Saturday, May 2, 2026
E-PAPER
Homeఆటలుఅదరగొట్టారు

అదరగొట్టారు

- Advertisement -

3-0తో చైనీస్‌ తైపీపై గెలుపు
సెమీఫైనల్లో టీమ్‌ ఇండియా
థామస్‌ కప్‌ 2026

భారత షట్లర్లు అదరగొట్టారు. అగ్రజట్టు చైనీస్‌ తైపీని చిత్తు చేసి థామస్‌ కప్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. లక్ష్యసేన్‌, ఆయుష్‌ శెట్టి సహా సాత్విక్‌, చిరాగ్‌ జోడీ వరుస మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశారు. ఐదు మ్యాచ్‌ల సమరంలో 3-0తో భారత్‌ అదిరే విజయం ఖాతాలో వేసుకుంది. మరో రెండు మ్యాచ్‌ల అవసరం లేకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 2022లో థామస్‌ కప్‌ చాంపియన్‌గా నిలిచిన భారత్‌.. సెమీఫైనల్లో అడుగుపెట్టి పతకం ఖాయం చేసుకుంది.

నవతెలంగాణ-హార్సెన్స్‌
ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ (ప్రపంచ టీమ్‌ చాంపియన్‌షిప్‌)లో టీమ్‌ ఇండియా ఓ పతకం ఖాయం చేసుకుంది. 2022లో థామస్‌ కప్‌లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన భారత్‌.. నాలుగేండ్లలో మర మెడల్‌ ఖాయం చేసుకుంది. శుక్రవారం డెన్మార్క్‌లోని హార్సెన్స్‌లో జరిగిన థామస్‌ కప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ 3-0తో చైనీస్‌ తైపీపై ఘన విజయం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ పవర్‌హౌస్‌, అగ్రజట్టు చైనీస్‌ తైపీ క్వార్టర్‌ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. భారత షట్లర్లు అదరగొట్టారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచి మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే లాంఛనం ముగించింది. సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, ఆయుష్‌ శెట్టి విజయాలు సాధించగా.. డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ గెలుపొందారు. జపాన్‌, ఫ్రాన్స్‌ మరో క్వార్టర్‌ఫైనల్లో తలపడనుండగా… ఆ మ్యాచ్‌లో విజేతతో సెమీఫైనల్లో భారత్‌ పోటీపడనుంది.

షట్లర్ల సూపర్‌ షో
వరల్డ్‌ నం.6 లక్ష్యసేన్‌ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు విజయంతో శుభారంభం అందించాడు. కీలక రెండో గేమ్‌లో రెండు మ్యాచ్‌ పాయింట్లు కాచుకున్న లక్ష్యసేన్‌ 18-21, 22-20, 21-17తో చో టీన్‌ చెన్‌పై మెరుపు విజయం సాధించాడు. తొలి గేమ్‌లో లక్ష్యసేన్‌ 15-10తో ముందంజలో నిలిచినా.. చో చెన్‌ గొప్పగా పుంజుకున్నాడు. 21-18తో తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్యసేన్‌ 14-17తో వెనుకంజ వేశాడు. కానీ కీలక సమయంలో పుంజుకున్న లక్ష్యసేన్‌ దూకుడుగా ఆడాడు. రెండు మ్యాచ్‌ పాయింట్ల ఒత్తిడిలో రాణించిన లక్ష్యసేన్‌ 22-20తో రెండో గేమ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లాడు. అదిరే ర్యాలీలు, సూపర్‌ నెట్‌గేమ్‌ సహా కండ్లుచెదిరే స్మాష్‌లతో లక్ష్యసేన్‌ ఊపందుకున్నాడు. మూడో గేమ్‌ను 21-17తో సొంతం చేసుకుని భారత్‌ను 1-0 ముందంజలో నిలిపాడు. రెండో మ్యాచ్‌లో డబుల్స్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలు అదరగొట్టారు. గంటకు పైగా సాగిన మూడు గేమ్‌ల మ్యాచ్‌లో 23-21, 19-21, 21-12తో గెలుపొందారు.

చు చీవాంగ్‌ చి లిన్‌లు తొలి గేమ్‌లో ఆఖరు వరకు పోరాడినా.. టైబ్రేకర్‌లో సాత్విక్‌, చిరాగ్‌లు పైచేయి సాధించారు. కీలక రెండో గేమ్‌లో ముందంజ వేసిన చైనీస్‌ తైపీ జంట మెరిసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో రాణించిన సాత్విక్‌, చిరాగ్‌లు ఏకపక్షంగా గెలుపొందారు. దీంతో భారత్‌ 2-0తో విజయానికి మరింత చేరువైంది. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన ఆయుష్‌ శెట్టి.. రెండో సింగిల్స్‌ మ్యాచ్‌లో అంచనాలను అందుకున్నాడు. ఆల్‌ ఇంగ్లాండ్‌ చాంపియన్‌ లిన్‌ చున్‌ యిపై వరుస గేముల్లోనే లాంఛనం ముగించాడు. 48 నిమిషాల మ్యాచ్‌లో 21-16, 21-17తో ఆయుష్‌ శెట్టి అదరగొట్టాడు. తొలి గేమ్‌లో 10-12తో వెనుకంజ వేసిన ఆయుష్‌ శెట్టి.. వరుసగా ఏడు పాయింట్లు సాధించాడు. అదే జోరులో తొలి గేమ్‌ను గెల్చుకుని.. రెండో గేమ్‌లోనూ దూకుడు కొనసాగించాడు. ఆయుష్‌ శెట్టి విజయంతో భారత్‌ 3-0తో గెలుపొందింది. మరో డబుల్స్‌, సింగిల్స్‌ మ్యాచ్‌ అవసరం లేకుండానే భారత్‌ క్వార్టర్‌ఫైనల్లో ఘన విజయం సాధించింది. సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -