Monday, June 22, 2026
E-PAPER
Homeజాతీయంప్రశాంతంగా నీట్‌ రీ టెస్ట్

ప్రశాంతంగా నీట్‌ రీ టెస్ట్

- Advertisement -

5400కు పైగా కేంద్రాల్లో నిర్వహణ
హైదరాబాద్ లోనూ తరలివచ్చిన అభ్యర్థులు
టఫ్ గా ఫిజిక్స్ పేపర్


న్యూఢిల్లీ : నీట్‌ ‌యూజీ 2026 రీ టెస్ట్ ఆదివారం దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగింది. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాల్లోనూ, విదేశాల్లోని 14 కేంద్రాల్లోనూ ఈ రీ టెస్టును నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. ఈ పరీక్షకు 22.79 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌ ‌లీక్‌‌ కారణంగా మే 3న జరిగిన నీట్‌ ‌యూజీ 2026 పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. పేపర్‌ ‌లీక్‌పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం నీట్‌ ‌పరీక్షను మరోసారి నిర్వహించారు. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ పరీక్ష జరిగింది. అయితే వికలాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాయడానికి అనుమతించారు. ఈ పరీక్షను ఇంగ్లీష్‌తో సహా 12 భారతీయ భాషలలో నిర్వహించారు. ఎన్టీఏ అధికారుల సమాచారం ప్రకారం 95,000కు పైగా పరీక్షా గదులలో మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని జాతీయ, రాష్ట్ర, మంత్రిత్వ శాఖల స్థాయిలో వర్చువల్‌గా పర్యవేక్షిస్తున్నామని ఎన్టీఏ అధికారులు తెలిపారు. అలాగే 51,311 జామర్‌‌లను అందుబాటులో ఉంచినట్టు కూడా చెప్పారు. పరీక్ష సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా కేంద్రాల వద్ద డ్రోన్‌లను, అదనపు సిబ్బందిని మోహరించారు. దేశ రాజధానితో సహా అనేక రాష్ట్రాల్లో, పరీక్షా కేంద్రాల వెలుపల వేచి ఉన్న తల్లిదండ్రులు, సంరక్షకుల కోసం ఉచిత తాగునీరు, అల్పాహారం కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశరాజధాని ఓఖ్లాలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయం నుంచి పరీక్ష సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్షించారు. “పరీక్షను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం” అని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. కొంత మంది అభ్యర్థులు, అభ్యర్థుల తల్లిదండ్రులతో ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్‌ ‌మాట్లాడారు. తమ సమస్యలను వారు మంత్రికి తెలియచేశారు.

బురఖా ధరించారని..
కాగా, రాజస్తాన్ లోని అజ్మీర్‌లో బురఖా ధరించిన ఒక అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. కుల్సుమ్ బానో అనే అభ్యర్థి దీని గురించి మాట్లాడుతూ తాను గతంలో మే 3న జరిగిన పరీక్షకు కూడా ఇదే దుస్తులు ధరించి హాజరయ్యానని కానీ, ఇప్పుడు లోనికి అనుమతించడ లేదని ఆరోపించారు. “నేను నీట్ పరీక్ష రాయడానికి బేవార్ నుంచి వచ్చాను. మే 3న పరీక్ష రాసినప్పుడు కూడా, ఇప్పుడున్నట్లే బురఖా, దుపట్టా ధరించి ఉన్నాను. కానీ ఇప్పుడు దుపట్టా, బురఖా కూడా తీసేయాల్సిందేనని స్పష్టం చేశారు” అని ఆమె పరీక్ష ప్రారంభం కావడానికి ముందు చెప్పారు. ” ఎన్‌‌టిఎ మాకు అనుమతి ఇచ్చినప్పుడు, ఈ వ్యక్తులు మమ్మల్ని ఆపలేరు. ఈ దుస్తులలో నన్ను అనుమతించకపోతే, నేను అస్సలు పరీక్ష రాయను. నాకు పరీక్ష ముఖ్యం కాదు.. నా ‘బురఖా’, నా గుర్తింపు మాత్రమే ముఖ్యం’ అని ఆమె పేర్కొన్నారు. చివరికి ఈ అభ్యర్థిని కేంద్రంలోకి అనుమతించారని ఎన్టీఏ తరువాత స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో ఒక పరీక్ష కేంద్రం వద్ద ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. అభ్యర్థుల్లో ఒకరి అంకుల్‌ అయిన అమీర్ ఖాద్రీ మాట్లాడుతూ ‘ పరీక్ష కోసం ఇక్కడకు వస్తుండగా దారిలో మాకు ప్రమాదం జరిగింది. నా మేనల్లుడికి ప్రథమ చికిత్స చేయించడంతో కొంచెం ఆలస్యమైంది. అయినా, ఆలస్యమైందని మా వాడిని లోపలికి అనుమతించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం కుదరదని అధికారులు చెప్పారు’ అని తెలిపారు. కొల్‌‌కతా, దాని పరిసర ప్రాంతాలను శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలుచోట్ల రహదారులు తీవ్రమైన జలమయమై, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రీ-టెస్ట్ కోసం పరీక్షా కేంద్రాలకు ప్రయాణిస్తున్న నీట్ అభ్యర్థులతో సహా ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగాయి.
మహారాష్ట్ర లో బృహన్‌ ‌ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సంస్థ ఉద్యోగుల సమ్మె కారణంగా విద్యార్థులు, ఇతరులు ఆదివారం కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే 24 మార్గాల్లో 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

టఫ్ గా ఫిజిక్స్ పేపర్
నీట్ రీ-ఎగ్జామ్పై అభ్యర్థుల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. ఓవరాల్గా ప్రశ్నాపత్రం సాధారణంగానే ఉందని చాలా మంది విద్యార్థులు తెలిపారు. అయితే గత పరీక్షతో పోలిస్తే, ఈసారి ఫిజిక్స్ సెక్షన్ చాలా కఠినంగా ఉందని మరికొందరు విద్యార్థులు పేర్కొన్నారు. “పరీక్ష సాధారణంగానే ఉంది. కాకపోతే ఫిజిక్స్ పేపర్ కాస్త లెంగ్తీగా ఉంది. గతంలో కంటే కొంచం కఠినంగా అనిపించింది. అయితే బయాలజీ బాగుంది. కెమిస్ట్రీ ప్రశ్నలు సాధారణంగానే ఉన్నాయి” అని చాలా మంది చెప్పారు.మరొక అభ్యర్థి మాట్లాడుతూ, “గత పరీక్ష కంటే ఇది కొంచెం కష్టంగా అనిపించింది. ఇది నా మొదటి ప్రయత్నం. నాకు దాదాపు 500 మార్కులు వచ్చే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రం లోపల ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి” అని చెప్పాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -