స్పీకర్‌పై అనుచిత విమర్శలు

– పార్టీ ఫిరాయింపులపై సింగిల్‌ జడ్జి ఆదేశాలు రద్దు చేయండి : హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారంటూ దాఖలైన పిటిషన్లపై కోర్టులు న్యాయ సమీక్ష చేసేందుకు విధివిధానాలు ఉన్నాయనీ, స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాతే కోర్టులు న్యాయసమీక్షకు వీలుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టులో వాదించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లలో ఫలానా తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని గడువు విధించే అధికారం కోర్టులకు లేదన్నారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన పది రోజులకే బీఆర్‌ఎస్‌ హైకోర్టును ఆశ్రయించిందని తప్పుపట్టారు. స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడానికి కనీస గడువు కూడా ఇవ్వలేదన్నారు. దీనికితోడు తమ పిటిషన్లను స్వీకరించడం లేదంటూ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నాలుగు వారాలు గడువిస్తున్నామనీ, అప్పటిలోగా విచారణ అంశంపై తగిన నిర్ణయం తీసుకోని పక్షంలో తామే ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని సెప్టెంబర్‌ 9న స్పీకర్‌ కార్యదర్శికి హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనల తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ కూడా వాదించారు. వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.

Spread the love