Sunday, August 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫ్రెండ్షిప్ డే రోజున విషాదం..

ఫ్రెండ్షిప్ డే రోజున విషాదం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : స్నేహితుల దినోత్సవం రోజున విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన స్నేహితుల బృందంలో ఇద్దరు భారీ అలల తాకిడికి గల్లంతయ్యారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు కూడా ప్రమాదానికి గురవ్వడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ హృదయవిదారక ఘటన పెదగంట్యాడ మండలం పరిధిలోని పాత గంగవరం బీచ్‌లో ఆదివారం జరిగింది.

వివరాల్లోకి వెళితే, ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా నలుగురు యువతులు, ముగ్గురు యువకులతో కూడిన ఏడుగురు స్నేహితుల బృందం సరదాగా గడిపేందుకు గంగవరం బీచ్‌కు వెళ్లింది. వారంతా సముద్ర తీరంలో నిల్చొని ఫోటోలు దిగుతుండగా, ఓ పెద్ద కెరటం బలంగా వారిని తాకింది. ఈ ఘటనలో జాలరిపేటకు చెందిన నీతూ (18) అనే యువతి అదుపుతప్పి సముద్రంలోకి కొట్టుకుపోయింది.

నీతూ నీటిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన పెందుర్తికి చెందిన దామోదర్ వెంటనే ఆమెను రక్షించేందుకు సముద్రంలోకి దూకాడు. అయితే, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అతను కూడా ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యాడు. కళ్ల ముందే ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో మిగతా స్నేహితులు భయాందోళనలతో కేకలు వేశారు.

గల్లంతైన నీతూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దామోదర్‌కు కనకమహాలక్ష్మి అనే యువతితో మరికొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమైన తరుణంలో ఈ దుర్ఘటన జరగడంతో అతని కుటుంబంలో పెను విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు, బీచ్ లైఫ్‌గార్డులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటం గాలింపు పనులకు ఆటంకం కలిగిస్తోందని, అయినప్పటికీ గాలింపు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -