విజన్‌ ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఒక్కరూ లేడు

There is no leader with a vision in the opposition– ఎన్నికల్లో పైసలు, మందు పంచను : మంత్రి కె.తారక రామారావు
నవతెలంగాణ – సిరిసిల్ల రూరల్‌
విజన్‌ ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఒక్కరూ లేడని, ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి ఏ క్షణంలోనైనా జైలుకు వెళ్లడం ఖాయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ మాట్లాడారు. 55ఏండ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా రాష్ట్రానికి ఏం చేయలేదన్నారు. 2014లో మోడీ జన్‌ దన్‌ యోజన ఖాతాలు తీస్తే రూ.15లక్షలు ఖాతాల్లో వేస్తానని చెప్పి ఇప్పటి వరకు వేయలేదని విమర్శించారు. బండి సంజరు.. మాట మాటకి మోడీని దేవుడని సంభోదిస్తుంటారని, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచినందుకా, ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకా దేనికి మోడీ దేవుడో చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క వందే భారత్‌ రైలుకు వంద సార్లు జెండా ఉపిండని, సిరిసిల్లకు ఒక్క పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ అడిగితే ఇవ్వలేదని, కనీసం బండి సంజరు ప్రయత్నం కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పైసలు పంచాలని చూస్తున్నాయని, తాను మాత్రం ఎన్నికల్లో పైసలు, మందు పంచనని స్పష్టం చేశారు. సిరిసిల్ల దయతో తనకంటూ ఒక గుర్తింపు వచ్చిందని, సిరిసిల్ల రుణం తీర్చుకుంటానన్నారు. పాయలాగా ఉన్న మానేరు వాగులో ఇప్పుడు 365 రోజులూ నీళ్లు ఉంటున్నాయని, సజీవ జలధార మాదిరిగా మార్చింది కేసీఆర్‌ ప్రభుత్వం కాదా అని గుర్తు చేశారు. 400 కోట్లతో వర్కర్‌ టూ ఓనర్‌ షెడ్లు కడుతున్నామని, 375 ఎకరాల్లో అక్వాహబ్‌ ఏర్పాటు కాబోతుందని చెప్పారు.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు తెస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమంలో సిరిసిల్ల గణనీయంగా మారిందన్నారు. ప్రజలు ఓటు అనే అస్త్రాన్ని వాడి మంచి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 2014 ముందు సిరిసిల్ల ఎట్లా ఉండేదో, ఇప్పుడు ఎట్లా ఉందో పాత ఫోటోలు కొత్త ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సుంకపాక మనోజ్‌ సబ్బని హరీష్‌, సికిందర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, యువత పాల్గొన్నారు.

Spread the love