వట్టే జానయ్య యాదవ్ దారేటూ.?

– పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తు,
– కేసీఆర్‌ను కలిసిన బీఎస్ పీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ – సూర్యాపేట
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు ఉంటుందని ఇరు వర్గాలు ధ్రువీకరించాయి. దీంతో సూర్యాపేట జిల్లాలో  బి.ఆర్.యస్, బిఎస్పి పార్టీల మధ్య కొన్నిచోట్ల హర్షం వ్యక్తం చేస్తుండగా ఇంకొన్ని చొట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మరి ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో చూస్తే….గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని రాజకీయంగా విభేదించి బయటికి వచ్చిన  మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్  బిఎస్పి పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేసిన విషయం తెల్సిందే. మరి రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల కలయిక నేపథ్యంలో జానయ్య పరిస్థితి ఎంటన్నది చర్చనీయాంశంగా మారింది.గత ఎన్నికలకు ముందు బి.ఆర్.యస్ ప్రభుత్వ హయాంలో జానయ్య పై ఒకేరోజు 70 కేసులు నమోదైన విషయం తెల్సిందే. ఇవన్నీ జగదీష్ రెడ్డి డైరెక్షన్లో జరిగాయని ఆనాడు బిఎస్పి చీఫ్ ప్రవీణ్ కుమార్ జానయ్య కు మద్దతుగా నిలిచారు. కేసుల నేపథ్యంలో అప్పటికి  జానయ్య అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే ఆయనకు అండగా ప్రవీణ్ కుమార్ నిలిచిన విషయం తెల్సిందే. ఇదే కాకుండా జగదీష్ రెడ్డి ఓటమే లక్ష్యంగా సూర్యాపేట బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థిగా జానయ్య ను ప్రవీణ్ కుమార్  ప్రకటించారు.అనంతరం జానయ్య గెలుపు కోసం బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు మాయావతి తో జిల్లా కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ వేడిని రాజేశారు.ప్రధానంగా జగదీష్ రెడ్డి ఓటమే టార్గెట్ గా బిఎస్పి ప్రచారం కొనసాగిన విషయం తెల్సిందే. అనంతరం జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములకు జానయ్య కీలకంగా మారిన విషయం తెల్సిందే.ఇక రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బి.ఆర్.యస్ ఓటమి పాలైoది. కొన్ని రోజులు రాజకీయంగా స్తబ్దత గా ఉన్న జానయ్య ఇటీవలే మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం సమయంలో బి.ఆర్.యస్ తిరుగుబాటు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి కి మద్దతు తెలిపారు. తన భార్య 13 వ వార్డు కౌన్సిలర్ వట్టే రేణుక తో పాటు బిఎస్పి కి చెందిన కౌన్సిలర్లు గండూరి పావని కృపాకర్, అన్నేపర్తి రాజేష్ లతో కూడా అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయించారు. ఈ ఎపిసోడ్ లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దిలిప్ రెడ్డి కి మద్దతు ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కాంగ్రెస్ కు చెందిన అగ్ర నేతలు, ఎమ్మెల్యేలు జానయ్య తో మాట్లాడి బిఎస్పి కౌన్సిలర్ల మద్దతు తీసుకున్నారు. కాగా అనంతరం అవిశ్వాసం వీగి పోవడంతో అసంతృప్త కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాగా వట్టే జానయ్య తో  పాటు బిఎస్పి కౌన్సిలర్లు రేణుక,అన్నేపర్తి రాజేష్,గండూరి పావని కృపాకర్ లు మాత్రం కాంగ్రెస్ లో చేరలేదు.ఇందులో గండూరి పావని కృపాకర్ మాత్రం త్వరలోనే బి.ఆర్.యస్ లో చేరుతామని ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదిలావుండగా జానయ్య ను రాష్ట్ర పార్టీలోకి తీసుకొని కమిటీలో కీలక బాధ్యతలు అప్పజెప్పాలని పార్టీ భావించింది. ఇదే కాకా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ స్తానం నుంచి జానయ్య ను యంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రవీణ్ కుమార్ సమాలోచనలు చేశారు. ఇందుకు జానయ్య కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.కాగా ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారడంతో బిఎస్పి చీఫ్ కేసీఆర్ ని కలిసి పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. మరి ఈ నేపథ్యంలో వట్టే జానయ్య యాదవ్ ఈ ప్రకటన పట్ల ఎలాoటి నిర్ణయం తీసుకుంటారనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Spread the love