Tuesday, September 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక‌ళ్యాణలక్ష్మిపై ప్రభుత్వ అప్పీల్‌కు హైకోర్టు అనుమతి

క‌ళ్యాణలక్ష్మిపై ప్రభుత్వ అప్పీల్‌కు హైకోర్టు అనుమతి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై సింగిల్‌ జడ్జి విధించిన మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులను తొలగించేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుకు మార్గం సుగమం చేసింది. అప్పీల్‌ దాఖలుపై రిజిస్ట్రీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చి, దానికి నెంబర్‌ కేటాయించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ప్రభుత్వం 2014 నుంచి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుకు జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రభుత్వం తరఫున కౌంటర్‌ దాఖలు కాకపోవడంతో సింగిల్‌ జడ్జి పథకాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. చీఫ్ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం రిజిస్ట్రీ అభ్యంతరాలను కొట్టేసింది.

అడ్వకేట్‌ జనరల్‌ ఎ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ పథకాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. పథకాల అమలు వల్ల ఆయన హక్కులకు ఎలాంటి నష్టం కలగలేదనీ, పిటిషన్‌ను ప్రజాహిత వ్యాజ్యంగా కూడా పరిగణించలేమని పేర్కొన్నారు. షాదీముబారక్‌ తరహా సంక్షేమ కార్యక్రమాలకు సుప్రీంకోర్టు అనుమతి ఉన్న విషయాన్ని ఏజీ ప్రస్తావించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను సవాలు చేసే అంశాలపై విచారణ జరిపే అధికారం సింగిల్‌ జడ్జికి లేదనీ, అలాంటి వ్యవహారాలను డివిజన్‌ బెంచ్‌ విచారించాల్సి ఉంటుందని తెలిపారు. బాల్యవివాహాల నియంత్రణ, బాలికల విద్యను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో పలు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు.
అయితే ఈ దశలో ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. రాజ్యాంగంలోని అధికరణ 162 కింద ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే అధికారాన్ని కలిగి ఉందా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. మహిళలు, బాలికల సంక్షేమానికి సంబంధించి అధికరణ 15(3) కల్పిస్తున్న వెసులుబాటును కూడా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ రాజ్యాంగ నిబంధనల పరిధిలో ప్రభుత్వ అధికారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే స్టే ఎత్తివేత అభ్యర్థనపై తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ పిటిషన్‌పై నేడు విచారణ
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ కొనసాగనుంది. జూబ్లీహిల్స్‌లో వ్యాపారవేత్తపై దాడి చేసి రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలతో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని సుమంత్‌ కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జె శ్రీనివాసరావు సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ కేసులోని ఇతర నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినందున, సుమంత్‌పై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు అరెస్టు వంటి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం తరఫున ఏపీపీ జితేందర్‌రావు వాదిస్తూ బాధిత వ్యాపారిపై తీవ్రంగా దాడి చేసినట్టు ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోరారు. ఈ దశలో కఠిన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. పూర్తి వివరాలతో రావాలని సూచిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

ఆదిలాబాద్ ఎంఐఎం నాయకుడికి బెయిల్
హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఎంఐఎం నాయకుడు, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మెన్‌ మహమ్మద్‌ ఫరూక్‌ అహ్మద్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2020 డిసెంబరు నుంచి జైలులో ఉన్న ఆయన బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది.
జస్టిస్‌ కె లక్ష్మణ్‌, జస్టిస్‌ కె సుజనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రస్తుతం 2017, 2018 సంవత్సరాలకు సంబంధించిన క్రిమినల్‌ అప్పీళ్ల విచారణే కొనసాగుతోందని ధర్మాసనం పేర్కొంది. ఫరూక్‌ అహ్మద్‌ దాఖలు చేసిన అప్పీల్‌ 2022 నాటిదనీ, దాని విచారణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు అదే మొత్తానికి ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. బెయిల్‌పై బయట ఉన్న సమయంలో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని షరతు విధించింది.

ఉదయ్‌ కృష్ణారెడ్డికి పొటెన్సీ టెస్ట్ వద్దంటూ పిటిషన్
లైంగిక ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురైన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ చేపట్టనుంది. రాజేంద్రనగర్‌ కోర్టు పొటెన్సీ పరీక్ష నిర్వహణకు ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ జె శ్రీనివాసరావు సోమవారం విచారించారు. ఉదయ్‌ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది జి అశోక్‌రెడ్డి వాదిస్తూ పొటెన్సీ పరీక్షకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ దర్యాప్తులో భాగంగానే పొటెన్సీ పరీక్ష నిర్వహించాల్సి ఉందని తెలిపారు. దిగువ కోర్టు నిర్దేశించిన గడువులోగా పరీక్ష నిర్వహించలేకపోయామనీ, మంగళవారం వరకు పొటెన్సీ పరీక్ష నిర్వహించబోమని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఆ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -