తెలంగాణలో కార్మికవర్గ పోరాటాలు ఉధృతమైనాయి. మరో వైపు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పేదల పోరాటం విస్తరిస్తున్నది. అంగన్వాడీలు, ఆశాలు, గ్రామపంచాయతీ కార్మికులు, మధ్యాహ్నభోజన పథకం కార్మికులు, స్కూల్ స్వీపర్లు, సర్వశిక్ష అభియాన్ కార్మికులు, వైద్య ఆరోగ్య శాఖ లోని అనేక పథకాలకు చెందిన ఉద్యోగులు నిరవధిక సమ్మెలో ఉన్నారు. ఐదు షెడ్యూల్డు పరిశ్రమలలో ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు కూడా తిరగదోడుతున్నది. అంతే కాదు. పోరాడుతున్న అనేక రంగాల కార్మి కుల మీద ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయో గిస్తున్నది. అయినప్పటికీ మడమ తిప్పని కార్మికులు పోరుబాటలో ఉన్నారు. నియం తృత్వ పోకడలను ప్రతిఘటిస్తున్నారు.
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 17 నెలల కింద మొదలైన పోరాటం మరింత విస్తరి స్తున్నది. 19 జిల్లాలలో 67 కేంద్రాలకు విస ్తరించింది. ములుగు జిల్లా వాజేడు, జగిత్యాల పట్టణం, సంగారెడ్డి జిల్లా కంది పోరాట కేంద్రాలకు కొత్తగా విస్తరించింది. మహబూబాబాద్‌లో కలెక్టర్ కార్యాలయం వెనుక ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసిన రెండువేల మంది మీద నిర్బంధం కొనసాగుతున్నది. 12వసారి గుడి సెలు తగులబెట్టారు. ప్రత్యక్షంగా, స్థానిక బీఆర్‌ఎస్ శాసన సభ్యుడు శంకర్ నాయక్ ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయి. హన్మకొండ జిల్లా గోపాలపురం పోరాట కేంద్రం మీద స్థానిక బీఆర్‌ఎస్ కార్పొరేటర్ ప్రోత్సా హంతో గూండాలు దాడులు చేసారు. పదిమంది గుడిసె వాసులకు గాయాలయ్యాయి. అయినా గాయపడిన వారి మీదనే పోలీ సులు కేసులు పెడుతున్నారు. శ్మశానవాటిక పేరుతో ఒక కులాన్ని పేదల మీద ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారు. కందిలో గుడిసెల మీద పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి ధ్వంసం చేసారు.
అంగన్వాడీల రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు, రిటై ర్మెంట్ బెనిఫిట్స్, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ, రిటైర్మెంట్ వయస్సు తదితర సమస్యల పరి ష్కారం కోసం పోరాడుతున్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత మంత్రి సత్యవతి రాథోడ్‌తో జరిగిన చర్చల్లో ఇచ్చిన వాగ్దానాలు ఉల్లంఘించారు. ఫలితంగా అన్ని కలెక్టర్ కార్యా లయాల దగ్గర ధర్నాలు చేసారు. సీడీపీఓ కార్యాలయాలు, శాసనసభ్యుల నివా సాలు ముట్టడించారు. 39,377 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరవధిక సమ్మెలో పాల్గొ న్నారు. సమ్మెలో ఉండగానే ప్రభుత్వం మినీ సెంట ర్లను అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిటైర్మెంట్ వయస్సు 65 ఏండ్లకు పెంచింది. ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి అంగీ కరిస్తూ ప్రకటించింది. దహన సంస్కారాలకు ఆర్థిక సహా యం ప్రకటించింది. అయినా అంగన్వాడీలు వెనక్కి తగ్గ లేదు. అక్టోబర్ 4న చలో హైదరాబాద్ పిలుపు నందుకుని వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు చర్చలకు పిల వకతప్పలేదు. అప్పటికే ప్రకటించిన రాయితీలకు తోడు రిటైర్మెంట్ బెనిఫిట్స్, అనారోగ్య కారణాలతో వలంటరీ రిటైరయ్యే అవకాశం, పీఆర్‌సీ వర్తింపజేస్తూనే మధ్యంతర భృతి కూడా వర్తింపజేయటం, సమ్మెకాలపు వేతనాల చెల్లిం పునకు అంగీకరించారు. ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వ ర్యంలో పోరాడేందుకు హైదరాబాద్ తరలివచ్చిన అంగన్వాడీ లు విజయోత్సవ సభ జరుపుకుని 24 రోజుల సమ్మె విరమించారు.
రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు, మల్టీపర్పస్ విధానం రద్దు తదితర సమ స్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్మికులు 32,600 మంది కలెక్టర్ కార్యా లయాలను ముట్టడించారు. శాసనసభ్యుల నివాసాలు ముట్టడించటంతో 42మంది శాసనసభ్యులు వీరి సమస్యలను శాసన సభలో ప్రస్తావించక తప్పలేదు. గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇల్లు కూడా ముట్టడించటంతో 200 మంది కార్మికులను రెండు రోజులపాటు పోలీసులు నిర్బంధించారు. ఇన్సూరెన్స్ సౌకర్యం, దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం గురించి ప్రభుత్వం సర్క్యు లర్లు విడుదల చేయవల్సి వచ్చింది. 34 రోజుల సమ్మె అనంతరం మంత్రితో జరిగిన చర్చల్లో వాగ్దానాల మేరకు సమ్మె విరమించారు. కానీ నెలదాటినా వాగ్దా నాల అమలు ఊసులేదు. దీనితో వేలాదిగా హైదరాబాద్ తరలివచ్చారు.
16,573మంది ఆశాలు కూడా 18వేల రూపాయల ఫిక్స్‌డ్ వేతనం, తదితర డిమాం డ్లతో రాష్ట్ర వ్యాపిత సమ్మెలో ఉన్నారు. కలెక్టర్ కార్యాలయాల దగ్గర 15వేల మంది ధర్నాల్లో పాల్గొన్నారు. తహసీల్ కార్యాలయాలు, శాసన సభ్యుల ఇండ్లు ముట్టడించారు. అన్ని ప్రాథ మిక ఆరోగ్యకేంద్రాల దగ్గర ధర్నాలు చేసారు. ఐదువేల మంది హైదరాబాద్ తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. మరో 2వేల మందిని రాకుండా మార్గమధ్యంలో అరెస్టు చేసారు. సెప్టెంబర్ 25న ప్రారంభమైన సమ్మె 9వ తేదీతో ముగిసింది. వేలాదిమంది ఆశాలు హైదరాబాద్‌లో కోటి చౌరాస్తాలో అనేక గంటలపాటు రోడ్లన్నీ దిగ్భంధనం చేసారు. ఫలితంగా ప్రభుత్వం ఆశాల సమస్య పరి ష్కారం కోసం ఉన్నతాధికారులతో కమిటీ నియ మిస్తామని ప్రకటించక తప్పలేదు.
కాంట్రాక్టు పద్ధతిలో నియమించిన ఉద్యోగు లను విస్మరించి, 1520 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫి కేషన్ విడుదల చేసింది. దీనిని రద్దు చేయాలనీ, మెడికల్ అండ్ హెల్త్ రంగంలోని వివిధ పనులలో, వివిధ పేర్లతో కాంట్రాక్టు పద్ధతిలో నియమించినవారిని రెగ్యులరైజ్ చేయా లని కోరుతూ 6వేలమంది 20 రోజులు సమ్మె చేసారు. ఫలితంగా ప్రభుత్వం 490 పోస్టులు పెంచింది. సర్వీసు వెయిటేజ్ 20 నుంచి 30 మార్కులకు, వయో పరిమితి 49 నుండి 53 సంవత్సరాలకు పెంచుతూ ఆదే శాలు జారీ చేసింది. ఇతర సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు ఉన్న తాధికారులతో కమిటీ వేసింది. డైరెక్టర్ కార్యాలయం దగ్గర భారీ ధర్నా అనంతరం జరిగిన చర్చల్లో అంగీకారం కుది రింది. సమ్మె విరమించారు. 17వేల మంది నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు కూడా ఉద్యోగ భద్రత కోసం వారం రోజులు సమ్మెచేసారు. డైరెక్టర్ హామీతో విరమించారు.
పెంచిన వేతనాల అమలు, పెండింగ్ బిల్లులు, మార్చిన మెనూకు తగిన బడ్జెట్ పెంపుదల తదితర సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్న భోజన కార్మికులు మూడు రోజులు సమ్మె చేసారు. మంత్రి ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదు. ఫలితంగా 262 మండల కేంద్రాలలో ధర్నాలు జరిగాయి. 3106 మంది హైదరాబాద్‌లో ధర్నా చేసారు. సెప్టెంబర్ 28న ప్రారంభమైన సమ్మె ఈ నెల 9వ తేదీన తాత్కాలికంగా వాయిదా వేశారు. మున్సిపల్ కార్మికులు 34 కమిషనరేట్ల ముందు ధర్నాలు చేసారు. రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు తదితర డిమాండ్లతో 9200 మంది ధర్నాలలో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికులు సమ్మెలోకి వచ్చారు. ప్రభుత్వ పాఠ శాలల స్వీపర్లు కూడా స్పాంటేనియస్‌గా ఒక జిల్లాలో సమ్మె ప్రారంభించి రాష్ట్రమంతా విస్తరించారు. 80 రోజులు సమ్మె సాగింది. సర్వ శిక్ష అభియాన్ కార్మికులు కూడా 20 రోజులు సమ్మె చేసారు.
అనేక ఇతర రంగాలలో కూడా పోరాటాలు విస్తరిం చాయి. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ‘104’ ఉద్యోగులు, వివిధ శాఖలలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, యూనివర్సిటీల ఉద్యోగులు, విద్యుత్తు ఉద్యోగులు, సెక్యూ రిటీ గార్డులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్‌పోర్ట్ కార్మి కులు, హమాలీలు రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో ధర్నాలు చేసారు. ఐదు జిల్లాలలో మిషన్ భగీరథ కార్మికులు పోరాడు తున్నారు. రామగుండం ఎన్‌టీపీసీ కార్మికులు 3వేలమంది పది గంటల పాటు హెడ్డాఫీసు దగ్గర బైటాయించి సమ స్యలు పరిష్కరించుకున్నారు. సింగరేణి కార్మికులు కూడా ఒప్పందం అమలు కోసం సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యా లయంలోకి చొచ్చుకుపోవాల్సి వచ్చింది. మేడ్చల్ జిల్లా డంపింగ్ యార్డ్ కార్మికులు 400మంది టూల్‌డౌన్ చేసిన తర్వాతనే సమస్యలు పరిష్కారమయ్యాయి.
పోరాటాల మీద ప్రభుత్వ నిర్బంధం పెరిగింది. లాఠీ చార్జీలు చేసారు. అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు అనేకచోట్ల అధికారులే పగులగొట్టారు. పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ-వీఓఏలు, ఆర్పీలను అంగన్‌వాడీ సెంటర్లు నడపా లని ఒత్తిడి చేసారు. పోటీ కార్మికులుగా ప్రయోగించేందుకు ప్రయత్నించారు. వారంతా చైతన్యంతో నిరాకరించారు. 50 మందికి పైగా అంగన్‌వాడీల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఆదిలాబాద్‌లో సీఐ టీయూ, ఏఐటీ యూసీల జిల్లా కార్యదర్శులను పదిరోజుల పాటు నగర బహిష్కరణ చేసారు. సమ్మెలో ఉన్న పంచాయతీ కార్మికులను ఉద్యోగం నుంచి తొలగి స్తామని బెదిరించారు. అనేక మందిని అక్రమంగా అరెస్టు చేసారు. అయినా కార్మి కులు మొక్కవోని ధైర్యంతో పోరాడారు.
పాలకులు అప్రజాస్వామిక ధోరణులు ప్రదర్శిస్తున్నారు. సకాలంలో సమస్యలు పరిష్క రించకపోగా, సమ్మెలో ఉండగా చర్చలే జరి పేది లేదన్నారు. ముఖ్యమంత్రి దయతో ఇచ్చిన పుడు తీసుకో వాలని చెబుతున్నారు. ఇవన్నీ చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. కార్మికులు సమ్మెలో ఉండగా, వారితో చర్చించకుండా, ఏక పక్షంగా కొన్ని రాయితీలు ప్రకటిస్తారు. సమిష్టి ఒప్పందాలకు వ్యతిరేకం. ఇది సమిష్టి బేర సారాల హక్కు నిరాకరించడమే. పాలకుల ఎత్తు గడలు, నియంతృత్వ పోకడలు కార్మికుల ఐక్య పోరాటాల ముందు నిలబడలేవు కదా! ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. సమ్మెలతో సమ స్యలు పరిష్కారం కావంటూనే సమ్మె కాలంలోనే సమస్యలు పరిష్కరిస్తూ ప్రకటనలు, ఆదేశాలు జారీ చేయక తప్పలేదు. మంత్రులు, అధికారులు సమ్మెలో ఉన్న కార్మికుల ప్రతినిధులతో చర్చించక తప్పలేదు.
ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నం చేసే ఎత్తుగడలను ప్రజలు అంగీకరించలేదు. అనేకచోట్ల అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు అధికారులు పగులగొడుతుంటే ప్రజలు, లబ్దిదారులు అడ్డుకున్నారు. కార్మికులు ఐక్యంగా పోరాడితే, ప్రజలతో మమేకమైతే పాలకుల నిర్బంధాలను సైతం ఎదుర్కొని విజయం సాధించవచ్చు. ఈ పరిణామాలు దీనినే రుజువు చేస్తున్నాయి.
ఎస్ వీరయ్య