– ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొంటే పాతిక శాతం సుంకం విధిస్తానని బెదిరింపు
– భారత్‌పై ప్రభావం పడుతుందంటున్న నిపుణులు
వాషింగ్టన్ : వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేశారు. ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే ఏ దేశం పైన అయినా సరే ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తానని ప్రకటించారు. అమెరికా శత్రు దేశాలతో పాటు మిత్ర దేశాలపై కూడా ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ‘అమెరికా పట్ల వెనిజులా చాలా శతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. కాబట్టి ఆ దేశం నుండి చమురు లేదా గ్యాస్ కొనుగోలు చేసే ఏ దేశమైనా అమెరికాతో వాణిజ్యం నెరిపితే ఇరవై ఐదు శాతం సుంకం చెల్లించాల్సిందే’ అని ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ హెచ్చరికలు భారత్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
2023 డిసెంబరులోనూ, 2024 జనవరిలోనూ వెనిజులా నుండి ముడి చమురు కొనుగోలు చేసిన దేశాలలో భారత్‌దే మొదటి స్థానం. ఆ దేశం నుండి భారత్ 22 మిలియన్ బ్యారల్స్ చమురును దిగుమతి చేసుకుంది. మన దేశం కొనుగోలు చేస్తున్న మొత్తం ముడి చమురులో ఇది ఒకటిన్నర శాతం. 2023 డిసెంబరులో భారత్ రోజుకు సుమారు 1,91,600 బ్యారల్స్ చమురును దిగుమతి చేసుకుంది. రిలయన్స్ ఇండిస్టీస్ రోజుకు 1,27,000 బ్యారల్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 37,000 బ్యారల్స్, హెచ్‌పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ 28,000 బ్యారల్స్ దిగుమతి చేసుకున్నాయి. గత సంవత్సరం జనవరిలో భారత్ దిగుమతులు రోజుకు 2,54,000 బ్యారల్స్‌కు పెరిగాయి. వెనిజులా చేసిన మొత్తం ఎగుమతులలో ఇది దాదాపు సగం.
ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్ నూతన టారిఫ్‌ను ప్రకటిస్తూ ‘అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ ఈ రోజు ఓ ప్రకటన చేస్తున్నారు. వెనిజులాపై అమెరికా రెండో దఫా టారిఫ్‌ను విధిస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. వెనిజులా ఉద్దేశపూర్వకంగా, మోసపూరితంగా వేలాది మంది నేరస్థులను రహస్యంగా అమెరికాకు పంపుతోంది. వీరిలో చాలా మంది హంతకులు. వారు హింసాత్మక స్వభావం కలిగిన వారు. అమెరికాకు వెనిజులా పంపుతున్న ముఠాలలో ట్రెన్ డీ అరాగువా ఒకటి. అది ఓ విదేశీ ఉగ్రవాద సంస్థ. వారిని వెనిజులాకు తిప్పి పంపే ప్రయత్నంలో ఉన్నాం. అది చాలా పెద్ద పని. పైగా అమెరికా విషయంలో వెనిజులా శత్రుభావంతో వ్యవహరిస్తోంది’ అని ఆరోపించారు. కాబట్టి వెనిజులా నుండి చమురు లేదా గ్యాస్ కొనుగోలు చేసే ఏ దేశమైనా అమెరికాతో వాణిజ్యం కొనసాగించాలంటే ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధిగా చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెల 2వ తేదీ నుండి సుంకాలు విధిస్తామని పునరుద్ఘాటించారు. ఆ రోజు అమెరికాలో విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటామని ట్రంప్ చెప్పుకొచ్చారు.