అవాస్తవ వివాదం- ఓట్ల రాజకీయం

Chhatrapati Shambhajiఛత్రపతి శంభాజీ నగర్‌ జిల్లాగా పేరు మారిన ఔరంగాబాద్‌ నుంచి ప్రసిద్ధమైన ఎల్లోరా గుహలకు వెళ్లే దారి మధ్యలో కాస్త సమయం వెచ్చిస్తే కనిపిస్తుంది ఖుల్దాబాద్‌. పిల్లల బొమ్మల దుకాణాలను దాటుకుని నడిస్తే సూఫీ సాధువు సయ్యద్‌ జియానుద్దీన్‌ షేర్జీ దర్గా. ఆ దర్గాలో ఉంటుంది 17వ శతాబ్దంలో భారతీయులను పాలించిన చక్రవర్తి ఔరంగజేబు సమాధి. పెద్ద హంగామా ఏమీ ఉండదు. తండ్రి షాజహాన్‌ తన అందాల ప్రేమకు జాపకార్థం మనోహరమైన తాజ్‌మహల్‌ నిర్మించాడు గానీ ఔరంగజేబు తన సమాధి చాలా సాదాసీదాగా ఆకాశానికి తెరచి ఉండేలా కట్టించాలని కోరుకున్నాడట. కాస్త మట్టి తడిపి ఒక మొక్క నాటమన్నాడు. ఆ తర్వాత కాలంలో లార్డ్‌ కర్జన్‌ అక్కడ పాలరాయి వేయించి జాలి పెట్టించాడు. ఇప్పుడు అక్కడ బారికేడ్లు పెట్టి పహారా పెంచారు. యాత్రీకులు వచ్చి చూడటం పూలను ఉంచడం జరుగుతూనే ఉంది. శివాజీ కుమారుడైన శంభాజీ రాజా వంశవారసుడుగా చెప్పుకునే బీజేపీ ఎంపీ ఉదయ రాజే భోస్లా ఇప్పుడు ఆ సమాధిని ధ్వంసం చేయాలంటున్నాడు గాని, నిజానికి ఏముందని ధ్వంసం చేస్తారని చార్మీ హరికిషన్‌ ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ లో ప్రశ్నించారు. మోడీ మూడోసారి పాలనలో ఈ దేశ ప్రజలకు నాగపూర్‌లో హింసాకాండ ఆశ్చర్యంగా అనిపించక పోవచ్చు. రకరకాల రాజకీయ నేత లూ వ్యాఖ్యాతలు ఇలాంటివి చర్చ చేయడం బీజేపీకే లాభమని సిద్ధాంతం చెప్పొచ్చు. గాంధీ హత్యపై పాఠం ఇప్పుడేం అవసరమని విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల లోక్‌సభలోనే చెప్పారు. కానీ నాలుగువందల ఏళ్లనాటి ఔరంగజేబుపై మాత్రం ఉద్రేకాలు పెంచుకోవాలి మరి!
నాగపూర్‌ కేంద్రంగానే!
కర్ఫ్యూ దాకా వెళ్లిన నాగపూర్‌లో మళ్లీ పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఔరంగజేబుకు ఇప్పుడు ప్రాధా న్యత లేదని ఆరెస్సెస్‌ నాయకులొకరు బెంగళూరులో చేసిన వ్యాఖ్యను మీడియా ప్రముఖంగా ఇచ్చింది.అంటే తగు సమయంలో తీసుకుందామని ఆయన మాటల సంకేతం. ఛావా సినిమా భావోద్వేగాలు రగిలించడంతో ప్రజలు ఔరంగజేబుపై రెచ్చిపోయారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ శాసనసభలో సూటిగానే చెప్పేశారు. ఫడ్నవీస్‌ నాగపూర్‌ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీదీ నాగపూర్‌ లోక్‌సభ నియోజకవర్గమే. ప్రస్తుతం అల్లర్లు చెలరేగిన చోటు ఆరెస్సెస్‌ జాతీయ కేంద్ర కార్యాలయమైన హెగ్డేవార్‌ భవన్‌కు దగ్గర్లోనే ఉంటుంది. ”శంభాజీ మహారాజ్‌ను ఔరంగజేబును హింసించిన తీరును ఆ చిత్రం చాలా వివరంగా దృశ్యీకరించడం ప్రజాగ్రహాన్ని రగిలించిందని” ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీని వెనక లోతైన పథకం ఉన్నట్టు కనిపిస్తుంది. ‘ప్రజలు శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోకూడదు’ అని ప్రకటించారు. సమతుల్యత లేకుండా ఒక వర్గాన్ని రెచ్చగొట్టడమే ధ్యేయంగా కాశ్మీర్‌ ఫైల్స్‌, ది కేరళ స్టోరీ, రజాకార్‌ వంటి చిత్రాలు పనిగట్టుకుని నెత్తినెత్తుకున్నదెవరు? మొత్తం మంత్రి వర్గం కట్టగట్టుకుని వెళ్లి ఛావా సినిమాను చూసి విపరీతమైన ప్రచారం కల్పించింది. రూ.500 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఎంతగా జనాన్ని ఉద్రేక పర చిందంటే గుర్రంపై ఒక వ్యక్తి హరహర మహాదేవ్‌ అని అరుస్తూ థియేటర్‌ లోకి దూసుకుపోయిన వీడియో వైరల్‌గా ప్రచారమైంది. ప్రేక్షకులు చాలా థియేటర్లలో రకరకాలైన విధ్వంసక చర్యలకు పాల్పడిన వార్తలు మహా రాష్ట్ర మీడియాలో ప్రసారమయ్యాయి. ప్రతి మరాఠీ వ్యక్తి ఈ కథ తెలుసుకోవాలి గనక తన పదేళ్ల కుమారుడిని ప్రత్యేకంగా తీసుకొచ్చినట్టు ఆ జిల్లాలోని ఒక డ్రైవర్‌ మీడియా వాళ్లతో చెప్పాడు.
ఈ డ్రైవర్‌ చెప్పింది బాగానే ఉంది గానీ ఏది గతం? ఏది ప్రస్తుతం? ప్రఖ్యాత చరిత్రకారిణి రోమిలా థాపర్‌ తాను రాసిన 750 పుటల గ్రంథానికి ‘మన ముందున్న గతం'(ద పాస్ట్‌ బిఫోర్‌ అజ్‌) అని పేరుపెట్టారు. ముందున్న అనే పదానికి ఇక్కడ రెండర్థాలు తీసుకోవాలి. గడచిపోయిన అనీ, ఇప్పుడు ముందుకు తెస్తున్న అని. గతాన్ని ఎలా చూస్తాము అందులోంచి ఏది తీసుకుని ఎలా చెబుతామన్నది ప్రస్తుత పాలకవర్గాల ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది, ఔరంగజేబు క్రూర పాలకుడే గాక దేవాలయాలకు కూడా నిధులిచ్చినట్టు కూడా చరిత్ర ఆధారాలు చెబుతున్నాయనీ,ఈ చిత్రంలో ఔరంగజేబును పాక్షికంగా చిత్రించారనీ విమర్శించినందుకు సమాజ్‌ వాది పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఔరంగజేబుకు అనుకూలంగా మాట్లాడే వారెవరినీ సహించేది లేదని ముఖ్యమంత్రి ఇతర మంత్రులు సభలో ప్రకటించారు. అతని సమాధిని తొలగించాలని భోస్లే చేస్తున్న వాదనలోని సెంటిమెంటుతో తామూ ఏకీభవిస్తామని కూడా ఫడ్నవీస్‌ చెప్పేశారు. కాకపోతే ఆ సమాధి పురావస్తుశాఖ(ఎఎస్‌ఐ) అధీనంలో ఉంది గనక చట్ట ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కారు.
నష్టపోతున్నదెవరు?
ఈ అల్లర్ల సందర్భంగా పవిత్రమైన చద్దర్‌ తగలబెట్టిన ఘటనతో తమకేమీ సంబంధం లేదని వీహెచ్‌పీ ఖండిస్తున్నది. కానీ పోలీసులు మాత్రం తమ దగ్గర వీడియో ఫుటేజి ఉందంటున్నారు. స్థానికులు కూడా చద్దర్‌ దగ్ధం చేయడం చూశామంటున్నారు. కానీ ఖురాన్‌ సూక్తులు గల చద్దర్‌ కాల్చేశారనడం నిజం కాదని ముఖ్య మంత్రి ప్రకటించారు. ‘ఔరంగజేబు దిష్టిబొమ్మలు తగలబెట్టుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. ఖురాన్‌ సూక్తులతో కూడిన చద్దర్‌ను టార్గెట్‌ చేయడమే తప్పు’ అని స్థానిక ముస్లిం నాయకులు ఖండిస్తున్నారు. అదే ఆ వర్గాల్లో కూడా ఆగ్రహం పెరగడానికి కారణమైంది. ఖుల్దాబాద్‌ మొదటి నుంచి అన్ని మతాల వారూ ఎలాంటి తేడాలు లేకుండా కలసి మెలసి జీవిస్తున్నారని, చక్రవర్తి సమాధి సంరక్షణ చూసే నిస్సార్‌ అహ్మద్‌ మీడియాకు చెప్పారు. మతకలహాలు రగిలించేందుకు కొందరు దుండగులు ప్రయత్నించడం వల్లనే ఇదంతా జరుగుతున్నది.ఈ అల్లర్లలో ఎప్పుడూ పేదవాళ్లనూ ఉద్యోగాల్లేని యువకులను ముందుకు నెడుతుంటారు. చిచ్చుపెట్టేది ఒకరైతే గాయపడేవారు, నష్టపోయేవారు మాత్రం ఈ కుర్రాళ్లే అని ఆయన ఆవేదన చెందారు. పవిత్ర రంజాన్‌ మాసంలోనే ఇలా జరగడమే మరీ బాధ కలిగిస్తుందని వాపోయాడు. ‘మొఘలుల చరిత్రను పూర్తిగా తుడిచేయాలని ఎవరైనా అనుకుంటే వారు భారతదేశ చరిత్రనే తిరగరాయవలసి వుంటుంది. అది చాలా ప్రమాదకరమైన పని’ అని కూడా వ్యాఖ్యానించారు. ఈ సామాన్యుడి మాటలటుంచి గొప్ప చరిత్రకారులను అడిగినా గతం గురించి నిరాధారమైన ద్వేషంతో ప్రజల మధ్య మతం మంటలు పెట్టడం సరికాదంటారు.
చరిత్రలో ఉన్నదేంటి?
సంఫ్‌ుపరివార్‌ మొదటినుంచి ఔరంగజేబును తమ మత రాజకీయాలకు ఇంధనంగా వాడుకుంటున్నది. ఈ దేశం రాముడితే గానీ ఔరంగజేబుది కాదని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వంటివారు ప్రకటించారు. అసలు లౌకిక వాదులందరూ ఔరంగజేబుకే ఔలాద్‌(సంతతి) అనేది వారికి బాగా ఆలవాటైన, ఇష్టమైన దూషణ, విద్వేష రాజకీయాలకు ఎప్పుడూ ఒక బొమ్మ కావాలి. ఒక కథనం కావాలి. టిప్పుసుల్తాన్‌ నుంచి బాబర్‌, ఔరంగ జేబుల వరకూ ఆగర్భ శత్రువులుగా చిత్రించడం హిందూత్వ రాజకీయాస్త్రం మాత్రమే. దానికి చరిత్రలో కచ్చితమైన ఆధారాలేమీ లేవు. మతవాదులు చెబుతున్నట్టు భారతదేశంలో ముస్లిం లేదా ఇస్లాం చరిత్ర అంతా ఒకటి కాదు. ఆఫన్‌టర్క్‌, పర్షియా, పాయలుంటాయి. ఇస్లామిక్‌ చరిత్ర అంటూ ఏకఖండంగా ఉండదు. ఉన్నది కూడా భారతీయ సంప్రదాయ పద్ధతి మేళవించబడి ఉంటుంది.
పదమూడో శతాబ్దంలో గియాసుద్దీన్‌ బాల్బన్‌(1255-65) కాలానికి సంబంధించి ఢిల్లీలో బయటపడిన ఒక హిందూ భక్తుడి శాసనం చూస్తే సుల్తాన్‌ బాల్బన్‌ పాలనలో విష్ణుమూర్తి హాయిగా పవళించాడని చెబు తున్నది. హర్యానాలో బయటపడిన నారాయణ రాతి శాసనం మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ను భూమండలం మీద పాలకుల్లో రత్నం లాంటివాడని కీర్తిస్తున్నది. 1369 కాశ్మీర్‌ శాసనం ఒకటైతే రాజు షహాబుద్దిన్‌ను క్షత్రియ వారసుడుగా పాండవ గృహ నివాసిగా ప్రశంసిస్తున్నది. అసలు రాజులు ఎవరైనా దైవనిర్ణయం ప్రకారమే పాలి స్తారని కూడా ఆనాటి అనేక గ్రంథాలు శాసనాలు చెబుతున్నాయి. రాజులు, రాజ్యాల మధ్య యుద్ధాలు, రాజ్యం అణచివేత ఉన్నట్టే ముస్లింల పాలనలోనూ జరిగింది. కొందరిలో అది ఎక్కువగా ఉండొచ్చు కానీ బ్రిటిష్‌వారు హిందూ యుగం, ముస్లిం యుగం అని విభజించిన తర్వాతనే రెండు మతాల మధ్య విడిగా చూసే ధోరణి పెరిగింది.1808లో మృత్యుంజయ విద్యాలంకార రాసిన రజబలి అక్బర్‌ను పొగుడుతూ- ఔరంగజేబ్‌ దేవా లయాన్ని నాశనం చేయడంతో పాటు పోషించడమూ జరిగిందని చెబుతుంది. కానీ 1878లో వచ్చిన భోళా నాథ చక్రవర్తి భారతేశ్వర్‌ ఇతిహాసలో సుదీర్ఘమైన ముస్లిం పాలన వల్లనే హిందూసమాజం పతనమై విలువలు క్షీణించి పోయిందని, ఆ తర్వాత యవనులు(ఇంగ్లీషువారు) రాకతో పతనం మరీ తీవ్రమైందని రాస్తాడు. ఈ క్రమంలోనే వందేళ్ల కిందట ఆరెస్సెస్‌ పుట్టాక వారి మత రాజకీయాల కోసం ఔరంగజేబును ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ఆయన జిజియా పన్ను(జుట్టుపై) వేయడం గురించి చెబుతుంటారు. కానీ అధికారం చేపట్టాక ఇరవై ఏళ్ల తర్వాత ఆయన ఈ పన్ను విధించడం జరగలేదనీ మతద్వేషమే కారణమైతే రెండు దశాబ్దాలు ఎందుకు నిరీక్షిస్తూ ఉండిపోయాడని చరిత్రకారులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని విషయాల్లో ఔరంగజేబు ఇతరుల కంటే మేలని కొందరు చెబుతున్నారు గానీ అదీ అవసరం లేని వాదనే, ఏదైనా గతమే.
ఎన్నికల నాటి పాచికే
నిజానికి బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనే ఔరంగజేబును రంగంలోకి తెచ్చింది. కానీ విజయం సాధించిన తర్వాత దానికి సమస్యలు మరింత తీవ్రంగా ఎదురవుతున్నాయి. మహారాష్ట్రలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు, తీవ్ర ఆర్థిక సమస్యల నుంచి దృష్టి మరలించడం కోసం పాలక కూటమి కావాలనే ఈ వందల ఏళ్లనాటి సమాధి వివాదాన్ని ప్రోత్సహించిందని ‘హిందూ’ పత్రిక సంపాదకీయంలో స్పష్టంగా విమర్శించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ నేతలు ఔరంగాబాద్‌ను ఎన్నికల సమస్యగా చేసి ఓట్లు పొందారని గుర్తు చేసింది. హిందూ పడవ(సంవత్సరాది) తొలిరోజు ఉత్సవం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 30న నాగపూర్‌ వస్తున్నారు. అక్కడ తొలిసారి ఒక ప్రధాని హెగ్గేవార్‌, గోల్వార్కర్‌ స్మృతి మందిర్‌ను సందర్శించ నున్నాను. ఈ ఘర్షణలు ఆయన రాకకు ఆహ్వానం పలకడానికేనా? అని సందేహం కలుగుతుంది. రానున్న రెండేళ్లలో బీహార్‌, యూపీ, గుజరాత్‌లతో సహా కీలక రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షాలు తొక్కుతూ బతుకుతున్నారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఎగతాళి చేశారు. ఇక నేరుగా తమ శాసనసభ ఎన్నికలే వచ్చాక ఆయనలాంటి వారు మరెన్ని వివాదాలు ముందుకు తెస్తారో? చాలామంది దీన్ని మరో అయోధ్య వివాదంలా చూస్తున్నారంటే కారణమదే. త్వరలో రాబోయే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సినిమా ‘హరిహర వీరమల్లు’ కూడా ఔరంగ్‌జేబ్‌పై కాషాయ తరహా పోరాటమేనట!

– తెలకపల్లి రవి

Spread the love