గిరిజన ఆత్మగౌరవం కొమురం భీమ్‌

Tribal self-respect Komuram Bheemకొమురంభీమ్‌ గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక. గిరిజన ఉద్యమాలకు స్ఫూర్తి. ఆయన ఉద్యమ నినాదం జల్‌, జంగల్‌, జమీన్‌. కొమురంభీం గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్న, సోంబాయి దంపతులకు ప్రస్తుత ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని సంకెపల్లి గ్రామంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడం, ఫారెస్టువారి ఆగడాలు పెరగడంతో కెరమెరి మండలంలోని సుర్దాపూర్‌ గ్రామానికి వలస వచ్చి పోడుకొట్టి వ్యవసాయం ప్రారంభించాడు. అక్కడ కూడా సిద్దిఖి అనే జాగీర్దారు భూమిని లాక్కునే ప్రయత్నం చేయడంతో భీమ్‌ చేసిన ప్రతిఘటనలో సిద్ధిఖి చనిపోయాడు. భీమ్‌ ప్రాణభయంతో చంద్రాపూర్‌కు, అక్కడి నుండి అస్సాంకు పారిపోయాడు. అక్కడ కాఫీ తోటల్లో పనిచేస్తూ తోటి తెలుగు కార్మికుల ద్వారా అల్లూరి సీతారామరాజు పోరాటగాధలు విని చైతన్యవంతుడై తిరిగి వచ్చాడు.
అప్పటికీ పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. అడవిని నరికివేస్తే జంగ్లాత్‌ భూమి అని, లేదంటే రెవెన్యూ భూమి అని గోండులను తరిమేయసాగారు. పంటలను ధ్వంసం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, ఫారెస్టు అధికారులు విపరీతంగా జరిమానాలు వేస్తున్నారు. జరిమానాలు కట్టనివారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులకు, అణచివేతలకు వ్యతిరేకంగా గోండులు, కొలాంలు పోరుబాట పట్టారు. ఆసిఫాబాద్‌ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్‌, బాబేఝరి గుట్టలను కేంద్రంగా చేసుకొని కొమురంభీమ్‌ గెరిల్లా పోరాటం నడిపించాడు. తమను దోచుకోవడానికి, తమ భూములను ఆక్రమించుకోవడానికి జరిగిన ప్రయత్నాలను అడ్డుకోవడానికి గిరిజనులను చైతన్య పరిచాడు. ”మా ఊర్లో మా రాజ్యం” అంటూ 12 గూడాలు జోడేఘాట్‌ లొద్దుల్లో బాబేఝరి కేంద్రంగా తుడుం మోగించారు. జోడేఘాట్‌లో అటవీ కేసుల నిందితులు కోర్టు వాయిదాకు వెళ్ళకుండా ధిక్కరించారు. సర్కారువాళ్ళు పెట్టే దొంగకేసులకు తాము రాదలుచుకోలేదని, పట్టేదార్లూ, జంగ్లాత్‌వాళ్ళూ చేసే దౌర్జన్యాలకు విసిగిపోయామని తమ 12 గ్రామాలను కలిపి గోండు రాజ్యంగా ప్రకటించుకున్నామని, నైజాం సర్కారును వ్యతిరేకిస్తున్నామని, నైజాం సర్కారు చట్టాలను తాము పాటించదలుచుకోలేదని సర్కారుకు చెప్పాలని భీమ్‌ గట్టిగా చెప్పాడు.
కొమురంభీమ్‌ నాయకత్వంలో అమీన్‌ను, అతని అనుచరులను తరిమి కొట్టారు. ఈ వార్త గూడేలన్నింటికీ వ్యాపిస్తుంది. జోడెన్‌ఘాట్‌ ప్రాంత 12 గ్రామాలకే కాకుండా చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కొమురంభీమ్‌ తన ప్రకటన పంపించాడు. తమ రాజు రాంజీగోండు కలను సాకారం చేయాలని పోరాటం చేద్దామని పిలుపునిచ్చాడు. గూడేలు పోరాటానికి సిద్ధమవుతాయి.
భీమ్‌ ఊహించినట్లుగానే ఎక్కువ సైనిక బలగాలు దాడికి బయలుదేరాయి. వారు కొండ ఎక్కుతుండగా తుడుం మోగింది. సైనికులపైకి తెంపు లేకుండా వడిశెల రాళ్ళు వచ్చి పడసాగాయి. కొండమీద నుంచి రాళ్ళు జారుతూ మీదికి వచ్చాయి. దీంతో సైనికులు వెనక్కి పరుగెత్తారు. సైన్యం కకావికలమైంది. ఆ రకంగా సైనిక దాడిని కొమురంభీమ్‌ దళాలు గెరిల్లా పద్ధతిలో తిప్పికొట్టాయి. గోండులు, కొలాంలలో విజయోత్సాహం వెల్లివిరిసింది. ఆనందం పట్టలేకపోయారు. కొమురంభీమ్‌ నాయకత్వంలోని తిరుగుబాటుకు ఆసిఫాబాద్‌ జిల్లా యంత్రాంగం కంగుతిన్నది. ఆ సమాచారం తెలుసుకుని నైజాం సర్కారు బిత్తరపోయింది. కొమురంభీమ్‌ సంకల్పం తెలిసిన నైజాం సర్కారు గోండులను దెబ్బతీయడానికి అవసరమైన చర్యలకే పూనుకుంది. పోరాటం కారణంగా పటార్ల మీద వ్యవసాయం దెబ్బతిన్నది. నిజాం సర్కారు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. రహస్య దళాలు గ్రామాల్లో తిరగలేని వాతావరణం ఏర్పడింది. జోడేఘాట్‌కు సరిగా ఆహార పదార్థాలు అందలేదు.
ఒకవైపు నుండి లడాయికి నైజాం సర్కారు సైనికులతో సిద్ధమైంది. మరోవైపు నుండి తాము పైకి వస్తున్నామని, దాడులు ఆపాలని, ఆపితే తాము పట్టాలిస్తామని కెప్టెన్‌తోపాటు ఉన్న తహసిల్దార్‌ అరిచి చెప్పాడు. పట్టాలిస్తామని చెప్పడంతో గిరిజనుల్లో ఆశపుట్టింది. ఒక్కసారిగా గుహల నుండి బయటకు వచ్చారు. ఎదురుదాడి నిలిచిపోవడంతో సైన్యం పైకి చేరుకోగలిగింది. పైకి వచ్చిన సైనికులు కొద్దు సహాయంతో ముఖ్యులను గుర్తించి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కొమురంభీమ్‌ అనుచరులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే, గందరగోళంలో సైనికులది పైచేయి అయింది. గిరిజన యువకులు కాల్పుల్లో గాయపడి కిందపడిపోయారు. కొద్దుపటేల్‌ భీమ్‌ను చేయేత్తి చూపించాడు. దాంతో కెప్టెన్‌ భీమ్‌ మీదికి కాల్పులు జరిపాడు. కొమురంభీమ్‌ కుప్పలా కూలిపోయాడు. 1940 సెప్టెంబర్‌1వ తేదీన కుంరంభీము అమరుడయ్యాడు. ఆరోజు పౌర్ణమి కావడంతో ఆదివాసీ ప్రజలు ప్రతి అశ్వయుజ పౌర్ణమినాడు వర్ధంతిని జరుపుకుంటున్నారు.
కొమురంభీమ్‌ అమరుడయ్యి 84 సం||లు దాటింది. కానీ నేటికీ కొమురం ఆశించినట్లుగా తమ వారసులకు భూమిపైన, నీటిపైన, అడవిపైన గిరిజనులకు హక్కులు లభించలేదు సరికదా అడవి నుండి, భూమినుండి వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే గిరిజనులు స్వయంపోషకంగా ఎదగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా కొమురంభీమ్‌, కుంరంసూరుల ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
తొడసం భీంరావు
9492508690

Spread the love