Thursday, May 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజియూజ్ అండ్ త్రో..!

యూజ్ అండ్ త్రో..!

- Advertisement -

నవ మోసాలూ మోసి మాసి కన్న బొగ్గు గడ్డ అది!
రెండు లక్షల కోట్ల టన్నులకుపైగా బొగ్గున్న
నేలలో ఆ తల్లి కడుపులో బుల్లి ‘కార్బన’ నలుసు పడిందని,
పైగా అదీ మగ నలుసనీ టెక్నీషియనో, డాక్టరో
లీకిస్తే ఆ తల్లి అవధుల్లేని ఆనందాన్ని
ఆ పరమాత్ముడే పర్సనల్‌గా చూశాడు
కార్బన్ నలుసంటే వజ్రమనుకుంది
మిడిమిడి సైన్స్ జ్ఞానమున్న ఆ పిచ్చితల్లి!
తీరా నెలలు నిండిన తర్వాత బయటపడ్డది
రాకాసి బొగ్గుగడ్డ!
ఏసీల్లో పుట్టి, ఏసీల్లో పెరిగిన తర్వాత
ఐరావతమంత కాకపోయినా, ఎంతో కొంత
శ్వేతార్ణవం అవుతుందనీ, కొందరు
రాకాసుల నుదుట బ్రహ్మదేవుడు
ముందే ప్రింట్ చేసి, కిందికి తోస్తాడని
అటువంటి మగ శిశువు నీ ఇంట జన్మించడంతో,
మీ వంశమే పునీతమైందని
ఒక పీఠాధిపతి ప్రవచించాడు.
దాంతో కుటుంబమంతా ఫుల్ హ్యాపీస్
కేవలం బ్రహ్మరాతల్నే నమ్ముకుని మానవ
ప్రయత్నాలు మానలేమనుకున్నారో ఏమో!
ఆ తల్లితో కషాయాలు తాగించారు, కాషాయాలు కట్టించారు
చివరికి భగవదేచ్ఛను చూసి కుటుంబం మురిసి పోయింది
శుక్లపక్ష చంద్రుడోలే..
అటు పూరా కురూపీకాదు, ఇటు అందగాడూ కాదు
బాలుడు దినదిన ప్రవర్తమానమవుతూ.. పెరిగాడు
నూనూగు మీసాలొచ్చిన తర్వాత… పుట్టిన నేల్లో
బొగ్గు గడ్డల వేడిని సైపలేక
ఆంధ్రాలో.. తూర్పు దిక్కుకి విహారానికెళ్లాడు
అరకు వ్యాలీ కోసం అనుకునేరు!
అగ్రహారాలెలా వుంటాయో.. గిరీశానికి తాపం ప్రకోపించిందెందుకో
చిన్నపాటి రీసెర్చ్ చేద్దామనుకున్నాడు.. ఇంకేం..!?
రంగంలోకి దూకాడు
క్రిష్ణరాయపురం అగ్రహారం, అగ్నిహోత్రావధాన్లు ఇల్లు!
గిరీశం పాడుకున్న పాటనే లొల్లాయి పదాల్లా.. సన్నగా..
బాత్రూం సంగీతంలా పాడుతూ…
“కాముని విరిశరముల బారికి నే,
నేమని సంహింతునే, చెలి, యేమని సహింతునే!”
గిరీశం ఆనాడు ఏమన్నాడంటే “వీడి తస్సాగొయ్యా! వీడి బాణాలు పువ్వులటోయి? ఆ మాటలు (ఈకాలంలో) ఎవడు నమ్ముతాడు? పిచ్చి వెధవెవడైనా నమ్మాలిగానీ, నా అనుభవంతో చెప్తున్నా, నిజమేమిటంటే ‘ మంచి పదునైన లోహం మొనకి డైమండ్ పాయింట్ వేసి, పోయిజన్‌లో ముంచి, కంటికి కనబడకుండా మంత్రించి విసురుతాడు. అందుకే పైకి గాయం కనపడదుగానీ, పోలీసోళ్ల దెబ్బల్లా లోపల తహ తహ పుట్టిస్తాయి’అనుకుంటూ బుచ్చెమ్మను లేవదీసి కెళ్లి ఏదో చేద్దామనుకున్న గిరీశం ఆ రోజుల్లో ఏమి చేయలేకపోయాడు. తనలా కాదు. వజ్రపు మొనలూ లేవు. పాయిజన్‌లో ముంచడాలూ లేవు. బాణాలు వెయ్యడాలూ అంతకన్నా లేవు. 19వ శతాబ్దంలోనే ఒక దారి మాత్రం చూపిన గిరీశం అమర్‌రహే! అనుకుంటూ 21వ శతాబ్దపు పద్ధతులు అమలు చేశాడు మన హీరో.
డ్రగ్స్‌కు, మందుకు అలవాటు, అంటే, తన అలవాట్లన్నీ ఆమెకూ నేర్పాడు. ముందు పూటకూళ్లమ్మతో సరసం, తర్వాత మధురవాణి, ఆ తర్వాత అగ్నిహోత్రావధాన్ల ఇంట్లో దొరికిన అన్‌ఫార్ట్యునేట్, బ్యూటిఫుల్, వర్జిన్, యంగ్ విడో దొరికితే తగులుకుంటే నాటి సమాజం తప్ప్పుపట్టిందా? అలానే ఇంకో అందమైన పిల్ల దొరికితే ఆమెను తగులుకోవటం తప్పెలా అవుతుంది? అంతమాత్రం చేతనే ‘పోక్సో’ కేసు పెట్టడం ఏం న్యాయం?
యూజ్ అండ్ త్రోలు కేసులు పెట్టుకుంటూ పోతే ఈ దేశం ఎక్కడికిపోతుంది?
ఆరెస్బీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -