ఏసీబీ వలలో ట్రెజరీ ఉద్యోగి

– రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
నవతెలంగాణ-ఖమ్మం
చనిపోయిన ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్‌ కోసం రూ.40 వేలు లంచం డిమాండ్‌ చేసినందుకు ఖమ్మం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న కట్టా నగేష్‌ను ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం సుబ్లేడ్‌ పీహెచ్‌సీలో మెట్టు మల్లయ్య అటెండర్‌గా విధులు నిర్వహించి ఇటీవల చనిపోయారు. ఉద్యోగి భార్యకు రావాల్సిన చెల్లింపు స్థిరీకరణ, సేవా పింఛను, గ్రాట్యూటీ, సాధారణ కుటుంబ ఫించన్‌ బిల్లులు మొత్తం రూ.3,92,960 రావాల్సి ఉంది. వీటి కోసం అప్లై చేసుకోగా.. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కట్టా నగేష్‌ రూ.40వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దాంతో ఫిర్యాదురాలు ఏసీబీని ఆశ్రయించింది. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్‌.. ఉద్యోగి లంచం తీసుకునేటప్పుడు పట్టుకున్నారు. సుమారు రెండు గంటలపాటు నగేష్‌ను విచారించారు. ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

Spread the love