మసక బారిన మూడో నేత్రం

మసక బారిన మూడో నేత్రం– అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు
– నాణ్యత లోపమా…!
– అసాంఘిక శక్తుల కుట్రలో భాగమా..?
నవ తెలంగాణ- కాటారం
ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం ఇది పోలీసు యంత్రాంగం తరచూ చెపుతున్న మాటలు. అలాంటిది నేరా నియంత్రణ లో కీలకంగా పనిచేసే నిఘా నేత్రాలు పని చేయకపోయినా పట్టించుకున్న నాధుడే కరువైనాడు. దీంతో ఎక్కడైనా చోరీ గాని, ప్రమాదం గాని జరిగినప్పుడు నిందతులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారుతుంది. పరిసరాల్లోని దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. ఆ అవకాశం కూడా లేకుంటే నిందితులను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. మండలంలోని పలు గ్రామాలలో కొంతమంది దాతలు, యువకులు, రాజకీయ నాయకులు, గ్రామపంచాయతీ పాలకవర్గాల ఆర్థిక సహాయంతో పోలీసుల సహకారంతో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అవి గ్రామాలలో పనిచేసే స్థితిలో లేవు. పర్యవేక్షణ లోపం కారణంగా అలంకారప్రాయంగా మాత్రమే కనిపిస్తున్నాయి. జరిగే సంఘటనలను చూసి రికార్డు చేసుకోలేకపోతున్నాయి. దానివల్ల ఊహించిన ఫలితాలు అందకపోగా అనర్ధాలే సంభవిస్తున్నాయి. పోలీసులు నేరాలు ఛేదించడంలో ఇవి ఎంతగా ఉపయోగపడతాయని అనుకున్నారు. కానీ వాటి వల్ల పోలీసులు నేరాలను ఛేదించకపోగా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. గ్రామాలలో సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న క్రమంలో వాటిని నిర్ధారించడానికి, వివరించడానికి ఉపయోగించే సందర్భంలో ఇసుక అక్రమ రవాణా, మట్టి దందా, పిడిఎస్ బియ్యం, గుడుంబా రవాణా, తగాదాలు, దోపిడీలు, క్షుద్ర పూజల భయం దోళనలు , స్త్రీలపై జరిగే పలు వేధింపులు లాంటి అసాంఘిక కార్యక్రమాలను వీటి ద్వారా నివారించవచ్చు. కొన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదొ ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు చూసి చూడనట్టు ఉంటున్నారా..? లేక కొనుగోలు చేసినప్పుడే తక్కువ నాణ్యత గలవి కొని ఎక్కువ ధర బిల్లు చేశారా..? అనేది పలు అనుమానాలు ప్రజలకు కలిగిస్తున్నాయి. గంగారం ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. రాత్రింబవళ్లు ఇసుక లారీలు ఓవర్ లోడ్ తిరగడంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అలాగే మానేరు గోదావరి నదుల నుండి రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా జరుగుతుంది. ఈ అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ టిఎస్ఎండిసి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసింది. గంగారం ఎక్స్ రోడ్ వద్ద పనిచేయకుండా ఉన్న సీసీ కెమెరాలు అన్నింటిని పనిచేసాలా చేస్తే ప్రజలకు, పోలీసు వ్యవస్థకు మేలు చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గాలు పోలీస్ సిబ్బంది ఇప్పటికైనా వీటిని సరిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Spread the love