Monday, June 22, 2026
E-PAPER
Homeజాతీయంఒకే రోజు మూడు యుద్ధనౌకలు

ఒకే రోజు మూడు యుద్ధనౌకలు

- Advertisement -

జాతికి అంకితం
చేసిన ప్రధాని మోడీ

జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ


కోల్ కతా :
భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ ఐఎన్‌ఎస్‌ దుణగిరి, ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌, ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌ అనే మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. శత్రువుల రహస్య ఎత్తుగడలను చిత్తు చేసేలా అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన వీటిని కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్‌ చేస్తున్న కృషికి ఈ నౌకలు నిదర్శనమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల ప్రతిభ, ఇంజినీర్ల నైపుణ్యం, కార్మికుల కఠోర శ్రమ వల్లే వీటి నిర్మాణం సాధ్యమయ్యిందన్నారు.

ఐఎన్‌ఎస్‌ దుణగిరి
భారత నేవీలో విశిష్ట సేవలు అందించిన నీలగిరి శ్రేణిగా ఐఎన్‌ఎస్‌ దుణగిరి యుద్ధనౌకను ఎంతో ప్రత్యేకంగా నిర్మించారు. ప్రాజెక్టు 17ఏ పేరిట నిర్మించిన నౌకను 2022 జులై 15న జలప్రవేశం చేయించారు. దీని పొడవు 149 మీటర్లు. అడ్వాన్స్‌డ్‌ గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్‌గా తీర్చిదిద్దారు. రాడార్, సెన్సర్‌లతో బహుముఖ పాత్ర పోషించేందుకు అనువుగా నిర్మించిన ఈ నౌక బ్రహ్మోస్‌ యాంటీ షిప్‌ క్రూజ్‌ క్షిపణులను కలిగి ఉంది.

ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌
భారత నౌకాదళానికి సముద్ర భౌగోళిక, (హైడ్రోగ్రాఫిక్‌ సర్వే) సరిహద్దు జలాలు, సమగ్ర కొలతలు, కచ్చితత్వ పరిమాణం వంటి అంశాలపై నివేదికల తయారీలో సామర్థ్యం పెంచేందుకు దోహదపడేలా ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌ నౌకను నిర్మించారు. ఇది 110 మీటర్ల పొడవుతో ఉంటుంది. 2023 జూన్‌ 13న జలప్రవేశం చేయించారు. పోర్టులు, లోతైన సముద్ర మార్గాలు, మారిటైం పరిధిలో సముద్ర అధ్యయనం, నావిగేషన్‌ విధుల కోసం ప్రత్యేక హెలికాఫ్టర్, విపత్కర పరిస్థితుల్లో మానవీయ సాయానికి, రక్షణ చర్యలు చేపట్టేందుకు అనువుగా సంశోధక్‌ నిర్మాణం చేశారు.

ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌
కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డింగ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ)లో ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌ నౌకను యాంటీ సబ్‌మెరైన్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌గా నిర్మించారు. ఇది 77.6 మీటర్ల పొడవుంటుంది. 2024 మార్చి 13న జలప్రవేశం చేయించారు. తీర జలాల్లో ఆపరేషనల్‌ విధులకు అనువుగా ఈ యుద్ధనౌకను డిజైన్‌ చేశారు. ఉపరితల నిఘా, అన్వేషణ, శత్రువులపై దాడికి స్వీయ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సమన్వయం చేసుకునేలా 88 శాతం ఆధునిక స్వీయ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. 30ఎంఎం నేవల్‌ సర్ఫేస్‌ గన్, వాటర్‌ జెట్లతో డీజిల్‌ యంత్రాలను అనుసంధానం చేయడం దీని ప్రత్యేకత.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -