సీఫుడ్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్
ఏడుగురు మహిళల మృతి,
తొమ్మిదిమంది పరిస్థితి విషమం
విచారణకు సీఎం విజయ్ ఆదేశం
చెన్నై : తమిళనాడులోని సీఫుడ్ ఫ్యాక్టరీలో ఘోరం జరిగింది. తిరువళ్లూరు జిల్లా పెరియపాళయం సమీపంలో ఉన్న ఒక ప్రయి వేట్ సీఫుడ్ ఎగుమతి యూనిట్‌లో ఆదివారం అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. 40 మందికి పైగా వివిధ ఆస్ప త్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం పెరియపాళయం సమీపంలోని కన్నిగైపైర్ వద్ద ఉన్న ‘సెయింట్ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రయి వేట్ లిమిటెడ్’లో ఈ లీకేజీ జరిగింది. ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో అత్యధికులు మహిళలే. అసోం, ఒడిశా, జార్ఖండ్‌లకు చెందిన సుమారు 120 మంది వలస కార్మికులు ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి అమ్మోనియా లీక్ మొదలై, వేగంగా ప్రాంగణంలోని నివాస ప్రాంతానికి వ్యాపించింది. వారాంతపు సెలవు కావడంతో తమ గదుల్లోనే ఉన్న చాలా మంది కార్మికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడగా, కొందరికి నోరు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు తలెత్తాయి.
వారిలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే 67 మంది బాధిత కార్మికులను స్థానిక వైద్య కేంద్రాలకు తరలించినట్టు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎస్. కవిత తెలిపారు. వారిలో 46 మందిని వెల్స్ ఆస్ప త్రిలోనూ, 21 మందిని వెంకటేశ్వర ఆస్ప త్రిలోనూ చేర్చారు. పరిస్థితి విషమంగా ఉన్న తొమ్మిది మంది రోగులను మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌ల ద్వారా చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. ప్పయి వేటు ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న 44 మందిలో 43 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. 15 నుంచి 16 మంది రోగులకు ఇంక్యూ బేషన్ (శ్వాసనాళంలో గొట్టం అమర్చడం) చేశామని, 11 మంది వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని వైద్యులు తెలిపారు. పెరియపాలయం పోలీస్ స్టేషన్, అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం అభ్యర్థన మేరకు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) 4వ బెటాలియన్ నుండి 30 మందితో కూడిన రసాయన, జీవ, రేడియోలాజికల్, అణు ప్రతిస్పందన బృందం అరక్కోణం చేరుకుంది. గ్యాస్ లీక్ ప్రభావాన్ని అంచనా వేయడానికి, ఆ ప్రాంతాన్ని భద్రపరచడానికి, సహాయక చర్యలకు తోడ్పడటానికి, గ్యాస్ డిటెక్షన్ పరికరాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ప్రత్యేక రెస్క్యూ పరికరాలతో ఈ బృందం చేరుకుంది. పెరియపాలయం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి పరామర్శ
గ్యాస్ లీకేజీ కారణంగా పెరియపాళయం, నల్లూరు టోల్ ప్లాజా సమీపంలోని ప్రయివేట్ ఆస్పత్రులలో చేరిన బాధితులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ శాఖ మంత్రి ఆర్. కుమార్ పరామర్శించారు. జిల్లా పర్యవేక్షణాధికారి, తమిళనాడు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.పి. కార్తికేయన్, జిల్లా కలెక్టర్ ఎస్. కవిత ఆయనతో పాటు ఉన్నారు.
విచారణ కమిటీ ఏర్పాటు, 2 లక్షల పరిహారం
మృతుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశించారు. మృతదేహాలను వారి సొంత రాష్ట్రానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. పారిశ్రామిక భద్రత, ఆరోగ్య డైరెక్టర్, కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి, ప్రజారోగ్య అదనపు డైరెక్టర్‌తో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 24 గంటల్లో మధ్యంతర నివేదిక, మూడు రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని కమిటీని కోరారు.



