నగరం నసీబుల రాసుంటే
ఖుదా క్యా కారేగా
పల్లె దారులన్నీ పట్నం బాట పట్టాయి
పల్లె పాటలన్నీ ప్రదర్శనల్లో మిగిలిపోయాయి
అందమయిన అంగళ్లూ
అందమయిన అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లూ
ఆయస్కాంతాల్లా ఆకర్షిస్తూ ఉంటే
భూమ్మీద నిలబడ్డం మట్టిల పోర్లాడ్డం
చెట్ల నీడన సేదదీరడం
అంత ఆసాన్ కాదు
నీ సంగతటుంచు
ఏ నది ఒడ్డునో చిన్నపిల్లాడిలా
మిలమిల లాడుతూ
ఏ చెరువు గట్టునో
చిగురుటాకులా రెపరెపలాడుతూ ఊరుండేది
మట్టిబాటలో నడుస్తూనో
గద్దేలమీద కూర్చునో ముచ్చట్లాడుతూ
వూర్లన్నీ ఒకేలా ఉండేవి
ఇప్పుడు వూర్లన్నీ నగరాలకు
నకల్లవుతున్నాయి
మునివవేళ్ళమీద పరుగుపెడుతూ
ఊసరవెళ్ళుల్లా రంగులు మార్చుకుంటున్నాయి
కార్లతో బార్లతో పిజ్జాలూ బర్గర్లతో
నగరానికి నమూనాలవుతున్నాయి
నువ్వెక్కడున్నా ఏమి తిన్నా
ఫరకేమీ లేదు
మనిషిగా నిలబడ్డమే
పెద్ద సవాలు
– వారాల ఆనంద్