ప్రభుత్వరంగ స్టీల్‌ సంస్థల్లో భారీగా ఖాళీలు

ప్రభుత్వరంగ స్టీల్‌ సంస్థల్లో భారీగా ఖాళీలు–  వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లోనూ తగ్గిన పోస్టుల సంఖ్య
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రభుత్వ రంగ స్టీల్‌ సంస్థ (పీఎస్‌యూ)ల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. అలాగే మంజూరైన ఉద్యో గాల సంఖ్య కూడా తగ్గుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏడాదికేడు ఉద్యోగాలను కుదించుకుంటూ వస్తోంది. సోమవారం రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ప్రభుత్వ రంగ స్టీల్‌ పరిశ్రమల్లో ఉన్న ఖాళీలు, ఉద్యోగాల కోత వివరాలు స్పష్టమయ్యాయి. మొత్తం ఏడు ప్రభుత్వ రంగ స్టీల్‌ పరిశ్రమల్లో 11,572 ఖాళీలున్నాయి. ఈ ఖాళీలు ఏడాదికేడు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే రెండు ప్రభుత్వ రంగ స్టీల్‌ సంస్థల్లో 13,983 ఉద్యోగాలు తగ్గాయి.
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌))లో మొత్తం 19,795 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులుండగా అందులో 5,124 ఖాళీలు ఉన్నాయి. అలాగే 2019 ఏప్రిల్‌ 1లో 2,221 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్‌ 1 నాటికి ఖాళీలు 5,124కు పెరిగాయి. అలాగే 2019లో 2,221 ఖాళీలు, 2020లో 2,229, 2021లో 3,030, 2022లో 4,099, 2023లో 5,124కు పెరిగాయి.
నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ)లో మొత్తం 5,247 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులుండగా అందులో 628 ఖాళీలు ఉన్నాయి. అలాగే 2019 ఏప్రిల్‌ 1లో 561 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్‌ 1 నాటికి 628కు పెరిగాయి. కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీ లిమిటెడ్‌ (కెఐఓసీఎల్‌)లో మొత్తం 2,738 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులుండగా అందులో 2,084 ఖాళీలు ఉన్నాయి. అలాగే 2019 ఏప్రిల్‌ 1లో 1,898 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్‌ 1 నాటికి 2,084కు పెరిగాయి.
మెకాన్‌ లిమిటెడ్‌ కంపెనీలో మొత్తం 1,897 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులుండగా, అందులో 838 ఖాళీలు ఉన్నాయి. అలాగే 2019 ఏప్రిల్‌ 1లో 646 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్‌ 1 నాటికి 838కు పెరిగాయి.
ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ కంపెనీలో మొత్తం 484 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులుండగా, అందులో184 ఖాళీలున్నాయి. అలాగే 2019 ఏప్రిల్‌ 1లో 126 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్‌ 1 నాటికి 184కు పెరిగాయి.
మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఓఐఎల్‌)లో మొత్తం 6,880 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులుండగా, అందులో 1,269 ఖాళీలు ఉన్నాయి. అలాగే 2019 ఏప్రిల్‌ 1లో 912 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్‌ 1 నాటికి ఖాళీలు 1,269కు పెరిగాయి. ఎంఓఐఎల్‌లో 2019 ఏప్రిల్‌ 1 నాటికి 6,960 పోస్టులు ఉండగా 2023 ఏప్రిల్‌ 1 నాటికి 80 కుదించి, 6,880కి చేరాయి.
స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)లో మొత్తం 60,631 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులుండగా, అందులో 1,445 ఖాళీలు ఉన్నాయి. సెయిల్‌లో 2019 ఏప్రిల్‌ 1 నాటికి 74,534 పోస్టులు ఉండగా, 2023 ఏప్రిల్‌ 1 నాటికి 13,903 పోస్టులు కుదించి, 60,631 పోస్టులకు చేర్చారు.

Spread the love