టీయూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేయాలి

– వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి జంగిటి కైలాసం డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీయూటీఎఫ్‌ నిబంధనావళికి విరుద్ధంగా అప్రజాస్వామికంగా ఏర్పడిన రాష్ట్ర కార్యవర్గాన్ని వెంటనే రద్దు చేయాలని ఆ సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, మాజీ అధ్యక్షులు జంగిటి కైలాసం డిమాండ్‌ చేశారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డిని కైలాసం, నాయకులు ఆర్‌ వెంకటేశ్వర్లు, సిహెచ్‌ వెంకటేశ్వరరావు, బుర్రా రమేష్‌ కలిసి ఫిర్యాదు చేశారు. టీయూటీఎఫ్‌ రాష్ట్ర ఆరో విద్యా మహాసభలు, ప్రతినిధుల సభ ఈనెల 10,11 తేదీల్లో రెండు రోజులపాటు ఆదిలాబాద్‌లో జరుగనున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఆదివారం రాష్ట్ర విద్యా మహాసభ జరిగిందని వివరించారు. సోమవారం ప్రతినిధుల సభలో రెండేండ్ల ఆర్థిక నివేదిక, ప్రధాన కార్యదర్శి నివేదిక, సభ్యత్వ నమోదు వివరాలు, కౌంటర్‌ ఫైల్స్‌ జిల్లాల వారీగా సభ్యత్వాల జాబితా, ఆయా జిల్లాల సభ్యత్వాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రతినిధుల జాబితా విడుదల చేసి ప్రతినిధుల సభ ఆమోదం పొందాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిటీకి వాటిని అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇవేవీ చేయకుండా ఆదివారం రాత్రి ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన డి మల్లారెడ్డి, దామెర శ్రీనివాస్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధపడ్డారని పేర్కొన్నారు. ప్రతినిధుల సభకు హాజరైన చాలామంది ఈ ప్రక్రియను వ్యతిరేకించారని తెలిపారు. వివరాలన్నీ లేకుండా ఎన్నికలను ఎలా జరుపుతారు అవి వచ్చిన తర్వాతే ప్రతినిధుల సభ ఆమోదం పొందాక జరపాలని ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మెజార్టీ జిల్లాలు పాల్గొనకుండా అప్రజాస్వామిక విధానాలతో ఎన్నిక జరిగినట్టు ప్రకటించుకున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికైన టీయూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని వెంటనే రద్దు చేసి నిబంధనల మేరకు వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Spread the love