దళితులపై వివక్ష, అంటరానితనాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా…? :
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదనాబాద్
దళితులపై జరుగుతున్న వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా గళం వినిపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం బీజేపీ అహంకార, నిరంకుశ వైఖరికి నిదర్శనమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులపై రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే, సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రాహుల్ గాంధీపైనే కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా అంటరానితనం, కుల వివక్షను నిర్మూలించలేరని స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం, అన్యాయాన్ని ప్రశ్నించిన వారినే నిందితులుగా చిత్రీకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అంటరానితనాన్ని రాజ్యాంగం ద్వారా నిర్మూలించడం నుంచి ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టాల రూపకల్పన వరకు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా పోరాటం చేసిందని గుర్తుచేశారు. దళితులపై వివక్షను నిర్మూలించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న నిర్దిష్ట చర్యలు ఏమిటో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అంటరానితనం నిర్మూలన కోసం ఆర్‌ఎస్‌ఎస్ చేపట్టిన ఉద్యమాలు, చేసిన పోరాటాలు ఏమిటో కూడా ప్రజలకు వివరించాలని సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలైన సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా నిలుస్తుందనీ, కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాహుల్ పై ఎఫ్‌ఐఆర్ బీజేపీ నిరంకుశ వైఖరికి నిదర్శనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



