– స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న కోల హరీష్
– మళ్లీ తెరపైకి నేరెళ్ల బాధితుల అంశం
నవతెలంగాణ – తంగళ్లపల్లి
పార్లమెంటు ఎన్నికల వేళ కరీంనగర్‌లో నేరెళ్ల బాధితుల అంశం మళ్లీ తెరపైకొచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నేరెళ్ల బాధితుల పక్షాన కోల హరీష్ బరిలో ఉంటున్నట్టు తెలిపారు. తమకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వాలు మారినా న్యాయం జరగడం లేదని, పార్లమెంటు వేదికగా తమ గొంతులు వినిపించడానికి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఎనిమి దేండ్లుగా పోరాటం చేసినా.. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై చర్యలు తీసుకోకపోగా.. ప్రమోషన్లు వస్తున్నాయని, సర్వస్వం కోల్పోయిన తమకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పెట్టిన కేసు ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ కాలేదని, గతంలో అన్ని పార్టీలు హామీ ఇచ్చినా ఇప్పటివరకు అధికారులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. తమకు న్యాయం కావాలని జనంలోకి వెళ్లి అడుగుతామని, అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బరిలో ఉంటున్నామని స్పష్టం చేశారు.