జోరుగా మట్టి దందా.. వాల్టా చట్టానికి తూట్లు

– ఇటాచి లారీలతో మట్టి తరలింపు
– నిద్రావస్థలో సంబంధిత అధికారులు
– భారీ లారీల కారణంగా ఇబ్బందులు పడుతున్న గన్నారం ప్రజలు
నవతెలంగాణ – రాయపర్తి
అసైన్డ్ భూములు రోజురోజుకూ అక్రమార్కుల చేతిలో తరిగిపోతున్నాయి. ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెతి చూడకపోవడం మట్టి వ్యాపారులకు వరంగా మారింది. వివరాల్లోకి వెళితే మండలంలోని తిర్మాలాయపల్లి గన్నారం గ్రామాల మధ్యలోని సర్వే నెంబర్ 369, 370, 371, 373లో 43 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో రోజూ రాత్రినక, పగలనక మట్టిని తరలిస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున దందా కొనసాగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు మట్టిని కొల్లగొట్టి రైస్ మిల్లు నిర్మాణాలకు మట్టిని అమ్ముకుంటున్నారు. వాల్టా చట్ట ప్రకారం మట్టి తవ్వకానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. ఇందుకోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రైతుల నుంచి పట్టా భూముల నుంచి మట్టిని తరలించినా రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ మట్టి వ్యాపారులు నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా శాఖలకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. అక్రమార్కులకు కొందరు ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో మట్టిని దర్జాగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ మట్టి తవ్వకాలు కండ్లముందే జరుగుతున్నా అధికారులు కట్టడి చేయకపోవడం శోచనీయం.
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో మట్టి దందా..
గత ప్రభుత్వం హయాంలో తిరుమలాయపల్లి గన్నారం మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సన్నాహాలు చేసింది. 04 – 02- 2023 రోజున అప్పటి వరంగల్ ఆర్డీవో మహేందర్ జీ, తహశీల్దార్ సత్యనారాయణ ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. 43 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించి మిగిలిన స్థలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాలక్రమేన ప్రభుత్వాలు మారడంతో ఫ్యాక్టరీ నిర్మాణ విషయం కనుమరుగయింది. ఇదే అదునుగా భావించిన కొందరు ఆ భూమిలో మట్టిని అమ్ముకుంటూ పబ్బం గడుపుతున్నారు. తిరుమలాయపల్లి గ్రామానికి చెందిన పలువురు ఈ భూమి తమదేనంటూ 6 లక్షల 50 వేల రూపాయలకు బేరం కుదుర్చుకొని మట్టిని రైస్ మిల్ నిర్మాణానికి అమ్ముకుంటున్నారు.
లారీలతో.. గన్నారం ప్రజల ఇక్కట్లు
ఇటాచి భారీ లారీలతో రోజుల తరబడి మట్టిని తరలిస్తుండడంతో గన్నారం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వాహనాలు అతివేగంగా రోడ్డుపై వెళ్లడంతో ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు భయభ్రాంతులకు గురవుతున్నాము అని తెలుపుతున్నారు. గన్నారం నుండి కొండూరు దుర్గమ్మ గుడి ప్రక్కన రోడ్డు గుండా రాయపర్తి  రామచంద్రుని చెరువు వరకు డ్రైవర్లు లారీలను సినిమా రేంజ్ లో నడుపుతున్నారు. 12 ఫీట్ల బీటి రోడ్డుపై ఈ భారీ లారీలు వెళ్లడంతో ఎదురుగా వచ్చే వాహనాలు రోడ్డు పక్కనే ఉండే ముళ్లపదల్లోకి వెళ్ళవలసి వస్తుంది అని స్థానికులు తెలుపుతున్నారు. లారీలు నిత్యం నడవడంతో బీటీ రోడ్డు ధ్వంసం అవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిలో మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భారీ వాహనాల నుండి తమను రక్షించాలని కోరుతున్నారు.
Spread the love