క్షతగాత్రుడు మృతి..

నవతెలంగాణ – అశ్వరావుపేట
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందారు. స్థానిక ఎస్ఐ శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లోకవరం కు చెందిన కోలా నరసింహారావు (40), అశ్వారావుపేట లోని మిషన్ భగీరథ యూనిట్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కింద గతకొంత కాలంగా ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో  ఈనెల 10 వ తేదీ రాత్రి అశ్వారావుపేట నుంచి తన స్వగ్రామానికి వెళ్లేందుకు కెమికల్ లోడుతో విజయవాడ నుంచి హైదారాబాద్ వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఎక్కాడు. ఈ వ్యాన్ నారంవారిగూడెం వద్ద ఆగి ఉన్న లారీ ను వేగంగా దూసుకెళ్లి వెనుక నుంచి ఢీ కొట్టగా, వ్యాన్ లో ఉన్న నరసింహారావు తోపాటు మరో ఉద్యోగి దామాల రాంబాబు, వ్యాన్ డ్రైవర్ శ్రీను లు గాయపడిన గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరసింహారావు ను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ లోని ఓ ఆస్పత్రి కి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే నరసింహారావు పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.మృతుడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రి కి తీసుకొచ్చి శవ పంచనామా జరిపించి కుటుంబీకులకు అప్పగించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love