ప్రతికూల ఆలోచనతో ముప్పు

Threat with negative thinkingఒక్కోసారి ఎంత వద్దనుకున్నా నెగెటివ్‌ థింకింగ్‌ మనసుని వేధిస్తుంటుంది. అనారోగ్యం వల్లనో, ఇంట్లోనో, ఉద్యోగంలోని సమస్యల కారణంగా నెగెటివ్‌ ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడప్పుడూ ఇలా ప్రతికూల ఆలోచనలు ఎవరికైనా రావడం సహజం. కానీ కొంతమందిలో రోజూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆలోచనల వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, శారీరక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ప్రతికూల ఆలోచన వల్ల వచ్చే సమస్యలేంటో, అనుకూల ఆలోచనల కోసం నిపుణులు ఏం చేయాలంటున్నారో తెలుసుకుందాం…
మానసికంగా దృఢంగా లేకపోతే శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండడం సాధ్యం కాదని చాలా పరిశోధనల్లో తేలింది. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరం ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఏదైనా విషయంపై ఎక్కువగా ఆలోచిస్తే త్వరగా అనారోగ్యానికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. ప్రతికూల ఆలోచనలు అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తాయని అంటున్నారు.
గుండె సంబంధిత వ్యాధులు
నెగెటివ్‌ థింకింగ్‌ వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ప్రతికూల ఆలోచనలు ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తాయి. ఇది శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్‌ హార్మోన్‌ అసమతుల్యతకు దారితీస్తుంది. దీర్ఘకాలం పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఇది అధిక రక్తపోటు, వేగవంతమైన హృదయ స్పందన, కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణవ్యవస్థ సమస్యలు
అధిక ప్రతికూల ఆలోచనలు జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయి. ఇది జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాకు హాని కలిగిస్తుంది. ఇది అల్సర్లు, అజీర్ణం, అతిసారం, పేగు సిండ్రోమ్‌, కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
థైరాయిడ్‌
నిరాశాపూరితమైన ఆలోచనల వల్ల ఉత్సాహంగా ఏ పనులూ చేయాలనిపించదు. ఇది శరీరంలోని అనేక హార్మోన్ల పనితీరులో మార్పులకు దారితీస్తుంది. ఫలితంగా థైరాయిడ్‌, డయాబెటిస్‌, పీసీఓఎస్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ
నెగెటివ్‌ థింకింగ్స్‌ అనేవి రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ప్రతికూల ఆలోచనలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
శారీరక నొప్పులు
ప్రతికూల ఆలోచనలు రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపడంతోపాటు కండరాల నొప్పి, కండరాల బిగుతుకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. దీంతో పాటు వెన్ను, మెడ నొప్పి సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఇలా చేయండి
మనసు బాగలేనప్పుడు మళ్లీ పాజిటివ్‌ మూడ్‌లోకి రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు నచ్చిన పాటలు వినడమో, పాడడమో చేయాలట. దీని వల్ల మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా పాజిటివ్‌గా ఆలోచించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నచ్చిన పని
నెగెటివ్‌ థింకింగ్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఉన్న ప్రదేశం నుంచి బయటకు వచ్చి కాసేపు అటూ ఇటూ నడవండి. ఈ టైంలోనే మీకు బాగా నచ్చిన అంశాల గురించి ఆలోచించడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి చూడండి. లేకుంటే మీకు బాగా ఇష్టమైన అభిరుచి ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకొండి. దానిపై దృష్టిని మళ్లించండి. ఇలా చేస్తే అసలు ప్రతికూలంగా ఆలోచించే సమయం కూడా ఉండదు.
పాజిటివిటీని పెంచే అంశాలు
– ఏ విషయంలోనైనా సాధ్యమైనంత మేరకు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే వీలైంత వరకు పాటిజివ్‌గా ఆలోచించడానికి ప్రయత్నించండి.
– ఎంత ట్రై చేసినా నెగెటివ్‌ ఆలోచనలను నియంత్రించలేకపోతే ముందుగా మెదడుకు విశ్రాంతినివ్వాలని చెబుతున్నారు. ఇందుకోసం కొద్ది నిమిషాలపాటు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని సూచిస్తున్నారు. ఈ తర్వాత పాజిటివిటీని పెంచే కథలను లేదా కొటేషన్స్‌ లాంటివి చదవడం, ప్రసంగాలు వినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
– మనసును వేధించే ఆలోచనల నుంచి బయటకు రావాలంటే ఏదో ఒక పని మీద మీ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అంటే సమాజ సేవ చేయడం, ఇతరులకు సహాయం చేయడం లాంటి పనుల వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love