కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ‘మార్పు అవసరం’ నినాదంతో ర్యాలీ
10 వేల మందితో రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభ
ర్యాలీని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర : డి.రాజా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ‘మార్పు అవసరం’ నినాదంతో సీపీఐ మంగళవారం ‘ఢిల్లీ చలో’ ర్యాలీ నిర్వహించనుంది. అనంతరం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సుమారు 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తలు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే బహిరంగ సభలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతోపాటు జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొంటారు. ధరల పెరుగుదలను అరికట్టాలనీ, యువతకు ఉపాధి కల్పించాలనీ, ప్రజారోగ్యం, విద్యా రంగాలను బలోపేతం చేయాలనీ, మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. అదే విధంగా పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం, కార్మికుల హక్కులను పరిరక్షించడం, ప్రజాస్వామ్య పరిరక్షణకు బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌ను పునరుద్ధరించడం, దళితులు, ఆదివాసీలకు న్యాయం చేయడం తదితర అంశాలు ర్యాలీ ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి.
కార్యకర్తల అరెస్టులు, నిర్బంధాలను నిరసిస్తూ అమిత్‌షాకు డి. రాజా లేఖ
ర్యాలీకి ముందుగానే అనుమతి ఇచ్చినప్పటికీ దానిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు పాల్పడుతోందని సీపీఐ విమర్శించింది. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో సీపీఐకి చెందిన పది మంది జిల్లా కార్యదర్శులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పేర్కొంది. కార్యకర్తల అక్రమ నిర్బంధాలు, అరెస్టులను నిరసిస్తూ డి.రాజా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ర్యాలీ జరిగే రామ్‌లీలా మైదాన్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సమీపంలోని మెట్రో స్టేషన్లను మూసివేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు.
రైళ్లు రద్దు
ర్యాలీలో పాల్గొనేందుకు కేరళ సహా ఐదు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి కార్యకర్తలు ప్రయాణించేందుకు ముందుగా బుక్ చేసుకున్న ఐదు రైళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని సీపీఐ విమర్శించింది. అదే విధంగా సీపీఐ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనకుండా ఉత్తర భారత రాష్ట్రాల్లో సంఘ్ పరివార్ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొంది. అయినప్పటికీ కార్యకర్తలు కొన్ని రోజుల ముందుగానే ఢిల్లీకి చేరుకుని ర్యాలీకి సిద్ధమయ్యారు.
నేడు సీపీఐ ‘ఢిల్లీ చలో’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



