– డీఎస్పీ డైరీలో వందలాది ఫోన్ నెంబర్లు
– ఒక మీడియా యజమాని కూడా కుమ్మక్కు
– బీఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్ నాయకుడు సూత్రధారి
– అడవిలో పారేసిన హార్డ్‌డిస్క్‌ల కోసం సాగుతున్న పోలీసుల వేట
– కొనసాగిన ప్రణీత్‌రావు మూడో రోజు విచారణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ)లో కొనసాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను దర్యాప్తు అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది. వరంగల్‌కు చెందిన ఈ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ప్రధాన నిందితుడు డీఎస్పీ ప్రణీత్‌రావు బ్యాచ్‌కు చెందిన అధికారులే అని తెలుస్తున్నది. అదే సమయంలో,ప్రణీత్‌రావు డైరీలో వందలాది ఫోన్ నెంబర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇంకోవైపు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక మీడియా యజమాని పాత్ర కూడా ఉన్నట్టు విచారణలో వెలుగు చూసింది. ఎస్‌ఐబీ కార్యాలయంలో డీఎస్పీగా ఉన్న సమయంలో ప్రణీత్‌రావు అధికారంలో ఉన్న కొందరు పెద్దల ప్రోద్బలంతో ప్రతిపక్షాలకు చెందిన పలువురు నాయకుల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు వెలుగు చూడటం, ఈ ఉదంతంలో డీఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేయటం తెలిసిందే. అతనిపై కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు ఏడ్రోజుల పాటు దర్యాప్తు అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. జూబ్లిహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం.. ప్రణీత్‌రావును విచారిస్తున్నది.
ఆధారాలను ధ్వంస చేసి.. అడవుల్లో పడేసి..
విచారణలో ప్రణీత్‌రావుకు సంబంధించి అనేక నిజాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, ఎస్‌ఐబీలోని లాగిన్ రూమ్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) గదిలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు.. వాటిని తీసుకెళ్లి వికారాబాద్ అడవుల్లో పడేయటంతో ఆ పరికరాల కోసం ఒక ప్రత్యేక పోలీసు బృందం గాలింపులు జరుపుతున్నది. ఆ హార్డ్ డిస్క్‌లలోనే తాను ట్యాపింగ్ చేసిన ప్రతిపక్ష నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారుల డేటా ఉన్నదనీ, వాటిని విధ్వంసం చేయటం ద్వారా ఆధారాలు దొరకకుండా చేయాలనేది ప్రణీత్‌రావు కుట్రగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
వరంగల్, సిరిసిల్ల, ఒక మీడియా సంస్థ యజమాని ఆఫీసులో సర్వర్లు
ఈ మూడ్రోజుల విచారణలో తాను ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు అంగీకరించిన ప్రణీత్‌రావు.. వాటి వివరాలను ఎస్‌ఐబీకి చెందిన ఒక మాజీ ఐజీకి అందజేసినట్టుగా కూడా బయటపెట్టినట్టు తెలిసింది. అదే సమయంలో, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక ప్రధాన సూత్రధారిగా బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక సీనియర్ నాయకుడు కీలక పాత్ర వహించినట్టుగా కూడా ప్రణీత్‌రావు బయటపెట్టినట్టు సమాచారం. అదే సమయంలో, సిరిసిల్ల, వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లోని ఒక మీడియా సంస్థ యజమాని కార్యాలయంలో సర్వర్లను పెట్టి వాటి ద్వారా ఫోన్ ట్యాపింగ్‌లకు ప్రణీత్‌రావు పాల్పడినట్టు కూడా వెలుగు చూసింది.
మూడు షిఫ్టుల్లో 15 మందికి పైగా సిబ్బంది
ఎస్‌ఐబీలోని లాగిన్‌రూమ్‌లో 17కు పైగా కంప్యూటర్ల సాయంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రణీత్‌రావు ముందుకు సాగించినట్టు అధికారులు కనుగొన్నారు. ఈ పనులు చూడటానికి మూడు షిఫ్టుల్లో 15 మందికి పైగా ఎస్‌ఐబీ సిబ్బందిని ప్రణీత్‌రావు వాడుకున్నారనీ, ఈ పనిని సక్రమంగా చేస్తే ప్రమోషన్లను ఇప్పిస్తానని ఆశ పెట్టినట్టు కూడా వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్లు మొదలుకొని కానిస్టేబుల్ స్థాయి అధికారుల వరకు ప్రణీత్‌రావు వాడుకున్నట్టు దర్యాప్తులో తేలింది. కాగా, ప్రణీత్‌రావు దగ్గర దొరికిన ఒక డైరీలో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నాయనీ, వాటన్నిటినీ ట్యాపింగ్ చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అందులో అప్పటి అధికారపక్షం కోరుకున్న ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్‌లతో పాటు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మరికొందరు ఇతర వ్యాపారులు, సెలబ్రిటీలవి ఫోన్‌లు ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తున్నది.
మరికొందరు అధికారులు, సిబ్బంది విచారణకు రంగం సిద్ధం
ఇంకోవైపు, మీడియా యజమాని కోరిన మేరకు మరికొందరి ఫోన్ ట్యాపింగ్‌లకు కూడా ప్రణీత్‌రావు పాల్పడినట్టు బయట పడింది. మొత్తమ్మీద, ప్రణీత్‌రావు కొన్నేండ్ల కిందనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఇందులో కొందరు జర్నలిస్టులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫోన్‌నెంబర్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్టు వెలుగు చూసింది. దీంతో, ఇటు రాజకీయ పక్షాలు మొదలుకొని అటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుండెల్లో ఈ వ్యవహారం రైళ్లు పరిగెత్తిస్తున్నది. కాగా, దీనికి సంబంధించి ప్రణీత్‌రావుకు సహకరించారనే అనుమానాలున్న మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను అదుపులోకి తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది. అలాగే, ప్రణీత్‌రావుతో అంటకాగిన మరికొందరు అధికారులు, సిబ్బందికి కూడా నోటీసులు ఇచ్చి విచారించటానికి రంగం సిద్ధం చేశారు.