మహిళల సేవలకు వేతనం
రూ. 30 వేల కంటే ఎక్కువే ఇవ్వొచ్చు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కుటుంబాన్ని నడిపే మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదని.. ఈ దేశాన్ని నడిపించే జాతి నిర్మాతలని సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఆమె కేవలం ఇంటి పనులు మాత్రమే చేయడం లేదనీ, భావి తరాలను తీర్చిదిద్దుతూ, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంది. ఓ ప్రమాద కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘గృహిణి అంటే ఇంటిపెద్దపై ఆధారపడే వ్యక్తిగా పరిగణించడం విడ్డూరంగా అనిపిస్తోంది. వాస్తవానికి ఓ కుటుంబమంతా నిత్యం ఆమెపైనే ఆధారపడుతోంది. కానీ, ఆమె విలువకు తగిన గుర్తింపు లభించడం లేదు. వివిధ రంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నప్పటికీ.. ఇంటి పనుల విషయంలో ఆమెను ఇప్పటికీ తక్కువగానే అంచనా వేస్తున్నాం. ఆమె లేకపోతే ఇంట్లో ఎన్నో పనులు ఆగిపోతాయి. ఆమె చేసే పని వెలకట్టలేనిది. ఆ సేవలను ఆర్థికంగా లెక్క కడితే.. నెలకు కనీసం రూ.30వేల కంటే ఎక్కువే అవుతుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.జీతం లేకుండా మహిళలు చేసే ఇంటి పనులు.. దేశ జీడీపీలో 15-17 శాతం వాటాకు సమానమనే అంచనాలున్నాయి. అయినప్పటికీ ఆమెకు మనం ఎలాంటి వేతనం చెల్లించడం లేదు సరికదా.. వారికి సరైన గుర్తింపు కూడా లభించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా వివాహ వ్యవస్థలో అనాదిగా వస్తోన్న ఆచారాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘పెళ్లంటే పనుల కోసం ఓ మనిషిని నియమించుకోవడం కాదు. ఇంటి పనుల బాధ్యత ఆడవాళ్లదే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటోంది. కానీ, ఇందులో దంపతులిద్దరికి సమాన బాధ్యత ఉంటుంది. వివాహం జరిగిందన్న కారణంతో ఓ మహిళ తన కలలను, లక్ష్యాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి అంటే.. మహిళ గుర్తింపునకు ముగింపు కాదు’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.పంజాబ్‌కు చెందిన ఓ మహిళ 2001లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిహారం కోరుతూ ఆమె భర్త, ముగ్గురు పిల్లలు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆ సమయంలో ఆమె కుటుంబానికి రూ.2.42లక్షల పరిహారం ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.



