అన్ని వయసుల వారు
ఆచరించాలి : ప్రధాని మోడీ
అన్ని వయసుల వారు ఆచరించాలి : ప్రధాని మోడీ
కోల్ కతా : యోగా ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ఉత్సవంగా మారిందని ప్రధాని మోడీ తెలిపారు. ఏడాదిలో సుదీర్ఘమైన రోజు అయినందునే జూన్ 21న ప్రపంచ యోగాదినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. యోగాను కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్ వేదికగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే పరిమితం కాదని, ప్రపంచ శాంతికి కూడా మార్గం చూపగలదని, అన్ని వయసుల వారు యోగాను ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘జూన్ 21 భూమిపై కొంతభాగంలో ఏడాదిలోనే సుదీర్ఘమైనరోజు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా ఈ రోజు విశ్వంలోనే అతిపెద్ద సామూహిక కార్యక్రమంగా నిలుస్తోంది. విశ్వంలోని వేర్వేరు భాగాల్లో యోగాకు సంబంధించి ఒకదానిని మించి మరొకటి అనే విధంగా అద్భుతచిత్రాలు వస్తున్నాయి. దేశంలో హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, తూర్పున బంగాల్ నుంచి పశ్చిమాన సౌరాష్ట్ర వరకు దేశమంతా యోగాశక్తితో చైతన్యవంతంగా కనిపిస్తోంది. యోగాను కేవలం ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి వ్యాధులు, మానసిక ఒత్తిడి, అంటురాని వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో యోగ ఆరోగ్యకరమైన జీవనానికి మార్గదర్శకంగా నిలుస్తోంది’ అని మోడీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రమంత్రులు, ఇతరులు యోగా డేలో పాల్గోన్నారు.
ప్రపంచ శాంతికి యోగా మార్గం
- Advertisement -
- Advertisement -



