ఐలమ్మ స్ఫూర్తితో మహిళా కమిషన్ సేవలు :
రాష్ట్ర మహిళా కమిషన్ a
గద్వాల విజయలక్ష్మి
నవతెలంగాణ-జనగామ/పాలకుర్తి
రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణ, సాధికారతతో పాటు ప్రభుత్వ ఆస్ప్రతులు, బాలసదనాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జనగామ జిల్లాలో గురువారం ఆమె పర్యటించి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించడంతో పాటు పలు ఆస్పత్రులు, బాలసదనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి మహిళా సర్జికల్, మెడికల్ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్ల పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్దనున్న బాలసదనాన్ని సందర్శించి, పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, మెనూ చార్ట్, వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ (1098) గురించి పిల్లలను అడగగా వారు వెంటనే సమాధానం ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అలాగే, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా కమిషన్ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, వారంలో మూడు రోజులు జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి మహిళల సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పుణికి పుచ్చుకునేలా కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. అంతకుముందు జిల్లా సమీకృత కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలికలపై వేధింపులు, గృహహింస, సైబర్ నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. షీ టీమ్స్, సఖీ కేంద్రం, భరోసా కేంద్రాల సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ స్కానింగ్ కేంద్రాలపై నిరంతర తనిఖీలు చేపట్టాలని పోలీసు శాఖను అప్రమత్తం చేశారు. ఈ పర్యటనలో ఆమె వెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీడబ్ల్యూఓ బెన్షాలోమ్, మహిళా కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, ఎన్. రాధాబాయి, సదా లక్ష్మీ, కార్యదర్శి బి. పద్మజా రమణ, ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, అదనపు డీసీపీ బాలస్వామి, వెంకటరమణ, ఏపీడీ నూరుద్దీన్, ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, పాలకుర్తి తహసీల్దార్ సూత్రం సరస్వతి, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, బాలల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



