మూడు డీఏలు ప్రకటించాలి

– క్యాబినెట్‌ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో అసంతృప్తి
– 317 జీవో బాధితులందరికీ న్యాయం చేయాలి
– పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలి : యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఐదు వాయిదాల కరువు భత్యం (డీఏ) పెండింగ్‌లో ఉంటే ప్రస్తుతం ఒక్క వాయిదాని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతోపాటు 317 జీవో సమస్యలపై దాటవేత వైఖరి పట్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా నిరసిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) స్టీరింగ్‌ కమిటీ తెలిపింది. మూడు డీఏలను ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె జంగయ్య, వై అశోక్‌ కుమార్‌, ఎం సోమయ్య, యు పోచయ్య, కొమ్ము రమేష్‌, జాడి రాజన్న, జాదవ్‌ వెంకట్రావు, బి కొండయ్య, కె బిక్షపతి, ఎ గంగాధర్‌, ఎస్‌ హరికిషన్‌, శాగ కైలాసం, ఎం రామారావు, కుర్సం రామారావు, చావ రవి, పి నాగిరెడ్డి, టి లింగారెడ్డి, డి సైదులు, ఎం సైదులు, మేడి చరణ్‌ దాస్‌, డి రాజనర్సుబాబు, ఎస్‌ మహేశ్‌, వై విజయకుమార్‌, శ్రీను నాయక్‌, సిహెచ్‌ రమేశ్‌, నజీరుద్దీన్‌ తదితరులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో బకాయి పడిన మూడు వాయిదాల డీఏను విడుదల చేస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పెండింగ్‌ బిల్లులు విడుదల చేస్తామనీ, సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్దరిస్తామనీ, 317 జీవో బాధితులందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని గత పదినెలలుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా ఓపిక పట్టామని పేర్కొన్నారు. సగం మందికైనా నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తున్నందుకు సంతోషించామని తెలిపారు. 317 జీవో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినందున సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరిస్తారని ఆశించిన వారికి కమిటీ సిఫారసులు తీవ్ర నిరాశను కలిగించాయని పేర్కొన్నారు. భార్యాభర్తలు, ఆరోగ్య కారణాలతో బదిలీలకు జీవోలోనే అవకాశం ఉన్నదనీ, స్థానికత కోల్పోయిన వారి గురించి నిర్ణయం చేయకపోతే కమిటీ వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. సీపీఎస్‌ రద్దు గురించి ఊసే లేదని తెలిపారు. రెండేండ్లుగా వేలాది బిల్లులు విడుదల కావడం లేదని పేర్కొన్నారు. వినిమయ ధరల సూచీకి అనుగుణంగా ప్రతి ఆర్నెళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) ప్రకటించబడుతుందని తెలిపారు. గత కొన్నేండ్లుగా రాష్ట్రంలో ఈ ఆనవాయితీని పాటించటం లేదని విమర్శించారు. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా పండుగలప్పుడు కానుకలుగా ఇస్తున్నట్లు ప్రకటించటం విడ్డూరంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం మూడు వాయిదాల డీఏ బకాయి పడితే ఈ ప్రభుత్వం వచ్చాక మరో రెండు వాయిదా డీఏలు వచ్చి చేరాయని వివరించారు. కనీసం రెండు వాయిదాల డీఏ అయినా ఇప్పుడు ఇస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారని తెలిపారు. కేవలం ఒక్క వాయిదా డీఏ మాత్రమే విడుదల చేయటంతో ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పెట్టే ఖర్చులన్నీ పెడుతూనే ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సిన డీఏలకే ఆర్థిక పరిస్థితి ఆటంకమౌతుందా?అని ప్రశ్నించారు. డీఏతోపాటు 317 జీవో సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున్ణ సమీక్షించుకోవాలనీ, ఇతర సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి సమస్యలన్నింటినీ కాలయాపన లేకుండా పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

Spread the love