తెలంగాణ రైల్వేల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

We are committed to the comprehensive development of Telangana Railways.– బేగంపేట రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి
– పనులు 90 శాతం పూర్తి
– స్టేషన్‌ను మహిళా లోకానికి అంకితం చేస్తాం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-బేగంపేట
తెలంగాణ రైల్వేల సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్‌ను పూర్తిగా మహిళా లోకానికి అంకితం చేయనున్నామని వెల్లడించారు. బేగంపేట అమృత్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి మొదటి దశ పనులను శనివారం కేంద్ర మంత్రి పరిశీలించారు. స్టేషన్‌ ప్రాంగణంలో పర్యటించి, పనుల తీరును పర్యవేక్షిస్తూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా రూ.38కోట్లతో స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు చేపట్టామని, అందులో తొలి విడత రూ.26 కోట్లతో చేపట్టిన పనులు 90శాతం పూర్తయ్యాయని, మరో 5 నుంచి 10 శాతం సుందరీకరణ పనులు మాత్రమే జరగాల్సి ఉందన్నారు. ఆ వెంటనే రూ.12 కోట్లతో రెండో విడత పనులు చేపడతామని వివరించారు. పనులు నిర్వహించే సమయంలో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రైల్వేస్టేషన్‌లో సెక్యూరిటీ గార్డుల నుంచి అధికారుల వరకు అందరూ మహిళా ఉద్యోగులే ఉండనున్నారని స్పష్టం చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్లో పూర్తి స్థాయి వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స్టేషన్‌ పరిధిలో వినియోగించిన నీటిని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా శుద్ధి చేసి నీటిని తిరిగి మొక్కలకు, స్టేషన్‌లోని ఇతర పనులకు వినియోగించేందకు చర్యలు చేపడుతున్నామన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్‌కు ఎంఎంటీఎస్‌ రైళ్ల కనెక్టివిటీ ఉందని, ప్రస్తుతం ఇక్కడ నుంచి 15వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారని, స్టేషన్‌ ఆధునీకరణ తరువాత ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 40రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి చేస్తున్నామని, అందులో హైదరాబాద్‌లోని బేగంపేట్‌తో పాటు మేడ్చల్‌, యాక త్‌పురా, నాంపల్లి, కాచిగూడ, ఉందానగర్‌, మలక్‌పేట, హైటెక్‌ సిటీ, హఫీ జ్‌పేట స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శశిధర్‌ రెడ్డి, మోండా డివిజన్‌ కార్పొరేటర్‌ కొంతం దీపిక తదితరులు పాల్గొన్నారు.

Spread the love