ప్రయాణ…ప్రయాస

రైల్వే ప్రయాణం సామాన్యుకి అందనంత దూరమవుతున్నది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఆన్‌లైన్‌లో చాలామంది టిక్కెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఇది తెలియని సామాన్య పేదలు అనేక అవస్తలు పడుతున్నారు. స్టేషన్‌కు వెళ్లి టికెట్‌ తీసుకుందాంటే దొరుకుతుందో లేదో, టిక్కెట్‌ తీసుకునేలోపే రైలు బండి వెళ్లిపోతుందో అనే సందేహాలు నెలకొన్నాయి. రైల్వేస్టేషన్‌లో ఎక్కడచూసినా కౌంటర్‌ దగ్గర పెద్ద క్యూ లైన్‌ ఉంటుంది. సరిపోనన్ని కౌంటర్లు ఉండవు. అక్కడ కొంతమందికే ముందుగా టికెట్స్‌ దొరుకుతాయి. జనాలను కంట్రోల్‌ చేసేందుకు రైల్వే పోలీసులు ఉండరు. మరి స్త్రీల పరిస్థితి చెప్పనలవి కాదు. స్టేషన్లలో అద్భుతమైన సౌకర్యాలను చదవడానికి బాగుంటాయి. ఉన్నోడు గొంతు తడుపుకోడానికి బాటిల్‌ నీరు కొనుక్కుంటాడు. సామాన్యునికి తాగునీరు నల్లాలుంటాయి. మంచిదే ! కానీ వచ్చే నీరు మంచిదో, కాదో? మనకంటే తాగినవారికి బాగా తెలుస్తుంది! చల్లని నీరు సౌకర్యం కల్పించాం కదా? అని కొంత మంది వాదించవచ్చు. అందరికీ ఇవి సరి పోతాయా? పొట్ట నింపుకోడానికి ఏది కొందామన్నా స్పెషల్‌ ధరలు. ఒకవేళ అడిగితే కొంటే కొను! లేకపోతే పో! అనే చూపులని మనం చూడడమే తప్ప ఏమీ చేయలేము. ఎవరికి చెప్పాలి? అంత తీరుబాటు ఉంటుందా? ప్లాట్‌ఫామ్‌ మీద కొన్నిసార్లు పులిసిపోయిన , పాడైపోయిన ఆహారం అమ్ముతారు. తినాల్సిందే తప్పదు! ఆకలికి ఏదో ఒకటి తినాలి కదా! ధరలు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మూత్రానికి వెళ్లాలన్నా ‘ పే అండ్‌ యూజ్‌ ‘ అనే బోర్డులు కనిపిస్తాయి. దీనర్థం తెలియని సాధారణ ప్రయాణికునికి అక్కడికి వెళ్లేవరకూ వరకూ తెలియదు. దీనికి కూడా రుసుము చెల్లించాలా? అని! ఉచిత మూత్రశాలల గురించి చెప్పనవసరం లేదు! చెప్పనలవి కాదు ! అందుకే చాలా మంది బహిరంగ మల మూత్ర విసర్జన చేస్తారు.కొన్ని స్టేషన్లలో రైలు బండి వచ్చే ముందు మాత్రమే అనౌన్స్‌ చేస్తారు. బోగీ సంఖ్యని ప్రదర్శించే బోర్డు ఉండదు. బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియదు. జనరల్‌ బోగీ కోసం సామాన్యుడు పరుగులు పెట్టాల్సిందే. తప్పదు! ఎందుకంటే సామాన్యుడు పేదవాడు కదా! ఇటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా బండి తప్పిపోయిన వారెందరో? ఈ పరుగు పందెంలో ఒక్కోసారి చనిపోయిన సందర్భాలూ లేకపోలేదు. సామాన్యుని వెతలు తీరాలంటే పాలకులు కూడా వారి స్థానంలో ఉండి ఆలోచించాలి. అప్పుడే సమస్యలకు కొంతైనా పరిష్కారం ఉంటుంది.
– జనక మోహన రావు దుంగ, 8247045230

Spread the love