టీసీల్లో నిండిపోతాయి. లేదా ఆర్టీసీలు క్షీణించిపోయి, బోర్డు మాత్రమే ఆర్టీసీది ఉండి, సంస్థ మొత్తం ప్రయివేటు యజమానుల గుప్పిట్లో ఉంటుంది. ఒకటి, రెండు వాహనాల యజమానులు కమ్‌ డ్రైవర్లను రవాణా రంగం నుండి బయటకు నెట్టివేసి మొత్తం ప్రజా రవాణా, సరుకు రవాణాను కూడా దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్లకు అప్ప జెప్పేందుకు ఈ విధానాలు ముందుకు తీసుకువస్తున్నారు.
దేశ ఆర్టీసీల్లో అవసరమైన సిబ్బందిని రిక్రూట్‌ చేయడంలేదు. ఖాళీ అయిన పోస్టులను సరెండర్‌ చేయడమో లేకపోతే కేంద్రం తీసుకొచ్చిన అప్రెంటీస్‌ యాక్ట్‌ను అడ్డంపెట్టుకొని ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌లు, గ్రాడ్యుయేట్‌ అప్రంటీస్‌ల పేర్లతో నియామకాలు చేస్తున్నారు. మరోవైపున ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామకాలు చేస్తున్నారు. అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది. ఇవి అమల్లోకి రాకముందే కార్మికోద్యమంపై ఆంక్షలు, కార్మికోద్యమంపై దాడి, వేతన ఒప్పందాలు చేయకపోవడం, అరియర్స్‌ చెల్లించకపోవడం, 10నుంచి12 గంటల పని చేయించడం, ఎంటి.డబ్ల్యు యాక్ట్‌ ను తుంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, మహిళలతో రాత్రి పూట పని చేయించడం వంటివి ఆర్టీసీల్లో అమలు చేస్తున్నారు. నిజంగా కొత్త లేబర్‌ కోడ్‌లు అమల్లోకి వస్తే కార్మిక సంఘాలు నిలబడటం, కార్మిక సమస్యలపై పోరాటాలు అసాధ్యంగా మారే పరిస్థితులు ఏర్పడ తాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు డీజిల్‌, పెట్రోల్‌ ధరలు, వాటిపై వసూలు చేస్తున్న పన్నులు, సెస్‌లు తగ్గించకపోవడం, ప్రజా రవాణా సంస్థలకైనా పన్ను మినహాయింపులు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది. సంఘటిత రంగంలో ఉన్న ఆర్టీసీలు, కార్మికుల పరిస్థితే ఇలా ఉంటే మొత్తం రవాణా రంగ కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
దేశ జీడీపీలో 4.5శాతం వాటా కలిగిన రవాణ రంగాన్ని కాపాడుకోవడం కోసం, ఈ రంగంలో పని చేస్తున్న పది కోట్ల మంది కార్మికుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నిరంత రాయంగా కృషి చేస్తున్నది. అయినా పాలకుల్లో ఎటువంటి చలనం లేకపోగా కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకునిపోతామని 2025-26 బడ్జెట్‌ ద్వారా కూడా తెలియజేశారు.ఈ దుస్థితి ఇంకెంతకాలం కొనసా గాలి? బతికినంతకాలం వెట్టిచాకిరీ చేస్తూ బానిస బతుకులే బతకాలా? ఇక సహించేదిలేదని, ఎలుగె త్తాలి. ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానా లను తిప్పికొట్టాలి. అందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలి. ఆ లక్ష్యం కోసమే 2025 మార్చి 24న ‘చలో పార్లమెంట్‌’కు ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. మొత్తం రవాణా రంగ కార్మికులతో పాటు ఆర్టీసి కార్మికులు కూడా ‘చలో పార్లమెంటు’కు పెద్దఎత్తున కదలాలి.
వి.ఎస్‌.రావు
9490098890

Spread the love