దక్షిణాది సినిమాపై అపూర్వ పరిశోధన

On southern cinema Unprecedented researchదురదష్టవశాత్తూ ఇవాళ తెలుగు సినిమా విమర్శ అంటే… అయితే కొత్త చిత్రాల సమీక్ష, లేదా పాత చిత్రాల గొప్పదనం విశ్లేషణగా స్థిరపడిపోయింది. దీనికి భిన్నంగా, అరుదుగా కొంతమంది సినీ చరిత్రకారులు ఉంటారు. సినీ రంగం స్థితిగతులపై సుదీర్ఘ కాలంగా విశ్లేషణ, పరిశోధనాత్మక వ్యాసాలు రాస్తున్న విశిష్ట చరిత్రకారుడు డాక్టర్‌ రెంటాల జయదేవ. ఆయన ఇప్పుడు ‘మన సినిమా… ఫస్ట్‌ రీల్‌’ పేరుతో, అనితరసాధ్యమైన కషి చేశారు. మన తెలుగు సినిమాయే కాక, మొత్తం దక్షిణాది భాషా చిత్రాల తొలినాళ్ళ చరిత్రను ఈ బహత్‌ గ్రంథంతో వెలుగులోకి తెచ్చారు.
అసలు మన దేశంలో సినిమా ఎలా మొదలైంది? అది మన దక్షిణాదికి ఎలా విస్తరించిందో రచయిత తెలిపారు. బొంబాయి, కలకత్తా, మద్రాసుల్లో, హైదరాబాద్‌ స్టేట్‌ లో, కన్నడ దేశంలో, మలయాళ సీమలో… ఇలా ప్రాంతీయ శాఖలుగా భారతీయ సినిమా ఎలా ప్రారంభమైందో తెలిపారు. అప్పట్లో మూకీ సినిమాల పట్ల ప్రజలు ఆదరణ చూపించారు. అయితే తెర మీద ఏవో బొమ్మలు పరుగెడుతూ ఉన్నాయి తప్ప మాటలు, పాటలు లేవనే అసంతప్తి కొంత ఉండేది. ఆ సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యంత్ర పరికరాల సహాయంతో మాటలున్న టాకీ చిత్రాలు ప్రదర్శించేందుకు వీలు కలిగింది. అలా విదేశీ టాకీల దిగుమతి, ప్రదర్శన సాగుతున్న పరిస్థితుల్లో 1931 మార్చి 14న భారతదేశపు మొదటి టాకీ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘ఆలం ఆరా’ విడుదలైంది.
‘ఆలం ఆరా’ తర్వాత నాలుగేళ్లలో సైలెంట్‌ సినిమాల నుంచి శబ్ద చిత్రాల మార్పు పూర్తిగా జరిగిపోయింది. తొలి భారతీయ టాకీ హీరోయిన్‌ జుబేదా మన హైదరాబాదీ కోడలే. స్టంట్‌ మూకీల స్టార్‌ హీరో మాస్టర్‌ విఠల్‌ తొలి టాకీ హీరో అయ్యే అదష్టం పట్టినా, ఎక్కువకాలం తన స్టార్‌ హౌదాను నిలబెట్టుకోలేక పోయారు. ఇందులో హీరోగా అవకాశం చేజారిన మెహబూబ్‌ ఖాన్‌ మాత్రం తర్వాత కాలంలో స్టార్‌ డైరెక్టర్‌ గా ఎదగడం విశేషం. తొలి భారతీయ టాకీ ‘ఆలం ఆరా’ (1931) రూపకల్పన ఎంత ఆసక్తికరమైనదో… ఆ చిత్ర నిర్మాణ శిల్పి అర్దేశీర్‌ ఇరానీ సినీ ప్రస్థానం కూడా అంతే ఆసక్తికరమని ఆ భారతీయ టాకీపతి విశిష్టత – గొప్పదనాన్ని వివరించారు.
తొలి పూర్తి తెలుగు టాకీ ఏమిటని అడగగానే అందరూ సర్వసాధారణంగా ‘భక్త ప్రహ్లాద’ (1932) అని చెబుతారు. ఇక, ఈ పుస్తకంలో రెంటాల జయదేవ మరో కొత్త పరిశోధనతో ముందుకొచ్చారు. పది రీళ్ళ పూర్తి నిడివి ‘100% సంపూర్ణ తెలుగు టాకీ’… ‘భక్త ప్రహ్లాద’ రిలీజు (1932 ఫిబ్రవరి 6) కన్నా మూణ్ణెల్ల పైచిలుకు ముందే 1931 అక్టోబర్‌ 31న విడుదలై, తెరపై బొమ్మలు తెలుగులో మాట్లాడిన, తెలుగు త్యాగరాయ కీర్తనలతో అలరించిన తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ సినిమా… ‘కాళిదాస్‌’. ఆ సంగతి పుష్కరకాలం క్రితమే మన దష్టికి తెచ్చిన జయదేవ… తీరా తమిళులు ఆ చిత్రాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమిళ సినీచరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే తెలుగు మాటలు, పాటలున్న ఆ చిత్రాన్ని తెలుగువాళ్ళమైన మనం లెక్కలలో పూర్తిగా వదిలేసుకుంటున్న సంగతిపై ఈ రచనలో ఫోకస్‌ లైట్‌ వేశారు.
‘కాళిదాస్‌’ పూర్తి నిడివి కథా చిత్రమేమీ కాదు. అది అసలు ఒకే సినిమా కూడా కాదు… మూడు చిన్న నిడివి చిత్రాలను కలిపి ఒకే షోగా జనానికి చూపిన కదంబ కార్యక్రమ ప్రదర్శన. అసలు సినిమాకు ముందూ వెనుకా తమిళ పాటలు, డ్యాన్సుల లఘు చిత్రాలు రెండు వేశారు.
తమిళులు తమ చరిత్ర లెక్కల్లో ‘కాళిదాస్‌’ను తొలి తమిళ టాకీగా చెప్పుకుంటున్నా, అందులో అసలు తమిళ డైలాగులే లేవు. అచ్చంగా తెలుగు డైలాగులతోనే ఆ కథను చిత్రీకరించారని రెంటాల తెలియజేశారు . నిజానికి, 4 రీళ్ళే ఉన్న ఆ ‘కాళిదాస్‌’ లఘు కథా చిత్రం పూర్తిగా తెలుగు డైలాగులతోనే నడిచిన సినిమా అని తన నూతన పరిశోధనలో వెల్లడించారు. అది అచ్చమైన తెలుగు మాటల సినిమా అనేందుకు సాక్ష్యాధారాల బలం చేకూరుస్తూ… అప్పట్లోనే ఆ చిత్ర హీరోయిన్‌ టి.పి. రాజలక్ష్మి, ఆ చిత్రంలో నటించిన ఎల్‌.వి. ప్రసాద్‌, సినిమా రిలీజైన వెంటనే ఆ రోజుల్లో తమిళ ‘ఆనంద వికటన్‌’ మేగజైన్‌ లో ప్రసిద్ధ తమిళ రచయిత ‘కల్కి’ కష్ణమూర్తి రాసిన వ్యంగ్యపూరిత సమీక్ష… ఇలా అందరూ ఇచ్చిన ఇంటర్వ్యూలు, రాసిన మాటలను ఆధార సహితంగా జయదేవ ఈ పుస్తకంలో బయటపెట్టారు.
అలా ఒకటికి మూడు లఘు చిత్రాల సమాహారంగా రిలీజైన తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్‌’లో కథానాయిక పాత్ర ధరించిన టి.పి. రాజలక్ష్మి బహుముఖ ప్రజ్ఞాశాలిని. టీనేజ్‌ లోనే పెద్ద రంగస్థల నటిగా, మూకీ స్టార్‌ గా వెలసిన రాజలక్ష్మి ‘ఫస్ట్‌ ఉమన్‌ డైరెక్టర్‌ ఇన్‌ సౌత్‌ ఇండియా’. విప్లవాత్మక నవలా రచయిత్రిగా, సినీ నిర్మాతగా, సామాజిక ఉద్యమకారిణిగా వెలుగొందిన ఆమె చివరలో… ఆర్థిక పరాజయాలతో ఆస్తులన్నీ కరిగిపోయి, అనామకంగా కన్నుమూయడం విషాదం. ఆ కథంతా ఈ పుస్తకంలో చదవచ్చు. అలాగే వెండితెరపై కలర్‌ దశ్యాల ఆవిర్భావ వికాసాల కథనూ, అప్పట్లోనే సినిమా సమీక్షలపై – సమీక్షకులపై చెలరేగిన విమర్శల దుమారాన్ని కూడా ఇందులో తెలియజేశారు.
గతంలో పరిశోధనాత్మక దష్టితో వాస్తవాలను పరిశీలించని సినీ పండితమన్యులు కొందరు మొదట ‘భక్త ప్రహ్లాద’, ఆపైన ‘కాళిదాస్‌’ వచ్చాయని వాస్తవ విరుద్ధ అంశాలను చాలాకాలం ప్రచారంలో పెట్టారు. దాంతో, అటు ‘కాళిదాస్‌’ విడుదల (1931 అక్టోబర్‌ 31) కి కానీ , ఇటు ‘భక్త ప్రహ్లాద’ విడుదల (1932 ఫిబ్రవరి 6) కి కానీ అసలు సంబంధమే లేని 1931 సెప్టెంబర్‌ 15 అనే తప్పుడు తేదీ తెరపైకి వచ్చింది. అది తెలుగు సినిమా జన్మదినం అంటూ అసలు పుట్టని తేదీన తెలుగు సినిమాకు పుట్టినరోజు వేడుక జరుపుతూ వచ్చారు. అది తప్పు అన్న సంగతి 2011లోనే ఈ పుస్తక రచయిత రెంటాల జయదేవ తన పరిశోధనతో తేల్చారు.
జయదేవ తొలి లఘు నిడివి 4 రీళ్ళ తెలుగు టాకీ ‘కాళిదాస్‌’, తొలి పూర్తి నిడివి 10 రీళ్ళ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’తో పాటు, మన తెలుగు తర్వాతే తమిళంలో పూర్తి నిడివి టాకీలు వచ్చాయని వెల్లడించారు. పూర్తి నిడివి టాకీల్లో సైతం మన తెలుగు ‘భక్త ప్రహ్లాద’ తరువాతే… తమిళ పూర్తి నిడివి తొలి టాకీ ‘హరిశ్చంద్ర’ (1932 ఏప్రిల్‌ 9) వచ్చింది. చరిత్రకారులకు చాలాకాలంగా ఉన్న సందిగ్ధతను పోగొట్టారు.
ఆసక్తికరమైన అప్పటి టాకీ టెక్నిక్‌, పాఠాలు అంటూ అప్పటి ఛాయాగ్రహణం, సౌండ్‌ రికార్డింగ్‌, కలర్‌ ప్రింట్ల విషయంలో వచ్చిన క్రమ వికాస పరిణామాన్ని కూడా ఈ పుస్తకంలో మన కళ్ళ ముందు ఉంచారు. తెలుగు, తమిళంలో కంటే కొంత ఆలస్యంగా అనగా 1934లో తొలి కన్నడం టాకీ ‘సతీ సులోచన’ విడుదలైంది. కన్నడ టాకీ పితామహుడిగా కొనియాడబడే నట, దర్శక, నిర్మాత వై.వి. రావు తెలుగువాడే! త్రిపురాంబ తొలి కన్నడ టాకీ హీరోయిన్‌. ఆ తొలి కన్నడ టాకీకి సంగీత దర్శకత్వంలో కీలకమైన హెచ్‌.ఆర్‌. పద్మనాభ శాస్త్రి మన తెలుగువాడే! అవన్నీ ఈ రచనలో ఆసక్తికరంగా తెలియజేశారు.
తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాల తర్వాత 1938లో కానీ, తొలి మలయాళ టాకీ ‘బాలన్‌’ విడుదల కాలేదు. తొలి మలయాళ టాకీలో నటించిన హీరో, హీరోయిన్‌, దర్శకుడు… ఈ ముగ్గురిదీ చాలా చిత్రమైన కథ. ఈ ముగ్గురూ జీవితంలో ఎక్కడ మొదలై, ఎక్కడ చేరారని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చివరకు టీ షాప్‌ లో సర్వర్‌ గా మారిన హీరో, మూడు సినిమాలకే కెరీర్‌ ముగిసిన హీరోయిన్‌, సినిమాల్లో సర్వం కోల్పోయి దుస్తుల వ్యాపారిగా మారిన దర్శకుడు – ముగ్గురు ముగ్గురే! ఒక్కొక్కరిది ఒక్కో సినిమా కష్టం. ఒక్కో సినిమా స్టోరీ! ఇక, మలయాళ సినిమాలో ప్రవేశించిన మన తెలుగు తారలు కాంతారావు, సి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు, విజయనిర్మల, ఊర్వశి శారద తదితరుల ప్రగతి, విద్యావంతుల వేదికగా మారిన మలయాళ సినిమా అనేక మార్పులకు అందమైన చిరునామా అంటూ ఆ చిత్ర పరిశ్రమ ఒడుదొడుకులనూ, గొప్పదనాన్నీతెలియజేశారు.
తెలుగు, తమిళమే కాదు… ఇతర దక్షిణాది భాషల సినిమా చరిత్రలో ఇప్పటి దాకా తప్పుగా నమోదైన పలు విషయాలను ఈ పరిశోధనాత్మక రచనలో జయదేవ సరిచేయడం విశేషం. ఇవాళ్టికీ కన్నడ సినిమా చరిత్రలో చరిత్రకారులు తొలి కన్నడ టాకీ ‘సతీ సులోచన’ (1934) హీరోయిన్‌ త్రిపురాంబ అంటూ కె.ఎల్‌.వి. వసంత అనే తమిళ సినీ నటి ఫోటో వేస్తున్న సంగతిని ఆయన బహిర్గతం చేశారు. ఇలా దక్షిణాది భారతీయ భాషల చరిత్రను సాధికారికంగా రూపొందించడంలో జయదేవ చేసిన కషి ప్రశంసించదగినది.
కొన్ని సంస్థలు, యూనివర్సిటీలు కలిసి చేయాల్సిన పనిని ఒక వ్యక్తిగా రెంటాల జయదేవ ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి భుజాన వేసుకున్నారు. విశేషంగా శ్రమించి, సమాచారం సేకరించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడమే కాక, అలనాటి వారు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల నుండి కూడా ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి ఈ పుస్తకంలో పొందుపరిచారు. అరుదైన, విలువైన ఫోటోలనూ, వందేళ్ళ క్రితం నాటి పేపర్‌ క్లిప్పింగులనూ చూడముచ్చటగా విస్తతంగా ఇచ్చారు. దాని వల్ల ఈ సినీ చరిత్ర గ్రంథం అందంగా, ఆకర్షణీయంగా తయారవ్వడమే కాదు. మరింత సాధికారతను సంతరించుకుంది. భారతీయ, మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ రెంటాల జయదేవ ‘మన సినిమా… ఫస్ట్‌ రీల్‌’ మంచి రెఫరెన్స్‌ బుక్‌ గా చిరకాలం నిలిచిపోతుంది. ఇది అందరూ కొని, చదివి, పదిలంగా దాచుకోవాల్సిన అరుదైన రచన.
– కె.పి.అశోక్‌ కుమార్‌
9700000948

Spread the love