ట్రంప్‌ ఉక్రోషం: సిరియాలో ఏం జరిగింది? భవిష్యత్తేమిటి!

ఐదు దశాబ్దాలకు పైగా సాగిన అసద్‌ కుటుంబ పాలన సిరియాలో ముగిసింది.అరబ్‌ సోషలిస్టు బాత్‌ పార్టీనేత, అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలన 2000 సంవత్సరం జూలై 17 నుంచి 2024 డిసెంబరు 8వరకు సాగింది. అంతకు ముందు బషర్‌ తండ్రి హఫీస్‌ ఆల్‌ అసద్‌ 1971 మార్చి 14 నుంచి మరణించిన 2000 జూన్‌ పది వరకు అధికారంలో ఉన్నాడు. మధ్యప్రాచ్యంలో పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా పాలకులు సిరియాకు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. నవంబరు చివరివారం నుంచి హయత్‌ తహ్రరిర్‌ అల్‌ షామ్‌(హెచ్‌టిఎస్‌) సాయుధ సంస్థ, దానికి మద్దతు ఇచ్చిన వారు కలసి అసద్‌ మిలిటరీపై పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించి డిసెంబరు ఎనిమిదో తేదీన రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవటం, అసద్‌ కుటుంబం రష్యాకు ప్రవాసం వెళ్లటంతో సిరియాలో నూతన అధ్యాయం మొదలైంది. సిరియా ఉగ్రవాదుల చేతికి చిక్కిన తరువాత తాను ప్రవాసం వెళ్లినట్లు మాజీ అధ్యక్షుడు అసాద్‌ చేసినట్లుగా చెబుతున్న ప్రకటనలో ఉంది. ముందుగా రూపొందించిన పథకం ప్రకారమే తాను తప్పుకున్నట్లు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నాడు. సిరియా తమ తొత్తుల చేతికి చిక్కనందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రోషాన్ని వెళ్లగక్కాడు. అక్కడ తాము పోరాటం జరపలేదని తొలుత ప్రకటించిన ట్రంప్‌ సోమవారం నాడు మరోసారి స్పందించాడు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా టర్కీ పని ముగించిందని అంటూనే బలవంతంగా ఆక్రమించిందని వ్యాఖ్యానించాడు.మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు సిరియాలో ఉన్న 900 మంది తమ సైనికులను ఉపసంహరించనున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ తరువాత మాట మార్చాడు. సోమవారం నాడు అదే ప్రశ్నకు తరువాత చూద్దామన్నట్లుగా స్పందించాడు. ఇప్పుడు సిరియా భవిష్యత్‌ ఏమిటన్న ప్రశ్నకు ఎవరికీ ఏమీ తెలియదని, టర్కీ కీలక పాత్ర పోషించనుందని చెప్పాడు.
అసద్‌ స్థానంలో కొత్తగా అధికారానికి వచ్చిన వారు ఉగ్రవాదులా, కాదా అంటే అవును అన్నది వాస్తవం.హెచ్‌టిఎస్‌ నేత అబూ మహమ్మద్‌ అల్‌ జొలానీది అదే నేపథ్యం. ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలో పనిచేశాడు. తాజాగా అధికారానికి రావటం కోసం అలాంటి వారితో చేతులు కలిపాడు. ఇదే సమయంలో ఆల్‌ఖైదాతో విడగొట్టుకోవటంతో పాటు జీహాదీలకు వ్యతిరేకంగా పనిచేసిన చరిత్ర కూడా ఉంది. అతగాడిని అమెరికా ఇప్పటికీ ఉగ్రవాదిగానే పరిగణిస్తున్నది, గతంలో అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టింది. అయితే తాజాగా అమెరికన్లు అధికారంలో ఉన్నవారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అసద్‌ ప్రభుత్వం కూలిపోయినందుకు అక్కడి జనం ఆనందంతో ఉన్నారు. అది ఎంతకాలం ఉంటుంది? రానున్న రోజుల్లో జొలానీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎలా ఉంటుంది, అసలు స్థిరత్వం చేకూరుతుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. గాజాలో ఇజ్రాయిల్‌ మారణకాండ ప్రారంభమై పద్నాలుగు నెలలు గడిచాయి. పాలస్తీనియన్లకు మద్దతుగా ఉన్న లెబనాన్‌లోని హిజబుల్లా సాయుధ సంస్థతో ఇజ్రాయిల్‌ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తరువాత సిరియా పరిణామాలు జరిగాయి. 2011లో ప్రారంభమైన అంతర్యుద్ధంతో సిరియన్లు అనేక విధాలుగా దెబ్బతిన్నారు, దేశం సర్వనాశనమైంది. కుక్కలు చింపిన విస్తరిలా సాయుధ ముఠాలు కొన్ని ప్రాంతాలను తమ అదుపులో ఉంచుకున్నాయి. ఆరు లక్షల మంది వరకు పౌరులు, సాయుధులు, సైనికులు మరణించినట్లు అంచనా, 70లక్షల మంది అంతర్గతంగా నెలవులు తప్పగా మరో 70లక్షల మంది వరకు ఇరుగుపొరుగు దేశాలకు శరణార్ధులుగా వెళ్లారు. అంతర్యుద్ధం ముగిసినా సాధారణ జీవన పరిస్థితి ఎంతకాలానికి పునరుద్ధరణ అవుతుందన్నది పెద్ద ప్రశ్న.
కొత్త ప్రభుత్వం కొలువు తీరలేదు,వారు తమతో ఎలా ఉంటారో తెలియదు కనుక రానున్న రోజుల్లో సిరియాను దెబ్బతీయాలంటే దాని పాటవాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయిల్‌ పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఆయుధ ఫ్యాక్టరీలు, నౌకా దళం ఇతర మిలిటరీ వ్యవస్థలను నాశనం చేస్తున్నది. వాటిలో ఇరాన్‌, రష్యా సరఫరా చేసిన ఆయుధాలు, వాటి నిల్వకేంద్రాలు కూడా ఉన్నాయి. ఇదంతా అమెరికా కనుసన్నల్లో జరుగుతున్న దని వేరే చెప్పనవసరం లేదు. గత కొద్ది నెలలుగా లెబనాన్‌పై దాడి అక్కడ పెద్ద సాయుధ శక్తిగా ఉన్న హిజబుల్లాపై దాడులు, దాని నేతల హత్యలో ఇజ్రాయిల్‌ ్‌పాత్ర గురించి తెలిసిందే. సిరియాకు మద్దతుగా అది ఇంకేమాత్రం దాడులు చేసే స్థితిలో లేదని చెబుతు న్నారు. కొనసాగుతున్న ఉక్రెయిన్‌ సైనిక చర్య కారణంగా రష్యా, ఆంక్షల వలన ఇరాన్‌ మిలిటరీ సరఫరాలు కూడా తగ్గిపోయాయి. సిరియాలో ఉన్న తన నౌకా కేంద్రాన్ని రక్షించుకోవటంలోనే రష్యా మునిగి ఉంది. సిరియాలో అధికారాన్ని చేజిక్కించుకున్న హెచ్‌టిఎస్‌ సంస్థకు టర్కీ ప్రధాన మద్దతుదారుగా ఉంది. పరోక్షంగా ఇజ్రాయిల్‌ కూడా ఒక దశలో సాయం చేసిందని నిఘావర్గాలు చెబుతున్నాయి. అసద్‌ ప్రభుత్వం అణచివేతలకు పాల్పడిందనే విమర్శలు ఉన్నప్పటికీ అది ఇస్లామిక్‌ మత ఛాందసవాదాన్ని ప్రోత్సహించిన దాఖలాలు లేవు. ముస్లింలలో అనేక తెగలు ఉన్నాయి. అవి ఒక్కో ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిలో కర్దులు ఒకరు. ఇస్లామిక్‌ తీవ్ర వాద ఐసిస్‌, ఆల్‌ఖైదా కూడా అసద్‌ను వ్యతిరేకించాయి. వీటితో పాటు అమెరికా తనకు అనుకూలమైన శక్తులకు భారీఎత్తున సాయం చేసింది. అవేవీ అసద్‌ ప్రభుత్వాన్ని కదిలించలేక పోయాయి. సిరియాలో చమురు నిల్వలున్న ప్రాంతాల మీద అమెరికా ఆధిపత్యం ఉంది. అక్కడ దాని సైనికులు కూడా ఉన్నా రు. గతంలోనే సిరియాలోని గోలన్‌ గుట్టల ప్రాంతాన్ని ఇజ్రాయిల్‌ ఆక్రమించింది. కొంత ప్రాంతాన్ని ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో బఫర్‌జోన్‌గా ఉంచారు. అక్కడికి ఎవరూ ప్రవేశించకూడదు. అయితే డిసెంబరు ఎనిమిది నుంచి ఇజ్రాయిల్‌్‌ దళాలు అతిక్రమించి సిరియాలోకి చొచ్చుకుపోయాయి.
ఇప్పుడు సిరియా భవితవ్యం ఏమిటి? అంటే ఎవరూ ఏమీ చెప్పలేని స్థితి.అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా దశాబ్దాలపాటు జోక్యం చేసుకున్న రష్యా రానున్న రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించేది తెలియదు.నూతన పాలకులు టర్కీ కనుసన్నలలో పని చేసే అవకాశం ఉంది. నాటోలో అది అమెరికా అనుయాయి.అదే సమయంలో కొన్ని అంశాలలో దానితో విబేధించి రష్యాతో సంబంధాలు కలిగి ఉంది. సిరియా పరిణామాల్లో రష్యా, అమెరికా రెండూ తమ ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నించాయి. దాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా పెద్దఎత్తున తిరుగుబాటుదార్లను ప్రోత్సహించింది.ఇటీవల జరిగిన పరిణామాలను చూసినపుడు సిరియాలో ఇంక అమెరికా చేసేది ఏముంది అని కొందరు నిరుత్సాహాన్ని ప్రకటించారు. ప్రచ్చన్న యుద్ధం ముగిసిన 1990 దశకం తరువాత ”ఆపరేషన్‌ టింబర్‌ సైకామోర్‌ ” పేరుతో అమెరికా భారీ మొత్తాలను సిరియాలో కుమ్మరించిందని చెబుతున్నారు. ఉదారవాద తిరుగుబాటుదార్ల ముసుగులో 2013 నుంచి 2017వరకు నాలుగేండ్లలో అమెరికా సిఐఏ ద్వారా వివిధ సంస్థలకు వంద కోట్ల డాలర్లకు పైగా అందచేసిందని అంచనా. ఆ తరువాత కూడా తరతమ తేడాలతో ఇదే విధంగా తిరుగుబాటుదార్లకు చేరుస్తున్నది. అసద్‌ వ్యతిరేకులకు మద్దతుతో పాటు సిరియాలో అమెరికాను కూడా వ్యతిరేకించే శక్తులను దెబ్బతీసేందుకు చూసింది. అమెరికా మిలిటరీ కూడా 50 కోట్ల డాలర్లతో తిరుగుబాటుదార్లకు శిక్షణ, ఆయుధాలను అంద చేసింది. ఇవన్నీ ఘోరంగా విఫలమ య్యాయి. టర్కీ మద్దతు ఉన్న తిరుగుబాటుదార్లు డమాస్కస్‌ను పట్టుకుంటారని కూడా అమెరికా ఊహించినట్లు కనపడదు.లేదా నిస్సహాయంగా ఉండిపోయిందని చెప్పవచ్చు. అందుకే ట్రంప్‌ అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.
ఒబామా గనుక కాస్త ముందుగా జాగ్రత్తపడి ఉంటే అసద్‌ తొలగింపు మరింత వేగిరం, అమెరికా ప్రమేయం కూడా ఉండేదని రణోన్మాదులు కొందరు నిష్ట్టూరాలాడుతున్నారు. అమెరికా మద్దతిచ్చిన మిలిటెంట్‌ సంస్థలన్నీ అంతర్గత కుమ్ములాటలు, అవినీతి, గూండాయిజాలతో కొట్టుకు చచ్చాయని, ఆల్‌ఖైదాకు ఆయుధాలు అమ్ముకున్నట్లు విమర్శిస్తున్నారు. ఈ శక్తులు అసద్‌ మీద ఒత్తిడి తెచ్చి అంతర్జాతీయ సమాజంతో చర్చలకు నెడతాయని అమెరికా ఊహించినదానికి భిన్నంగా అసద్‌ బలమైన శక్తితో అనేక నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు సిరియాలో మాజీ అమెరికా రాయబారి రాబర్ట్‌ పోర్డ్‌ చెప్పాడు. సిఐఏ మద్దతు ఇచ్చిన తిరుగుబాటుదార్లు ఒక బాల ఖైదీ తలనరికే వీడియోను చూసిన డోనాల్డ్‌ ట్రంప్‌ సిరియా మీద ఆసక్తి కోల్పోయాడని, అమెరికా మిలిటరీ తరువాత సిరియాలోని కర్దులకు మద్దతు ఇవ్వటంపై కేంద్రీకరించిందని చెబుతున్నారు.
అమెరికా నుంచి నిధులు పొందిన ఫ్రీ సిరియన్‌ ఆర్మీ వంటి సంస్థలు చివరకు టర్కీ అనుకూల సిరియన్‌ నేషనల్‌ ఆర్మీగా మారిపోయాయని, వారు కర్దులపై లైంగికదాడులు, దోపిడీలకు పాల్పడటంతో అదే అమెరికా చివరికి మానవహక్కులకు భంగం కలిగించారనే పేరుతో ఆంక్షలు విధించిందని అంటున్నారు. చివరికి నవంబరు చివరివారంలో ఈ శక్తులు లూటీలకు పాల్పడుతుం డటంతో తాజాగా అధికారానికి వచ్చిన హెచ్‌టిఎస్‌ దళాలు వారిని అణచివేసి అరెస్టు చేశాయని, ఇలాంటి పనులు చేసిన తరువాత అమెరికాకు సిరియాలో ఇంక చేసేందుకు ఏమి మిగిలిందని ప్రశ్నిస్తున్నారు.ఈ విమర్శలన్నీ మరింత గట్టిగా వ్యవహరించలేదని, సిరియాను తమ అదుపులోకి తెచ్చుకోలేదని తప్ప పరాయి దేశంలో జోక్యం తప్పనే కోణం నుంచి కాదు. రాబోయే రోజుల్లో ఏమి జరిగినప్పటికీ అమెరికా డ్రైవర్‌ సీట్లో కూర్చొనే అవకాశం లేదని, చేసిన ఖర్చంతా వృధా అయిందని విమర్శిస్తున్నారు.
సిరియాలో అసద్‌ ప్రభుత్వాన్ని కూలదోయటంలో ఏకీభావంతో ఉన్న శక్తులన్నీ తరువాత అధికారాన్ని అలాగే పంచుకుంటాయని చెప్పలేకపోతున్నారు. లిబియాలో అమెరికాను వ్యతిరేకించిన గడాఫీ ప్రభుత్వాన్ని కూలదో సేందుకు నాటో కూటమి దేశాలన్నీ తిరుగుబాటు శక్తులను ప్రోత్సహించాయి, తీరా 2011లో గడాఫీ సర్కారు కూలిపోయిన తరువాత ఇప్పటి వరకు అధికారం కోసం కుమ్ములాడుకుంటూనే ఉన్నాయి. అదే స్థితి సిరియాలో తలెత్తవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికీ హెచ్‌టిఎస్‌ను ఉగ్రవాద సంస్థగా దాని నేత జొలానీ ఉగ్రవాదిగా వర్ణిస్తున్న అమెరికా రానున్న రోజుల్లో అతని నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడితే ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రశ్న.అతనికీ అదే పరిస్థితి.
ఈ సంస్థ రానున్న రోజుల్లో ఇరాన్‌తో చేతులు కలపవచ్చని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు అనుమానిస్తున్నాడు. అది గనుక తమపై దాడికి దిగితే ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని, గత ప్రభుత్వానికి ఏమి జరిగిందో దీనికీ అంతే అని హెచ్చరించాడు. నూతన పాలకులతో రష్యా సంబంధాలు పెట్టుకోవచ్చని, ఇరాన్‌ కూడా అదే చేయవచ్చని కూడా పశ్చిమదేశాల పరిశీలకులు చెబుతున్నారు. సిరియాలో ఉన్న తమ సైన్యాన్ని వెనక్కు రప్పిస్తానని గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. అయితే జనవరి 20న కొలువు తీరనున్న ట్రంప్‌ సర్కార్‌లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మార్కో రుబియో మాత్రం వేరుగా స్పందించాడు. రానున్న రోజుల్లో ఉగ్రవాద ముప్పు తలెత్తితే ఎదుర్కొనేందుకు అక్కడ తమ సైన్యం ఉండటం అవసరమని సెలవిచ్చాడు.సిరియాలో ఇప్పటికైతే పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
ఎం కోటేశ్వరరావు
8331013288

Spread the love