వక్ఫ్‌ బిల్లు.. రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి

Waqf Bill.. an attack on the basic structure of the Constitution”ప్రస్తుత భారతదేశంలో ముస్లింలను నమాజ్‌ చేసినందుకు అవమానిస్తారు. ఆవు పేరుతో కొట్టి చంపుతారు. శాఖాహారం పేరుతో వారి దుకాణాలను బహిష్కరిస్తారు. వారి గుర్తింపు కారణంగా వారికి అద్దె ఇండ్లు నిరాకరిస్తారు. వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తారు. వాస్తవం ఇది కాగా ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసమే ఈ వక్ఫ్‌ బిల్లు తీసుకువచ్చిందని చెబుతున్నారు. ఇది మనం నమ్మా లంటా…! ఎంత హాస్యాస్పదం.” -రవిష్‌ కుమార్‌ (జర్నలిస్ట్‌)
రాజ్యాంగం, ప్రజాస్వా మ్యాలపై తమకు ఏమాత్రం గౌరవం లేదని మోడీ ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముస్లిం ప్రజల ధార్మిక వక్ఫ్‌ ఆస్తులపై కన్నేసి వివాదాస్పద వక్ఫ్‌ సవరణ బిల్లు తెచ్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తూతూ మంత్రంగా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్‌ చైర్మన్‌గా కమిటీ వేసింది. కమిటీ ప్రతిపక్షాలు, ముస్లిం ప్రజల ప్రతిపాదనలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఏకపక్షంగా నివేదికను ఖరారు చేసింది. దీన్నిబట్టి ప్రభుత్వానికి వక్ఫ్‌ ఆస్తులను బడా బాబులకు అప్పగించాలనే ఆలోచన ఉంది. అందుకే ఈ బిల్లు సున్నితమైన మతపరమైన అంశంగా కాక ఆస్తులకు సంబంధించిన అంశంగా చూసింది. తన మంది బలంతో’ ‘మాయ సభ’ లో బిల్లును ఆమోదింప చేసుకుంది. మొదటినుండి మోడీ ప్రభుత్వం వక్ఫ్‌ ఆస్తులపై విష ప్రచారం మొదలుపెట్టింది. నిజానికి వక్ఫ్‌ ఆస్తులు ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తులు కావు. మొత్తం ముస్లిం సమాజానికి చెందిన ఆస్తులు.(ప్రతి మతానికి ఇలాంటి ఆస్తులు ఉన్నాయి) ఇందులో మొత్తం ముస్లిం సమాజ ప్రయోజనాలే ఉంటాయి .విద్య, వైద్యం, దర్గాలు, ఈద్గాలు ముస్లిం ధార్మిక సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు దీనిపై వచ్చే ఆదాయం ఖర్చు చేస్తారు. తరాలుగా ముస్లిం ప్రజల మేలు కోసం ముస్లిం చక్రవర్తులు, నవాబులు, సంపన్న ముస్లింలు దాతృత్వంతో ఉదారంగా దాన మిచ్చిన ఆస్తులివి. ఇవి ఏమాత్రం ప్రభుత్వ ఆస్తులు కావు. ఈ ఆస్తులు సంరక్షించడానికి ఓ చట్టం ఉంది. అదే వక్ఫ్‌ చట్టం.
ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవటమే మోడీ అసలు లక్ష్యం. తద్వారా తమ పారిశ్రామిక మిత్రులైన ఆదాని, అంబానీలకు ఈ ఆస్తులు ధారాదత్తం చేయటం కోసమే ఈ బిల్లు తెచ్చింది. తదుపరి లక్ష్యం ఆలయాలు, చర్చిలు గురుద్వారాల భూములు ఆక్రమించుకుంటారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వాస్తవం కూడా ఇదే. ఇదంతా హిందూత్వ మసుగులో జరిగిపోతోంది. నిజానికి హిందూ ప్రజలకు జరుగు తున్న మేలు శూన్యం. మోడీ ప్రభుత్వం ఏదైనా మంచి చేసిందంటే అది ఆదాని, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకే అన్న విషయం హిందూ మిత్రులు గ్రహించాలి. ఈ సందర్భంగా శివసేన నేత ఉద్దవ్‌ ఠాక్రే మాట్లాడుతూ ” బీజేపీ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి కాశ్మీర్‌ పండిట్లకు వారి భూములు తిరిగి అందజేసిందా…?” అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే అయోధ్యలో 13వేల ఎకరాల భూ స్కాం జరిగింది. కేదార్‌నాథ్‌లో 300 కేజీల బంగారం మాయమైంది. ఇలా హిందువుల ఆస్తులు కాపాడలేకపోయారు. ఇప్పుడు వక్ఫ్‌ సవరణ బిల్లు పేరుతో ముస్లింల ఆస్తులు కాపాడుతామంటూ ఉత్తర కుమార ప్రగల్పభాలు పలుకుతున్నారు. మరోవైపు చైనా ఆక్రమించిన మన భూముల్ని కాపాడలేక పోతున్నారు. మొన్న అమెరికా మన దేశంపై 27 శాతం సుఖం విధించింది. ఇది మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి చాలా నష్టం జరగనున్నది. అలాగే దేశంలో నిత్యం పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం, పేదరికం, ఉపాధి, విద్య , వైదమందక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మౌలిక అంశాలు కప్పిపుచ్చడానికి హిందూ, ముస్లిం పేరుతో విభజన రాజకీయాలు నడుపుతూ పబ్బం గడుపుకుంటున్నారు.
మొత్తంగా ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేసింది. ఇది రాజ్యాంగం మైనార్టీలకు ఇచ్చిన హక్కులు తొలగించబడతాయి. ప్రాథమిక హక్కులు సైతం ఉల్లంఘిస్తుంది. వక్ఫ్‌ ఆస్తులను నియంత్రించి, కేంద్రీకరిస్తుంది. ము స్లింలకు సంబంధించిన వక్ఫ్‌ బోర్డులో ముస్లిం మేతరులకు స్థానం కల్పించడం ద్వారా ముస్లిం సమాజ హక్కులను బలహీనపరచటం, మతపరమైన వారి సొంత విషయాలపై ప్రభుత్వం జోక్యం వంటి ప్రమాదకర అంశాలున్నాయి. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 25, 26, 27, 28 ,29, 30లకు విరుద్ధంగా ఉంది. అలాగే రాష్ట్రాల జాబితాలోకి వచ్చే భూముల అంశంలోకి కేంద్రం చొరబాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇది రాజ్యాంగ సమైక్యస్ఫూర్తికి విరుద్ధం. ఏమైనా ఈ బిల్లు ద్వారా ప్రజలకు ఉన్న మత హక్కును హరించటమే. మతం అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. రాజకీయాలను, రాజ్యాంగాన్ని, సామాజిక వ్యవస్థను మతం ప్రభావితం చేయకూడదు. రాజ్యాంగం మత స్వేచ్ఛను ఇచ్చి, లౌకికతత్వం భారతీయ జీవన విధానం అని చాటి చెప్పింది. మతాల మధ్య సోదర భావం కల్పించే రాజ్యాంగ విలువలు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించారు. ఆ విలువలను గౌరవించేలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నేడు బీజేపీకి తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. దీన్ని లౌకికవాదులు వ్యతిరేకించాలి.
ఇంత వివాదాస్పద బిల్లును ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నితీష్‌ కుమార్‌ , చంద్రబాబు సమర్ధించటం ఆశ్చర్యం…! బీజేపీకి వీరు అంత తలవంచాల్సిన అవసరం ఏముంది? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చూసి నేర్చుకోవాలి. బీజేపీతో చెలిమి ధ్రుతరాష్ట్ర కౌగిలితో సమానమని చంద్రబాబుకు బాగా తెలుసు. 2014-17ల మధ్య బీజేపీతో అంట కాగి దెబ్బతిన్నాడు, విమర్శలు గుప్పించాడు. ఏదైనా ప్రజల్ని విస్మరించి పబ్బం గడుపుకునే రాజకీయ పార్టీలు ప్రజాపునాదిని కోల్పోతాయి. ఉనికిలో లేకుండా పోతాయి. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితే ఇందుకు ఉదాహరణ. ‘సనాతన’ జనసేన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇసుమంతైన సైద్ధాంతిక పునాది, రాజకీయ నిలకడ ఈ పార్టీకి లేవు. ఏపీలో బీజేపీ పిల్ల పార్టీగా వ్యవహరిస్తున్నది. త్రిపురనేని, విద్యాసాగర్‌, కందుకూరి, పెరియార్‌లు నడయాడిన దక్షిణాది నేలపై సనాతన వాదులకు చోటులేదని చరిత్ర తేల్చి చెప్పింది. అధికారంలోకి వచ్చిన 2014 నుండి మోడీ సర్కార్‌ నియంతృత్వ ధోరణితో దూకుడుగా ముందుకు సాగుతున్నది. ఢిల్లీ రైతు ఉద్యమ స్ఫూర్తితో ప్రజలంతా ఏకమవ్వాలి. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని అడ్డుకోవాలి. దీనికి కుల మతాలకతీతంగా బలహీన బడుగు వర్గాలు సహకరించాలి.
షేక్‌ కరిముల్లా
9705650705

Spread the love