జలాశయాల్లోకి భారీగా చేరుతున్న వరద
వర్షాలతో వరి సాగుపై ఆశాభావం
ప్రత్యామ్నాయ సాగుపై రైతుల మల్లగుల్లాలు
ఎల్లంపల్లిలో 15 గేట్లు ఎత్తి 4లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
నిండు కుండలా కడెం ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తున్న కుంటాల జలపాతం
మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు
భద్రాచలం వద్ద 28.40 అడుగులకు గోదావరి
రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన అధికారులు
సెలవులు రద్దు మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
నవతెలంగాణ- ప్రాంతీయ ప్రతినిధులు/ఆదిలాబాద్/ఉమ్మడి కరీంనగర్/భద్రాచలం/ధరూర్/తాడ్వాయి
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి పారుతున్నాయి. వాగులు, వంకల నీరు రహదారులపైకి రావడంతో పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగి జనజీవనం పూర్తిగా స్తంభించింది. అప్రమత్తమైన యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ వర్షాల ధాటికి ఇప్పటికే సాగుచేసిన పంట పొలాలు నీటమునగడమే కాకుండా, పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని యంత్రాంగం సూచించింది.
రాష్ట్రంతోపాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోపక్క వర్షాల నేపథ్యంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితులుండటంతో వరి సాగుపై తర్జనభర్జన పడ్డ రైతులు ఈ వర్షాలతో వరి సాగుపై ఆశాభావంతో ఉన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆందోళనలో ఉన్న విషయం విదితమే. ఈ క్రమంలో పంట మార్పిడి చేయాలని, ఆరుతడి పంటలనే పండించాలని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు ప్రచారం చేశారు. మూడు, నాలుగు రోజులుగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రైతులు అధికారులు చెబుతున్న ఆరుతడి పంటల సాగుపై సంయమనం పాటిస్తున్నారు. వర్షపాతం అధికంగా నమోదైతే వరి సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.
ములుగు, భూపాలపల్లిలో భారీ వర్షాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడ్రోజులుగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా, వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. మరో రెండ్రోజులపాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.
సమ్మక్కసాగర్‌కు భారీ వరద
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీలో గోదావరి వరద పోటెత్తుతోంది. గురువారం సాయంత్రం 4.00 గంటలకు బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుంచి 7,10,300 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా.. 7,07,994 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్ వెల్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మోటర్లను రన్ చేయడం ద్వారా 3.775 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోశారు. ఇన్‌టేక్ వెల్ వద్ద గోదావరి నది జలమట్టం 79.30 మీటర్లకు పెరిగింది. భూపాలపల్లి జిల్లాలో పల్లె ప్రకృతి తదితర ప్రాంతాల్లో కాళేశ్వరం నుంచి ఎగిసిపడి చేపలు బయటకు వచ్చాయి.
కోట్‌పల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. రెండు జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి నీరు చేరాయి. కోట్‌పల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ డివిజన్ పంచవటి కాలనీలో భారీ వర్షానికి పెద్ద వృక్షం నేలకూలింది.
పొంగిపొర్లుతున్న ఘనపూర్, హల్దీ వాగు
ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఘనపూరం, హల్దీవాగు పొంగిపొర్లుతున్నాయి. నారాయణఖేడ్‌లోని నల్లవాగుకు సైతం వరద నీరు వచ్చి చేరుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు 517 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా.. 470 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల కోసం మంజీర బ్యారేజీకి వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులకు సెలవులు రద్దు చేశారు.
పీపీ రావు ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడ్రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండలంలో మత్తడివాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 38వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అడ ప్రాజెక్టులోకి 37వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లో ఉండగా ఆరు గేట్లను రెండు మీటర్ల ఎత్తుకు ఎత్తి 27వేల క్యూసెక్కుల నీటి దిగువకు వదులుతున్నారు. దహెగాం మండంలోని పీపీ రావు ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. దాంతో ఐదు గేట్లను ఎత్తారు. కుంటాల జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పుప్పాల హనుమాన్ వీధిలో ఆకాశం నుంచి వర్షంతోపాటు చిన్న చేపలు పడ్డాయి.
ప్రాజెక్టుల్లో పెరుగుతున్న వరద
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముసురు అలుముకుంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి, కడెం పరివాహక ప్రాంతాలు, గోదావరి నదీ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహాల వైపు వెళ్లకూడదని ఇరిగేషన్ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కడెం నుంచి వస్తున్న నీటితోపాటు క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి 3,63,997 క్యూసెక్కుల ఇన్-ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ దాదాపు గరిష్ట మట్టానికి చేరుకోవడంతో 62గేట్లలో 15 గేట్లు ఎత్తి 4లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి 1,38,865 క్యూసెక్కుల ఇన్-ఫ్లో వస్తుండటంతో, అధికారులు 16 స్పిల్‌వే గేట్లను ఎత్తివేసి 1,46,592 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 75,432 క్యూసెక్కుల ఇన్-ఫ్లో నిలకడగా కొనసాగుతుండగా, నీటి నిల్వ 18.44 టీఎంసీలకు చేరింది. సిరిసిల్ల పరిధిలోని మిడ్ మానేరు జలాశయానికి గాయత్రి పంప్‌హౌస్, స్థానిక వాగుల ద్వారా 17,242 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి నిల్వ 8.85 టీఎంసీలకు పెరిగింది.
ఎస్సారెస్పీలోకి భారీగా వరద నీరు
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ వద్ద నున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గురువారం ప్రాజెక్టులో 72,452 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రం 1066.6 అడుగులు, 18.131 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 220 క్యూసెక్కులు నీరు మొత్తం అవుట్‌ఫ్లో 751 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. గతేడాది ఇదే రోజు ప్రాజెక్టు నీటిమట్టం 1077.10 అడుగులు కాగా 37.632 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు చెప్పారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో ప్రధాన కాలువ వద్ద 12 అడుగులకు నీరు చేరుకుంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని సావర్‌గావ్ గ్రామ సమీపంలోని కౌలాస్‌నాళా ప్రాజెక్ట్‌లోకి 740 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నీటిమట్టం 454.75 మీటర్ల వద్ద ఉంది.
కందకుర్తి గోదావరిలో జలకళ
ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం పెరగడంతో రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం నీటితో కళకళలాడుతోంది. గోదావరి, మంజీరా, హరిద్రా నదులు కలిసే ఈ త్రివేణి సంగమం పది రోజుల కింద ఇసుక ఎడారిని తలపించగా.. నేడు నీటి ప్రవాహంతో ఉట్టిపడుతోంది. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా తమ పంట పొలాలకు నీటిని అందించే అవకాశం ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలం వద్ద 28.40 అడుగులకు గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గురువారం సాయంత్రానికి 28.40 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి ప్రవాహం 3,88,452 క్యూసెక్కులుగా నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు కాగా, ఆ స్థాయికి చేరితే సుమారు 9,32,288 క్యూసెక్కుల ప్రవాహం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
జూరాలలో 10 గేట్లు ఎత్తివేత
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద తీవ్రత పెరిగింది. గురువారం తెల్లవారుజామున అధికారులు పది గేట్లు ఎత్తేశారు. వారం రోజులుగా కర్నాటక రాష్ట్రంలోని ఆల్మట్టి నుంచి దిగువకు నీరు విడుదలవుతుండగా.. నారాయణపురం మీదుగా 30 వేల క్యూసెక్కుల జలాలు జూరాలకు చేరుతున్నాయి. జూరాల పది గేట్లు ఎత్తి 44,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బీమాకు 1300 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ 492, నెట్టెంపాడుకు 1044 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఆర్డీఎస్‌కు నీటిని విడుదల చేయాల్సి ఉంది.
గుంతలో పడి చిన్నారి మృతి
గుంతలో పడి చిన్నారి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బేడ జంగం అరవింద్-సంధ్య దంపతుల కూతురు నవ్యశ్రీ (2) గురువారం సాయంత్రం ఇంటి సమీపంలోకి వెళ్లింది. వర్షానికి నిండి ఉన్న గుంతలో చిన్నారి ప్రమాదవశాత్తు జారిపడింది. కొన ఊపిరితో ఉన్న నవ్యశ్రీని కుటుంబీకులు చికిత్స కోసం అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కాలనీలో గల్లంతయిన వృద్ధుడు (70) ఆచూకీ ఇంకా లభించలేదు.



