వక్ఫ్‌బిల్‌ టు నాగపూర్‌.. వివాదాల పరివార్‌!

Waqf Billప్రధాని నరేంద్ర మోడీ ఈ పదవి చేపట్టిన తర్వాత పదకొండేండ్లకు మార్చి 30న నాగపూర్‌లోని ఆరెస్సెస్‌ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించటం జాతీయ స్థాయిలో కచ్చితమైన రాజకీయ సంకేతాలిచ్చింది. ఔరంగజేబు సమాధికి సంబంధించిన నాగపూర్‌లో అల్లర్లు జరగటం, పార్లమెంట్లో వక్ఫ్‌బిల్లు ఆమోదం, కాశీ మధురల్లో మసీదు మందిర వివాదాల్లో ఆరెస్సెస్‌ కార్యకర్తలు పాల్గొనవచ్చునని దాని కీలక ద్వితీయ నాయకుడైన దత్తాత్రేయ హోసబులే కాషాయ జెండా ఊపడం ఒక వరసలోవే. త్వరలో జరిగే బీహార్‌, యూపీ, గుజరాత్‌, బెంగాల్‌, కేరళ ఎన్నికలకు ముందు బీజేపీ సంఘ పరివార్‌ హిందుత్వ ఎజెండాను ఉధతం చేయబోతున్న సూచనలే.
పార్లమెంట్‌లో వక్ప్‌బిల్లు మీద జరిగిన హోరాహోరీ పోరాటం ఒక విషయాన్ని స్పష్టం చేసింది రాజ్యాంగం 25 నుంచి 28 అధికరణాల వరకు మత స్వేచ్ఛకు ఇస్తున్న ప్రాథమిక హక్కులపై దాడిగా ప్రతిపక్షాలు ఈ బిల్లును ఎదుర్కొన్నాయి. అయితే హోంమంత్రి అమిత్‌ షా, బిల్లును ప్రతిపాదించిన న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు మాత్రం ఇదేదో పేద ముస్లింలకు మేలు చేయడానికి తెచ్చినట్టు గొప్పలు పోయారు. కానీ వారి భాష, ఇచ్చిన ఉదాహరణలు చూస్తే రాజకీయ కోణం స్పష్టమవుతుంది. ‘ఈ పార్లమెంటు భవనం కూడా వర్క్‌ వక్ఫ్‌ కిందకే వస్తుందని వారు వాదిస్తారని’ రిజుజు ముస్లింలను ఉద్దేశించి అన్నారు. చర్చను కాంగ్రెస్‌ వైపు మళ్లించి 2014 ఎన్నికలకు ముందు ఆ పార్టీ వేలాది ఆస్తులను కట్టబెట్టిందని ఆరోపించారు. దేశ ఆస్తులను ముస్లింలకు అప్పగించడం జరుగుతోందన్న దురాభిప్రాయాన్ని కలిగించి మతాల స్పర్ధగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం ఉపయోగిస్తున్న అస్త్రమే ఈ చట్ట సవరణ. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ఎవరైనా భారతీయులైనన్న రాజ్యాంగ స్పహను దెబ్బ తీసేలా ముస్లిం సంస్థల ఆస్తులు వశపరచుకోవటం పెద్ద విజయంలాగా చూపించటం ఎన్నికల లబ్ధి కోసమే. వక్ఫ్‌ బోర్డులోని 22 మంది సభ్యులలో నలుగురు ముస్లి మేరతులు ఉండాలని నిర్ణయించటం నిస్సందేహంగా వారి మత భావాలను దెబ్బతీసే అంశం అవుతుంది. ఒకవైపున తిరుపతిలో అన్యమత ఉద్యోగులను కూడా తొలగించాలంటున్న తీరుకు ఇది పూర్తి విరుద్ధం. దేవాలయాలను పూర్తిగా మత సంస్థలకు అప్పగించాలంటూ ఇటీవల విజయవాడలోనే భారీ సమీకరణ జరపటం కూడా చూశాం. రాజ్యాంగం మైనారిటీ మతాలకు ప్రత్యేక రక్షణ కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థ బాధ్యత గుర్తించడం, దేశ సమైక్యతను కాపాడుకోవడం కోసమే. కులమత లింగ వివక్ష లేకుండా పౌరులందరూ ఒకే హక్కులు కలిగి ఉండటం, ప్రజాస్వామ్యం కనుక రక్షణలు ఎప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్న వారికే కల్పించబడతాయి. భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత సామరస్యం భవిష్యత్తు భద్రతకు అత్యవసరమని అరక్షణమైన మర్చిపోకూడదు.
వక్ఫ్‌పై కేంద్రం భాష
2019లో బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగానే కాశ్మీర్‌ 370 అధికరణం రద్దుకు పాల్పడటం వెనుక ఏ వ్యూహం ఉందో మూడోసారి నెగ్గాక వక్ఫ్‌మీద దాడి కేంద్రీకరించటం వెనకా అదే ఉంది. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీలు మాత్రమే కాక రెండు లౌకిక పక్షాలు కూడా దాన్ని బలపరచటం దురదష్టకరం. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా వైసీపీ, అలాగే బీఆర్‌ఎస్‌ ఈ బిల్లుపై బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేయడం విశేషం. బిల్లు ఆమోదం పొందాక ‘ఇది చారిత్రక మూలమలుపు’అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా అచ్చంగా అలాంటి ప్రకటన విడుదల చేయడం యాదృచ్చికం కాదు. తెలుగుదేశం పార్టీ తాము ఏవో సూచనలు చేశామంటూ కొన్ని సంకేతాలివ్వడానికి ప్రయత్నించినా వారి భేషరతుగా మద్దతు ఇవ్వడమే దేశం గుర్తించింది. దక్షిణాది సీట్ల తగ్గింపు, ఈ బిల్లు రెండు విషయాల్లో వ్యవహరించిన దాన్నిబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు మోడీని ఏ మాత్రం వ్యతిరేకించరాదని నిర్ణయించుకున్నట్టు ‘హిందూ’ ప్రత్యేక వ్యాసమే ప్రచురించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో వుంది గనక బీజేపీ కన్నా దాన్నిే ఎదుర్కోవటం కీలకమని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ కూడా ఈ బిల్లు విషయంలో మాత్రం వ్యతిరేకించి ఓటేయడం మంచి విషయమే. ఇటీవల తిరుపతిలో జరిగిన పరి ణామాలు, ఇప్పుడు పాస్టర్‌ ప్రవీణ్‌ మరణంపై సాగుతున్న వివాదం విద్వేషపూరిత వ్యాఖ్యలన్నీ గమనిస్తే చాప కింద నీరులా తెలుగు రాష్ట్రాల్లోనూ మత రాజకీయాలు చొరబడుతున్న తీరు తీరు కళ్లకు కడుతుంది. ఇక్కడ బీజేపీ పెద్ద శక్తి కాకపోయినా వామపక్షాలు ఎక్కువ కేంద్రీకరిస్తున్నాయంటూ మాట్లాడే వాళ్లకు ఈ పరిణామాలే హెచ్చరికలవుతాయి. వక్ఫ్‌ బిల్లును గజెట్‌ అయ్యాక సుప్రీంకోర్టులో సవాలు చేస్తామంటున్న నేపథ్యం ఒకవైపుంటే, అటు నుంచి మతపరమైన స్పందనలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సిందే.
నాగపూర్‌ నాటకాలు
మోడీ పర్యటన విషయానికి వస్తే ఆయన నాగపూర్‌లో మాధవ నేత్రాలయను ప్రారంభించటంతో పాటు ఆరెస్సెస్‌ మూల స్తంభాలైన హెగ్డేవార్‌,గోల్వాల్కర్‌ల స్మతి చిహ్నాలను సందర్శించటం, వ్యూహాత్మకంగా నిర్ణయించుకున్న కార్యక్రమాలే గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి మాత్రమే వాటిని సందర్శించిన ప్రధానమంత్రి.ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా బయలుదేరిన నేత అయినప్పటికీ నరేంద్ర మోడీ కూడా ఈ 11 ఏళ్లలో అక్కడికి వెళ్లిన దాఖలాలు అసలు లేవు. ఆయన వ్యక్తిగత నాయకత్వ శైలి సంఘపరివార్‌ పెద్దలకు నచ్చలేదని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి కానీ అదంతా పరివార్‌ పాచిక మాత్రమే. ఆరెస్సెస్‌ సాంస్కతిక సంస్థ మాత్రమేనని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేదనే భ్రమను కొనసాగించే ఎత్తుగడ అది. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన మంత్రివర్గం మొత్తం శాఖల వారీగా ఆరెస్సెస్‌ ముందు సమీక్షకు హాజరైంది.
గతేడాది అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ సంప్రోక్షణ కార్యక్రమానికి మోడీ తోపాటు ప్రస్తుత ఆరెస్సెస్‌ సద్నేత మోహన్‌ భగవత్‌ కూడా హాజరయ్యారని గుర్తుంచుకోవాలి.2024 ఎన్నికలకు ముందు దేశానికి హిందూత్వ సంకేతం ఇవ్వడం కోసమే వారి వారి కాంబినేషన్‌ అక్కడ అవసరమైంది. అయితే ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ ‘గతంలో బీజేపీకి తగినంత బలంలేదు కనుక ఆరెస్సెస్‌ సహకారం తీసుకునేవారుమనీ, ఇప్పుడు సొంతశక్తితో ఎదిగాము కనుక ఆ అవసరం లేదని’ వ్యాఖ్యానించారు. తాను ఏదో దైవకార్యం నిర్వహించడానికి పంపబడినట్టు అనిపిస్తుందని, సాధారణ జీవపదార్థంతో ఉన్నట్టు అనుకోనని చెప్పారు. ఈ రెండు ప్రకటనలు ఆరెస్సెస్‌ వారికి నచ్చలేదనీ కథనాలు నడిచాయి.మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ కోల్పోయి 243 స్థానాలకు పరిమితమైనాక మోహన్‌ భగవత్‌ ఇంటర్వ్యూ ఇస్తూ ఎవరికైనా అహంభావం తగదని వ్యాఖ్యానించారు. తాము సేవకులమనే భావన నుంచి దైవ స్వరూపులమని అహంకరించడం ప్రారంభించిన ప్పుడు దెబ్బతింటారని అన్నారు. మామూలుగానే ఆరెస్సెస్‌ అధినేత కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమ కేంద్ర కార్యాలయం నుంచి సూక్తులు, సుశబ్దాలు వినిపిస్తుంటారు. ఇవి ఎవరిని ఉద్దేశించినవి అన్నది స్పష్టం చేయరు. భగవత్‌ మాటలు మోడీపై అభిశంసనలాంటివేనని బడా మీడియా కథనాలు మొదలు పెట్టింది. నిజంగా చెప్పాలంటే సనాతన సంప్రదాయంలోనూ రాజును దైవ ప్రతినిధిగా మొదట చెప్పి ,తర్వాత నేరుగా దేవుడు గానే అభివర్ణించడం చూస్తాం. ఇదంతా ఒక రాజ్యాధిపత్యం వ్యూహం ప్రకారమే జరిగింది. అటు రాజ్యం ఇటు మతం కూడా రాజు చేతుల్లోనే ఉండటానికి అది మార్గం. కాకపోతే మతాధిపతులు సంధాన కర్తలుగా రాజ్య వ్యవస్థకు అనుగుణంగానే తమ పాత్ర నిర్వహించేవారు. ఇప్పుడు ఇప్పుడు మోడీ భగవత్‌ల సంభాషణ అచ్చంగా అదే చెపుతుంది. సంబంధం ఉందని లేదని రకరకాలుగా చెప్పడం నింంతర తతంగమే. ప్రస్తుత పర్యటనలో కూడా మోడీ ఆరెస్సెస్‌ తమను ఎంతగా ఉత్తేజపరిచిందో సూటిగా చెప్పారు. ఇది సంస్థతో రాజీ వంటిదని కొ ందరు ఇస్తున్న వివరణ అర్థం లేనిది. ఎందుకంటే అసలు అవి ఎప్పుడు దూరంగా ఉన్నాయి?ఒకప్పుడు వాజపేయినే ఈ మాట అన్నారు- మేము విడిపోయిందెప్పుడు అని. వారి మధ్య ఈ అలుక కినుక దూరం రాయబారం కథలన్నీ ఒక క్రీెడలో భాగం. మొన్న మెజార్టి రాలేదుగనక మోడీని మార్చాలని ఆరెస్సెస్‌ భావిస్తున్నందునే ఆయన సర్దుబాటు కోసం వచ్చారని శివసేన ఎంపి సంజరు రౌత్‌ అంటే నాలుగోసారి కూడా ఆయనే ప్రధాని అని మహారాస్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రకటించడం అందులో భాగమే. ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం కొంతకాలం కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. ఒక హైకోర్టు న్యాయమూర్తి దానిపై నిషేదం చెల్లదని ప్రకటించడాన్ని అవకాశంగా తీసుకుని మోడీ సర్కార్‌ దాన్ని ఎత్తివేసింది.ఇప్పుడు అధికారికంగానే ఆరెస్సెస్‌తో చట్టపటాలు వేసుకొని తిరిగే అవకాశం తనకు తానే ఇచ్చుకుంది.
వాటినీ రగిలిస్తాం!!
ఇక హోసబులే ప్రకటనను బట్టి సంఘపరివార్‌ కాశి మధుర వివాదాలను ఎగదోయాలని నిర్ణయించుకున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.స్థానిక భక్తులు లేదా విభిన్న పక్షాలకు పరిమితమైన ఈ తగాదాలు ఇప్పుడు అధికారికంగా పాలక పరివార్‌ స్వీకరిస్తుందన్నమాట.గతంలో మోహన్‌ భగవత్‌ ప్రతి మసీదును తవ్వడం మన పని కాదని సూక్తులు చెప్పినప్పుడే ఆంతర్యం ఇదేనని మనం చెప్పుకున్నాం. అయోధ్య, కాశీ, మధుర మూడు చోట్ల వివాదాలపై ఉద్యమించాలని తాము గతంలోనే అధికారికంగా నిర్ణయించామని హోసబులే గుర్తు చేస్తున్నారు. ఈ మూడు మాకిస్తే మిగిలిన విభాగాలను పక్కన పెడతామని ఎల్‌ కె అద్వానీ ఒక దశలో ప్రతిపాదన పెట్టడం కూడా గుర్తు చేసుకోవాలి. 1991 ప్రార్థన స్థలాలు చట్టం ప్రకారం అయోధ్య మినహా మరి ఎక్కడ ఇలాంటి వివాదాలకు ఆస్కారం ఉండకూడదు. 1947 ఆగస్టు15న ఆయా ప్రార్ధన స్థలాల్లో ఉన్న యధాతధ స్థితిని కొనసాగించవలసి ఉంటుందని ఆ చట్టం స్పష్టం చేస్తోంది. అయినా సుప్రీంకోర్టు ఇలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించి వివాదాలకు అవకాశం ఇస్తుంది. ప్రతి చోటా తగాదాలు రగిలించబడతాయి. ఇదేదో జాతీయ సమస్య తప్ప దక్షిణాన అందులో తెలుగు రాష్ట్రాల్లో అసలు ఆ పరిస్థితి లేదని చెప్పడానికి ఇప్పుడు ఎవరు సాహసించ బోరు. ఎందుకంటే ఆలయాల వివాదాలు మతమార్పిడులు వీటిని కీలకంగా మాట్లాడే సనాతన వాద నేతగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ముందుకు వచ్చారు. తమిళనాడులో అన్నాడీఎంకే మళ్లీ బీజేపీతో చర్చలు ప్రారంభించడం పవన్‌ కళ్యాణ్‌ తమిళంలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలిస్తూ అక్కడ కూడా రాజకీయంగా రంగ ప్రవేశం చేస్తుండడం విస్మరించలేము.మీ కన్నా మేమే సనాతన ధర్మానికి ఎక్కువగా కట్టుబడి ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. పాస్టర్‌ ప్రవీణ్‌ మరణంపై సందేహాలు సంవాదాలను కేవలం వైసీపీ, టీడీపీ తగాదాగా, ఘర్షణగా చూపించే ప్రయత్నాలు కూడా తీవ్రంగా జరుగుతున్నాయి ఇక తెలంగాణలో రాజాసింగ్‌ వంటి వారు బీజేపీకి దూరంగా ఉన్నట్టు మాట్లాడుతూనే ప్రతి సందర్భంలో మతాలు మధ్య చిచ్చు రాజేస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజరు వివాదాలకు పేరు మోశారు. వక్ఫ్‌నుంచి టీటీడీ వ్యవహారాల వరకూ ప్రతిదీ వివాదాస్పదమై మత రాజకీయాలను మన ముంగిట్లోకి తెచ్చి నిలబెడుతున్నదని గుర్తించటం, అప్రమత్తం కావడం తప్పనిసరి.
– తెలకపల్లి రవి

Spread the love