– ప్రారంభించిన హైకోర్టు జడ్జి జస్టిస్ సూరెపల్లి నంద
– పీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ-హైదరాబాద్ : జూనియర్ న్యాయవాదుల కోసం మూడు రోజుల పాటు నిర్వహించే ఫ్రీ ట్రైనింగ్ వర్క్‌షాప్‌ను తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సూరెపల్లి నంద ప్రారంభించారు. ఎన్జీఓ పీఆర్ ఫౌండేషన్ ఫర్ సొసైటీ వెల్‌నెస్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి సూరెపల్లి నంద.. కార్యక్రమానికి హాజరైన యువ న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ రఘునాథ్ వెరోస్.. క్రిమినల్ లా జ్యూరిస్ప్రూడెన్స్ ఆన్ లా ఆఫ్ బెయిల్స్, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, వాదనలో నైపుణ్యం వంటి అంశాలపై మాట్లాడి యువ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. యువ న్యాయవాదులు అడిగిన పలు ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేశారు. బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు జె ప్రభాకర్.. యువ న్యాయవాదుల విజయవంతమైన కెరీర్ నిర్మాణం కోసం అవసరమయ్యే రిట్ మెయింటెనబిలిటీ అండ్ అడ్వొకెసీ స్కిల్స్ అనే అంశం మీద మాట్లాడి పలు సూచనలు చేశారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ), సివిల్ రివిజన్ పిటిషన్స్, అప్పీళ్ల గురించి అడ్వొకేట్ శ్రీనివాస్ పొడిచేటి వివరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎలక్టెడ్ మెంబర్ డి. రాఘవులు మాట్లాడుతూ.. అడ్వొకేట్‌గా ప్రాక్టిస్‌లో ఎలా విజయం సాధించాలో అనే అంశంపై పలు సూచనలు చేశారు. తాము నిర్వహించి ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సెషన్ విజయవంతంగా ముగిసిందని కార్యక్రమ నిర్వాహకులు, ఎన్జీఓ వ్యవస్థాపకులు పోనంపల్లి రవి తెలిపారు. నేడు, రేపు కూడా ఈ శిక్షణా కార్యక్రమం ఉంటుందనీ, యువ, జూనియర్ అడ్వొకేట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యువ, జూనియర్ అడ్వొకేట్లు, న్యాయ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు




