– అంతర్జాతీయ భాగస్వాములతో జట్టు
– బెంగళూరు మెట్రోపై దృష్టి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌విఎన్‌ఎల్) మెట్రో నిర్వహణ రంగంలోకి ప్రవేశించడానికి కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయ భాగస్వాములతో జట్టు కట్టడం ద్వారా మెట్రో కార్యకలాపాలు, నిర్వహణ వ్యాపారాన్ని చేపట్టాలని యోచిస్తున్నట్టు ఆర్‌విఎన్‌ఎల్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ప్రదీప్ గౌర్ తెలిపారు. బెంగుళూరు మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ (ఓఅండ్‌ఎం) కాంట్రాక్టులను చేపట్టేందుకు జర్మనీకి చెందిన డ్యుయిష్ బాన్ (డీబీ)తో చర్చలు జరుపుతున్నామని గౌర్ ఇటికి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. భారత్‌లో మెట్రో ప్రాజెక్టుల కోసం ఓఅండ్‌ఎం చేపట్టేందుకు డీబీ తమ కంపెనీని సంప్రదించిందన్నారు. బెంగళూరు మెట్రో కోసం ఈ భాగస్వామ్యాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు. అదే విధంగా చెన్నరు మెట్రో ప్రాజెక్టు కోసం ఓఅండ్‌ఎం హక్కులను పొందేందుకు ఆసక్తి చూపుతున్నామన్నారు. ఢిల్లీ-మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం జర్మన్ కంపెనీ ఇప్పటికే 12 సంవత్సరాల ఓఅండ్‌ఎం కాంట్రాక్టును కలిగి ఉందన్నారు.
”మేము ఇప్పటికే ఢిల్లీలో నమోభారత్ కారిడార్‌ను నిర్వహిస్తున్నాము. దేశంలో మరిన్ని ఓఅండ్‌ఎం ప్రాజెక్ట్‌లు లేదా భాగస్వామ్యాల కోసం చర్చలు జరుపుతున్నాము. మెట్రో రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులలో ఆర్‌విఎన్‌ఎల్ పాల్గొంటుంది.” అని గౌర్ తెలిపారు. చెన్నై, ఇండోర్, అహ్మదాబాద్, సూరత్, నాగ్‌పూర్, పుణెలలో మెట్రో ప్రాజెక్టులను చేపట్టనున్నామన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, యూఏఈ, టర్కీ, పెరూ దేశాల్లోనూ తమ కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తమ మొత్తం రూ.1 లక్ష కోట్ల ఆర్డర్ బుక్‌లో విదేశీ పోర్టుపోలియో వ్యాపారం 5 శాతం వాటాను కలిగి ఉందన్నారు. వీటిని మొత్తం ఆర్డర్‌లో 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తాము రైల్వేయేతర ప్రాజెక్ట్‌లలో ట్రాన్స్‌మిషన్ లైన్లు, సోలార్ ప్రాజెక్ట్‌లు, జాతీయ రహదారులను కూడా కలిగి ఉన్నామన్నారు.