మేకతోలు కప్పుకుంటే పులి చారలు కనిపించవు తప్ప దాని స్వభావం మారుతుందా? నరేంద్ర మోడీని డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఆలింగనాలతో ముంచి తేల్చవచ్చు తప్ప అతగాడి అంతరంగం బయటపడ కుండా ఉంటుందా ! మన దేశమన్నా, మన పౌరులన్నా విద్వేషం వెళ్లగక్కేవారు అమెరికాలో ఎందరో ! వారిలో ఒకడైన మార్కో ఎలెజ్(25) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అమెరికా మీడియాను ఆకర్షించాడు. సామాజిక మాధ్యమంలో అతగాడు పెట్టిన పోస్టుల్లో ” భారతీయుల మీద విద్వేషాన్ని సాధారణీకరించండి ” అన్నది ఒకటి. శ్వేతజాతి దురహంకారులు ఇలాంటి పోస్టులు పెట్టటం సర్వసాధారణం, ప్రతిదాన్నీ పట్టించుకోనవసరం లేదు. మరి మార్కో ప్రత్యేకత ఏమిటి? అమెరికా అసలైన అధ్యక్షుడిగా అధికారం చెలాయిస్తున్న ఎలన్ మస్క్, ఆంధ్రా అల్లుడు అంటూ మన జనాలు పొంగిపోయిన ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, చివరిగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అందరూ వాడిని సమర్ధించారు, ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి పోతే పిలిచి తిరిగి ఇవ్వాలని చెప్పారు. కొద్ది రోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వస్తున్నాడని వారికి తెలుసు, అయినా భారత్ మీద విద్వేషం వెళ్లగక్కిన వ్యక్తిని సమర్ధించటమేమిటి ? ఈ పరిణామం మీద ఆత్మగౌరవం గురించి కబుర్లు చెప్పే కాషాయ దళాలుగానీ, కేంద్ర ప్రభుత్వం గానీ నోరు మెదపలేదు. దీన్ని లొంగుబాటు అనాలా? బానిస మనస్తత్వం అనాలా!
సామర్ద్యం లేని ప్రభుత్వ ఉద్యోగులందరనీ ఊరికే కూర్చో పెట్టి మేపుతున్నాం, వారందరినీ ఇంటికి పంపిస్తాం అని డోనాల్డ్‌ట్రంప్ చెప్పాడు. అందుకు గాను ప్రపంచ కుబేరుడు, మనందరీకీ తెలిసిన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ అధిపతి ఎలన్ మస్క్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సామర్ధ్య శాఖ మంత్రిగా నియమించాడు. అతగాడు ఇప్పుడు 23లక్షల ప్రభుత్వ సిబ్బందికి ఒక ఆదేశం జారీ చేసి స్వచ్చందంగా తప్పుకొనేవారికి ఒక అవకాశం ఇస్తున్నాం, మిగిలిన వారి సంగతి తరువాత చూస్తాం అని ప్రకటించాడు. అమెరికాలో వాల్‌స్ట్రీట్ జర్నల్ అనే దినపత్రిక అత్యధికంగా కాపీలు ముద్రించేదిగా ముందున్నది. అది డోనాల్డ్ ట్రంప్ చర్యల పట్ల విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శిస్తుంది గనుక వ్యతిరేక పత్రికగా ముద్రవేశారు. ఆ పత్రిక ఎలన్‌మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌లో పనిచేసిన మార్కో ఎలెజ్‌కు ఎలన్ మస్క్ తన శాఖలో ఎందుకు ఉద్యోగమిచ్చాడనో, ఇతర కారణాలతో గానీ సమాచారాన్ని సేకరించి మార్కో ఎలెజ్ ఒక జాత్యహంకారి అని అతడు గతంలో పెట్టిన పోస్టులను ఉటంకిస్తూ, ప్రస్తుతం వాటిని సామాజిక మాధ్యమం నుంచి తొలగించినట్లు ఆ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలివ్వకూడదు. వార్త ప్రచురణ తరువాత తనను తొలగిస్తారనే అంచనాతో తానే రాజీనామా చేశాడు. అతగాడు గాజా, ఇజ్రాయిల్ అనే రెండింటినీ భూమ్మీద నుంచి లేపేసినా నేను పట్టించుకోను, స్వజాతి(మన దేశంలో కులం, గోత్రం, మతాలను పరిగణనలోకి తీసుకుంటారు) వారిని వివాహం చేసుకున్నందుకు ప్రతిఫలం చెల్లించాల్సిన అవసరం లేదు వంటి పోస్టులు పెట్టాడు.
అలాంటివాడిని వాడి మానాన వదిలేస్తే వేరు. మానవులు తప్పులు చేస్తే దేవతలు క్షమిస్తారు అంటూ ఎలన్ మస్క్ వెనకేసుకు రాగా, కుర్రాడికి రెండో అవకాశమివ్వాలి అంటూ జెడి వాన్స్ సమర్ధించాడు. బుద్దిహీన సామాజిక మాధ్యమంలో కార్యకలాపాల కారణంగా ఒక పిల్లవాడి జీవితాన్ని నాశనం చేయకూడదు అన్నాడు. మార్కో రాజీనామా గురించి విలేకర్లు అడగ్గా దాని గురించి తనకు తెలియదని ట్రంప్ చెప్పాడు, అయితే మీ ఉపాధ్యక్షుడు తిరిగి తీసుకొనేందుకు అంగీకరించాడు కదా అని విలేకర్లు చెప్పగా అలానా అయితే ఒకే అన్నాడు. మార్కోను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలా వద్దా అన్న సర్వేలో పాల్గొన్న వేలాది మందిలో 78శాతం అనుకూలంగా ఓటు వేసినట్లు తేలిసింది. గత పదకొండేండ్లుగా నరేంద్రమోడీ అమెరికా నేతలతో రాసుకుపూసుకు తిరిగి మనదేశ ప్రతిష్ట, పలుకుబడిని పెంచినట్లు ఊదరగొట్టిన తర్వాత అమెరికాలో మనదేశం పట్ల వెల్లడైన విద్వేషతీరు ఇది.అయినా సరే దాన్ని పట్టుకువేలాడేందుకు పడుతున్న తాపత్రయాన్ని ఎలా అర్ధం చేసుకోవా లో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.
మార్కో ఎలెజ్ ఉదంతాన్ని అమెరికాలోని భారతీయ సంతతి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా ఎలెజ్‌ను సమర్ధించటంతో మండిపడుతున్నారు. జెడి వాన్స్ సతీమణి భారతీయ సంతతికి చెందిన చిలుకూరి ఉష. అందుకే కొందరు జెడి వాన్స్‌ను ఆంధ్రా అల్లుడు అని కూడా వర్ణించారు.తనను భార్యను కూడా తూలనాడినప్పటికీ ఆ పెద్దమనిషి ఎలెజ్‌ను పల్లెత్తుమాట అనకపోగా విమర్శకులు తనను భావోద్వేగాలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఎదురుదాడి చేశాడు.రిపబ్లికన్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రో ఖన్నా అమెరికన్ ఇండియన్. ఎలెజ్‌ను తిరిగి తీసుకొనే ముందు అతడి చేత క్షమాపణ చెప్పిస్తావా ? ఇది మన బిడ్డల కోసం అని వ్యాఖ్యానించాడు. వాన్స్ కబుర్లు చెప్పటం సరే, రోజంతా ఆయన బిడ్డలకు భద్రత ఉంటుంది. ఇంటర్నెట్‌లో వేధింపులకు గురయ్యే అవకాశం ఉన్న భారతీయుల పిల్లల సంగతేమిటి ? అంటూ అనేక మంది ప్రశ్నించారు. మార్కో ఎలెజ్‌ను పిలిచి మరీ ఉద్యోగమివ్వటం అంటే జాత్యంహంకార, భారత్ వ్యతిరేక శక్తులను బహిరంగంగా ప్రోత్సహించటం తప్ప మరొకటి కాదు. గాయపడిన భారతీయుల మనోభావాలను నరేంద్రమోడీ పరిగణనలోకి తీసుకుంటారా? డోనాల్డ్ ట్రంప్‌తో ఆలింగనాల్లో అన్నీ మరచిపోతారా?
అమెరికాలో ఇప్పుడు రెండు పరిణామాలు జరుగుతున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేయటం లేదనే పేరుతో వారి సంఖ్యను తగ్గించటం, తద్వారా మిగిలే సొమ్మును కార్పొరేట్లకు,దుర్మార్గాలకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ వంటి వాటికి మళ్లించేందుకు లేదా బడ్జెట్ లోటును పూడ్చేందుకు చూస్తున్నారు.ట్రంప్ సర్కార్ బెదిరింపులు, విసిగిపోవటం తదితర కారణాలో గడువులోపల 65వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్చంద ఉద్యోగ విరమణకు అంగీకరించారు. అయితే దీని గురించి వాద ప్రతివాదనలు వినేందుకు ఒక కోర్టు ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు, వారిని వదిలించుకుని ఉన్నత అర్హతలున్నవారిని నియమిస్తామని ట్రంప్ పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ అన్నారు. స్వచ్చంద ఉద్యోగ విరమణకు అర్హత ఉన్న 23లక్షల మంది ఉద్యోగుల్లో 65వేలంటే చాలా తక్కువ అని చెప్పనవసరం లేదు. మిలిటరీ, పోలీసు వంటి కొన్ని తరగతులకు అనుమతి లేదు. మొత్తంగా పదిశాతం మంది ఉద్యోగుల తగ్గింపు విద్య, వైద్యం వంటి రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే హెచ్చరికలు కూడా వెలువడ్డాయి.తాను తీర్పునిచ్చే వరకు స్వచ్చంద ఉద్యోగ విరమణ అమలు నిలిపివేయాలని ఒక కోర్టు ఆదేశమిచ్చింది.
అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని వెతికి పట్టుకుని వారి దేశాలకు బలవంతంగా పంపటం ఇప్పటికే ప్రారంభమైంది. నిజానికి ఇది కొత్తేమీ కాదు, గతేడాది అక్రమంగా వలస వచ్చిన తొంభైవేల మంది భారతీయులను అరెస్టు చేసినట్లు వార్తలొచ్చాయి. 2022 నాటి సమాచారం ప్రకారం అక్కడ కోటీ పది లక్షల మంది అక్రమవలసదారులు ఉన్నారు. వారిలో 48లక్షల మంది పక్కనే ఉన్న మెక్సికోవారే. మూడింట రెండొంతుల మంది మెక్సికో, లాటిన్ అమెరికా దేశాల వారే ఉన్నారు. ఎల్ సాల్వడార్ నుంచి 7.5లక్షలు, భారత్ 7.25, గౌతమాలా 6.75,హోండురాస్ 5.25 లక్షల వంతున ఉన్నారు. ఇలా వచ్చిన వారు వ్యవసాయం,హోటల్,ఇతర చిన్న చిన్న పనులు చేస్తున్నారు. వీరందరూ ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి. అయితే వీరితో పని చేయించుకునే వారికి కూడా సమస్యే. ఒక్కసారిగా వీరంతా లేకపోతే ఏం చేయాలి? ఇప్పటికే అనేక ప్రాంతాల పొలాల్లో నిలువు మీద ఉన్న పంటలు దెబ్బతినట్లు వార్తలొచ్చాయి. వలసదారుల సమస్య ఫెడరల్ ప్రభుత్వానిది, అయితే తమ నేత ట్రంప్ మెప్పు పొందేందుకు రిపబ్లికన్ పార్టీకి చెందిన ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్(మన ముఖ్యమంత్రి మాదిరి) రాన్ డెశాంటిస్ హడావుడి చేస్తున్నాడు. ఆ రాష్ట్ర శాసన సభ్యులు తనకు సహకరించాలని కోరుతున్నాడు. ట్రంప్ సర్కార్ అక్రమ వలస దారులను బలవంతంగా తిప్పి పంపేందుకు తీసుకున్న కార్యక్రమానికి సహకరించని స్థానిక ఉద్యోగులను ఇంటికి పంపే అధికారం తనకు కావాలని కోరుతున్నాడు. ఫ్లోరిడాలో ఉంటూ విదేశాలకు డబ్బు పంపేవారు వాటి వివరాలను అందచేయాలని, తద్వారా వారి వలస స్థితిని గుర్తించవచ్చంటున్నాడు.
రాన్ డెశాంటిస్ తీరుతెన్నులను చూసి అనేక మంది అపహాస్యం చేస్తున్నారు. కొన్ని చట్టాలను చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు పరిశీలించాలంటూ ఒక జర్నలిస్టు వ్యంగ్యంగా రాసినప్పటికీ అక్రమవలసదారులను వెనక్కు పంపితే తలెత్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. వాటిలో కొన్నిలా ఉన్నాయి. ఫ్లోరిడాలో నమోదైన పౌరులకు ” పొలాల్లో పనిచేసే స్వేచ్ఛా చట్టం 2025 ” చేయాలి.తద్వారా పొలాల్లో మిరియాలు, చెరకు, ఇతర పంటలు ఎండి, చెడిపోకుండా ఎలా తీసుకురావాలో పౌరులకు శిక్షణ ఇవ్వాలి. ”దేశభక్తులైన ఈ కార్మికులకు” పొలాల్లోకి రాను పోను బస్సులను ఏర్పాటు చేయాలి. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి నాలుగు గంటలకు వారికి ఐదు నిమిషాల పాటు మంచినీరు తాగేందుకు విరామమివ్వాలి. పనిచేసే సమయాల్లో తగిలే దెబ్బలు, వడదెబ్బ లేదా తలెత్తే మానసిక ఒత్తిడితో భూ యజమానులకు ఎలాంటి సంబంధం లేదని పనిచేసే వారు హామీపత్రం మీద సంతకాలు చేయాలి. ఫ్లోరిడా చొరవలో సహాయకులు అనే పథకం కింద ఇండ్లలో పనిచేసే వారికి నైపుణ్యాల శిక్షణ ఇవ్వాలి. హోటళ్లు కార్మికుల కొరత ఎదుర్కొంటున్నపుడు అత్యవసర పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.అతిధ్య రంగంలో వారికి వారం పాటు శిక్షణ ఇవ్వాలి.మరుగుదొడ్లు శుభ్రం చేయటం, పరుపుల మీద దుప్పట్లు వేయటం, కార్పెట్ల మీద ఎలాపడిందో తెలియని మరకలను తుడిచివేయటం వాటిని వారు నేర్చుకోవాలి. ఈ దేశభక్తులైన ఫ్లోరిడియన్లు వలసదారులను పంపివేసినపుడు తలెత్తే కొరత లేకుండా ఆతిధ్య రంగంలో పనిచేసేందుకు రాష్ట్ర గవర్నర్ క్లీన్ స్వీప్ రియాక్షన్ ఫోర్సుగా పని చేయాలి. శిక్షణ తరువాత వీరికి ప్రతిష్టాత్మ మాగా (మేక్ ఎగైన్ గ్రేట్ అమెరికా) మెయిడ్ అనే హోదాతో అవార్డు ఇవ్వాలి.
క్లీన్ ప్లేట్ ఫండ్(కంచాలను శుభ్రం చేసేందుకు నిధి) ఏర్పాటు చేయాలి. రెస్టారెంట్ల నుంచి తొలగించిన వలస కార్మికుల వలన ఏర్పడే కొరత నివారణకు నమోదైన ఫ్లోరిడియన్లకు అంట్లు తోమే సేవలను అప్పగించాలి.రెస్టారెంట్లలో భోంచేసిన వారు తాము తిన్న ప్లేట్లను తామే కడిగితే అలాంటి వారికి బిల్లులో 20శాతం రాయితీ ఇవ్వాలి.గమనిక కొత్తగా నియమితులైన కార్మికులు తొలగించిన వారి మాదిరి కష్టపడి పనిచేస్తారని భావించకూడదు. తొలగించిన ఒక్కొక్క హైతియన్ లేదా గౌతమాల కార్మికుడి స్థానంలో ముగ్గురు అంట్లు తోమే అమెరికన్ పౌరులను నియమించటం మంచిది. అక్రమ వలసదార్లను వెనక్కు పంపటాన్ని పండగ చేసుకుంటూ మంచాల మీద ఉన్న వృద్ధుల సేవకు సిద్దం కావాలి. వారి పక్క బట్టలు మార్చటంతో పాటు బెడ్‌పాన్‌లు మార్చాలి. వృద్ధులను మంచాల మీదే ఉంచి పక్కలు మార్చటం మీకు తెలుసా, దీని గురించి ఫ్లోరిడా రాష్ట్రం ఇచ్చే నూతన శిక్షణ కార్యక్రమం ఎంతో ఉద్వేగపరుస్తుంది. ఇంటి ఆవరణలో పెరిగే గడ్డి మొక్కలను సంరక్షించటం, ఎక్కువగా పెరిగిన వాటిని కత్తిరించటం, రాలిన ఆకులను తొలగించటం, ఇంట్లో వంటగది, బాత్‌రూమ్‌లో మార్పులు, మరమ్మతులు, కప్పుల నుంచి నీరు కారటాల వంటి వాటిని కూడా స్వయంగా చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందవచ్చని మీరెప్పుడైనా అసలు ఊహించారా, ఇప్పుడు అలాంటి సదవకాశం వచ్చింది.ఈ క్రమంలో నిబంధనలను అతిక్రమించినా ఎలాంటి తనిఖీలు, జరిమానాలు ఉండవు, ఇది ఒక గోడకూలిన శబ్దం కాదు, స్వేచ్చా ధ్వని సంకేతం!
ఎం కోటేశ్వరరావు
8331013288